breaking news
Saptarang 2014
-
ఘనంగా ప్రారంభమైన సప్తరంగ్
ముంబై: రాష్ట్ర ప్రభుత్వం గేట్ వే ఆఫ్ ఇండి యా వద్ద నిర్వహిస్తున్న సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనం ‘సప్తరంగ్ 2014’ ఉత్సవం శుక్రవారం రాత్రి ముంబైలో ఘనం గా ప్రారంభమయింది. ఔత్సాహిక కళాకారుల పురోగతికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ‘ఔత్సాహికులు తమ ప్రతిభ ను ప్రదర్శించడానికి ఇది చక్కని వేదిక. మహా రాష్ట్ర ఘనసంస్కృతిని ప్రదర్శించడానికి కూడా ఉపకరిస్తుంది’ అని అన్నారు. సప్తరంగ్ను ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆద్యం తరం అలరించింది. జనవరి ఐదువరకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద, ఆరు, ఏడో తేదీల్లో నవీముంబై విష్ణుదాస్ భవే ఆడిటోరియంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముగింపు ఉత్సవాన్ని ఠాణేలోని కాశీనాథ్ ఘనేకర్ నాట్యగృహలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ సంగీతకారులు, శాస్త్రీయ నృత్యకారులు ప్రదర్శనలు ఇస్తారు. -
మూడో తేదీనుంచి ‘సప్తరంగ్-2014’
ముంబై: రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ నెల మూడో తేదీ నుంచి సప్తరంగ్-2014 పేరిట సాంస్కృతిక, సంగీత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సాంస్కృతిక విభాగం డెరైక్టర్ అశుతోష్ ఘోర్పడే మంగళవారం తెలిపారు. మూడోతేదీ నుంచి తొమ్మిదో తేదీవరకు జరిగే ఈ కార్యక్రమాన్ని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమం ఐదో తేదీవరకు గేట్ వే వద్ద జరుగుతుందన్నారు. 6,7 తేదీల్లో నవీముంబైలోని విష్ణుదాస్ భావే ఆడిటోరియంలో, 8,9 తేదీల్లో ఠాణేలోని కాశీనాథ్ ఘనేకర్ నాట్యగృహలో కార్యక్రమాలు చేపడతారన్నారు. మొదటి రోజు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, తన సహచరులు ఎ.సెల్వగణేశ్, విక్కు వినయాక్రం, ఎ.శివమణితో కలిసి ‘సదరన్ ఎక్స్‌ప్రెస్’ పేరిట గాన కచేరి నిర్వహిస్తారన్నారు. అనంతరం ఒక్కో రోజు ఒక్కో ప్రముఖుడితో సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు అశుతోష్ ఘోర్పడే తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ముంబైకర్లు ఉచితంగానే హాజరు కావచ్చన్నారు. ఫోర్ట్‌లోని రిథమ్ హౌస్, దాదర్‌లోని మహారాష్ర్ట వాచ్ కంపెనీ, ప్రభాదేవిలోని రవీంద్ర నాట్య మందిర్, ఠాణేలోని ఘడ్కారీ రంగయతన్, వాషిలోని విష్ణుదాస్ భావే నాట్యగృహలో సప్తరంగ్-2014 కార్యక్రమానికి సంబంధించి ఉచిత ప్రవేశ పాస్‌లు లభిస్తున్నట్లు అశుతోష్ ఘోర్పడే వివరించారు. ఈ సమావేశంలో ఘోర్పడేతో పాటు ప్రముఖ గజల్ గాయకుడు భూపేందర్, మిఠాలీసింగ్ తదితరులు పాల్గొన్నారు.