breaking news
salaryes
-
RBI Report: ఏపీలో జీతభత్యాల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలు, జీతాల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది. ఎంతగా అంటే.. 67.26 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గడచిన నాలుగేళ్లలో ఈ వ్యయం కేవలం 39.34 శాతం మాత్రమే పెరిగింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై చేసిన అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అధికంగా రూ.25,086.3 కోట్ల మేర వేతనాలు, జీతాల రూపంలో వ్యయం అవుతోందని నివేదిక పేర్కొంది. అంటే.. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో జీతభత్యాల రూపంలో అధికంగా 84.5 శాతం వ్యయం అవుతోంది. అలాగే, రాష్ట్రంలో ఈ వ్యయం ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ఏకంగా రూ.10 వేల కోట్లు పెరిగింది. చంద్రబాబు హయాం 2018–19లో వేతనాలు, జీతాల వ్యయం రూ.32,743.4 కోట్లు ఉండగా వైఎస్ జగన్ హయాంలో 2019–20లో రూ.42,673.8 కోట్లకు పెరిగింది. ఈ గణాంకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బడ్జెట్ అకౌంట్లను అధ్యయనం చేసిన తరువాత ఆర్బీఐ పేర్కొంది. అలాగే, 2018–19లో వేతనాలు, జీతాల రూపంలో అకౌంట్స్ ప్రకారం రూ.32,743 కోట్లు వ్యయం కాగా.. 2022–23లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ, 54,768.4 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. అంటే నాలుగేళ్లలో రూ.22,025 కోట్ల మేర జీతభత్యాల వ్యయం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కొత్త ఉద్యోగాలు, చిరుద్యోగుల వేతనాలు పెంపుతోనే.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అలాగే, వివిధ రంగాల్లోని 3.01 లక్షల మంది చిరుద్యోగుల వేతనాలనూ భారీగా పెంచారు. దీంతోపాటు 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల అమలు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో వేల సంఖ్యలో కొత్తగా ఉద్యోగాలు భర్తీ.. అలాగే, గ్రామ, వార్డు సచివాలయాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడంతో రాష్ట్రంలో జీతభత్యాల వ్యయం భారీగా పెరిగినట్లు ఆర్బీఐ తన నివేదికలో స్పష్టంచేసింది. -
పంచాయతీ కార్మికులకు వేతనాలివ్వాలని వినతి
గుంటూరు వెస్ట్: ఆరు నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలిపారు. సోమవారం యూనియన్ ప్రతినిధి బందం డీపీవో శ్రీదేవిని కలిసి సమస్యను విన్నవించారు. డీపీవోను కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.హరిప్రసాద్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.పుల్లారావు తదితరులు ఉన్నారు. -
కష్టాల్లో 104 ఉద్యోగులు
నాలుగు నెలలుగా అందని వేతనాలు వేధిస్తున్న మందుల కొరత మూలన పడిన రెండు వాహనాలు కరీంనగర్ హెల్త్ : పిలవకుండానే నేనున్నానంటూ ఇంటిముందు వాలి గ్రామీణ ప్రజలకు వైద్యసేవలందించే 104 వాహనం ఉద్యోగులకు కష్టాలు వచ్చిపడ్డాయి. నాలుగు నెలలుగా వేతనాలు, 20 నెలలుగా రోజువారి అలవెన్సులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అప్పులు చేసి రోజులు గడుపుతున్నారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం వేతనాలు కూడా సక్రమంగా విడుదల చేయడం లేదని 104 సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల పేదలకు వైద్యం అందించాలని దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 104 వాహనాన్ని 2008లో ప్రవేశపెట్టారు. హెల్త్ మేనేజ్మెంట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంస్థ పర్యవేక్షణ బాధ్యత చూసేది. రెండేళ్లుగా డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో నడుస్తున్నాయి. 104 సిబ్బంది రక్తపోటు, మధుమేహం, అస్తమా, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మందులు పంపిణీచేస్తారు. అవసరమైన∙వారికి అక్కడే రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 22 104 వాహనాలు ఉండగా.. 130 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో వాహనంలో డ్రైవర్, సెక్యురిటీ గార్డు, ఫార్మసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డాటాఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. సెక్యూరిటీ గార్డుకు రూ.6500, డ్రైవర్‌కు 8,500, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు 9,500, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషయన్కు రూ.10,900 ఇస్తున్నారు. వీరికి రోజు ఖర్చుల కోసం రూ.70 డీఏ చెల్లించాలి. 20 నెలలుగా డీఏ రాకపోవడంతో చేతిఖర్చులకు డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. రెండు వాహనాలు మూలకు.. జగిత్యాల, కోరుట్లలో 104 వాహనాలు సరైన నిర్వహణ లేక మూలనపడ్డాయి. రెండునెలలుగా జగిత్యాల వాహనం, 15 రోజులుగా కోరుట్ల వాహనం పేదల వైద్య సేవలకు దూరమయ్యాయి. ప్రభుత్వం వీటì నిర్వహణకు బడ్జెట్ కేటాయించకపోవడంతో రిపేర్ చేయించడం లేదు. 2008 నుంచి సేవలు అందిస్తున్న వాహనాలు దాదాపు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంజిన్ డౌన్ అయిపోయి టైర్లు అరిగిపోయాయి. వీటిస్థానంలో కొత్తవి ఏర్పాటుచేయాల్సిన అవసరముంది. సరిపడని మందులు.. ప్రజలకు అవసరమైన, సరిపడా మందులను ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడంలేదు. రక్తహీనతతో బాధపడే గర్భిణులు, పిల్లలకు ఇచ్చే ఐరన్, కాల్షియం మందులు వాహనంలో అందుబాటులోలేవు. దీంతో ప్రజలు 104సేవలను వినియోగించుకుని ఆసక్తి చూపడంలేదు. చెడిపోయిన వాహనాలు గ్రామంలోకి రాకపోవడంతో వైద్య సేవలు అందడంలేదు. అవసరమైన అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. అన్నీ ఉంటే పీహెచ్సీకంటే నయం –ఖలీం, ఫార్మసిస్టు 104లో అన్ని ఉంటే ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కంటే మంచిసేవలు అందించవచ్చు. గ్రామాల్లో అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. రోగులకు వచ్చిన వ్యాధి గురించి వివరించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నాం. వేతనాలు చెల్లించాలి.. –రావుల దేవదాస్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలి. నాలుగు నెలలుగా వేతనాలు, 20 నెలలుగా డీఎ ఇవ్వకపోవడంతో ఇల్లు గడవం కష్టంగా మారుతోంది. వేతనాలు రాకపోవడంతో పిల్లలకు ఫీజులు చెల్లించలేకపోతున్నాం. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నాము. రెగ్యులరైజ్ చేయాలి –యాశ్వాడ ప్రకాశ్, 104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు 104 సిబ్బందిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి. అధికారంలోకి వచ్చే ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండేళ్లుగా ప్రభుత్వానికి పలుసార్లు వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. 104 వాహనాలు పెంచి సేవలు మరింత బలోపేతం చేయాలి.