breaking news
RTC boycott
-
సీమాంధ్రలో సకల బంద్
-
సకలం బంద్
సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఎన్జీఓల సమ్మె సకల జనుల సమ్మెగా మారింది. 13 రోజులుగా జరుగుతున్న ఉద్యమం నిరవధిక సమ్మెగా రూపాంతరం చెందింది. సోమవారం అర్ధరాత్రి నుంచే విద్యార్థి, ఉద్యోగసంఘాలతో పాటు మొత్తం 71 శాఖలకు సంబంధించిన 70 వేల మందికి పైగా ఉద్యోగులు సకలజనుల సమ్మె చేపట్టారు. బంద్ ప్రభావం సోమవారం నాడే కనిపించింది. సమ్మె ప్రభావం చాలా రోజులు ఉండవచ్చనే ప్రచారంతో వ్యాపారులు నిత్యావసరాల ధరలను నింగినంటించారు. నిన్న మొన్నటివరకూ రూ.30 ఉన్న టమోట రూ. 80 నుంచి వంద వరకూ పలికింది. రూ. 40 ఉన్న మిర్చి కేజీ 90 నుంచి రూ.100 వరకు అమ్మగా కిలో రూ.40 ఉన్న క్యారెట్ రూ.70కి చేరింది. ఇక బెండ, దొండ రూ. 60 నుంచి రూ.70 వరకూ పలికాయి. మంగళవారం నుంచి కూరగాయలు దొరకవంటూ వ్యాపారులు సొమ్ము చేసు కున్నారు. బంద్ ప్రభావంతో కూరగాయలు దొరకవన్న భయంతో అడిగినంత ఇచ్చి వినియోగదారులు కొనాల్సి వచ్చింది. సామాన్యులు ఈ ధరలు పెట్టి కూరగాయలు కొన లేక విలవిలలాడారు. మరోవైపు జేఏసీల పిలుపుమేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పెట్రోలు బంక్‌లను 24 గంటల పాటు మూసి వేస్తుండటంతో పెట్రోలు, డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచే పెట్రోల్ లేదంటూ బంకుల యజమానులు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. ఆర్టీసీలో ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు బంద్‌లో పాల్గొంటుండటంతో బస్సులు నిలిచిపోనున్నాయి. వీఆర్వో మొదలుకుని తహశీల్దార్ వరకూ అందరూ సమ్మె బాట పట్టనుండటంతో రెవెన్యూ కార్యాలయాలు దాదాపు మూతపడనున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచే కలెక్టరేట్ బోసిపోయింది. కిక్కిరిసిన ఏసీ మార్కెట్ నెల్లూరు(పొగతోట): సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కూరగాయల వ్యాపారులు మంగళవారం బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం నెల్లూరులోని ఏసీ మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడింది. సకలజనుల సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే ధరలు పెరిగిపోతాయనే ఆందోళనతో నెల్లూరు నగర వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు మార్కెట్‌కు తరలివచ్చారు. ఈ క్రమంలో కూరగాయల ధరలు చుక్కలనంటాయి. మళ్లీ పెరిగిన ఉల్లి గూడూరు: ఉల్లి ధర అమాంతంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే రూ.60 నుంచి రూ.80కి చేరింది. ఉద్యమం పేరు తో ఉల్లిని నల్లబజారుకు తరలించడంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రచారం జరుగుతోంది. -
12 నుంచి ఆర్టీసీ బస్సులన్నీ బంద్ రైళ్లు.. కిటకిట..
సాక్షి, గుంటూరు : గడచిన వారం రోజుల నుంచి రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ టికెట్లు అయిపోయాయి. నెల రోజుల వరకూ ప్రధాన రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు గత్యంతరం లేని స్థితిలో తత్కాల్ టికెట్లపై ఆధారపడుతున్నారు. వారంరోజుల నుంచి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు తగ్గాయి. మూడు జిల్లాల్లోనూ నాలుగైదు రోజులపాటు బస్సులు డిపోల నుంచి బయటకురాలేదు. ఈ క్రమంలో వివిధ రకాల పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇదే జరిగితే గుంటూరు నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, పుట్టపర్తి, శ్రీశైలం వంటి దూరప్రాంతాలకు బస్సులు నడిచే ప్రసక్తే లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణాల వైపు మొగ్గుతున్నారు, ఒకవేళ రాస్తారోకోలు జరిగినా రైలు ప్రయాణం సురక్షితంగా ఉంటుందన్న అభిప్రాయంతో ఎక్కువమంది ఉద్యోగులు, వ్యాపారులు ముందస్తుగా రైలు టికెట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. వారంరోజుల నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లలోనూ బెర్తులు నిండిపోయాయి. గుంటూరు మీదగా నడిచే నారాయణాద్రి, విశాఖ, చెన్నై, కొచ్చిన్, ఫలక్‌నుమా, జన్మభూమి, నర్సాపూర్, ప్రశాంతి, వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లకు రిజర్వేషన్ టికెట్లు దొరకడం కష్టమైంది. స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు ఫస్ట్‌క్లాస్ ఏసీ టికెట్లు కూడా పూర్తయ్యాయి. ప్రశాంతి, ఫలక్‌నుమా, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లకు వెయిటింగ్ లిస్టు దాటి రిగ్రెట్ సమాచారం వస్తోంది. ఒక్కో ట్రైన్లో వెయిటింగ్ లిస్టు చాంతాడంత కనిపిస్తోంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవులు కావడంతో షిర్డీ, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాలని రెండురోజుల ముందు రిజర్వేషన్ టికెట్ల కోసం బండెడు ఆశతో కౌంటర్లకు వెళ్లిన ప్రయాణికులకు వెయిటింగ్లిస్టులు వెక్కిరించాయి. గురువారం రాత్రి గుంటూరు నుంచి ప్రయివేటు బస్సుల్లో ఆయా ప్రాంతాలకు ప్రయాణంచేశారు. ఇదే సరైన సమయంగా భావించిన ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులు హైటెక్ బస్ చార్జీలను పెంచి వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. తత్కాల్ టికెట్లకు డిమాండ్.: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వేరేమార్గం లేక తత్కాల్ టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. గుంటూరు అరండల్‌పేటలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయంలో రోజూ ఉదయం 10 గంటలకు సాధారణ రిజర్వేషన్ టికెట్ కౌంటర్ల కంటే తత్కాల్ టికెట్ కౌంటర్లే కిటకిటలాడుతున్నాయి. ఇవి కూడా అందనివారు ప్రయాణాలను వాయిదా వేసుకోలేక బాడుగ కార్లు బుక్ చేసుకుంటున్నారు.