breaking news
rs.150 crores
-
రూ.150 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం
కణేకల్లు : కణేకల్లు మండలంలో రూ.150 కోట్లతో 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో కన్‌స్ట్రక‌్షషన్ ఈఈ ఎన్.ఆనంద్ తెలిపారు. శుక్రవారం కణేకల్లుకు వచ్చిన ఆయన ఏడీ రామాంజనేయులతో కలిసి స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కణేకల్లు మండలంలో గాలిమరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో ఈ విద్యుత్‌ను సేకరించేందుకు 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. గాలిమరల విద్యుత్ తీసుకోవడంతో పాటు అవసరమైతే ఇళ్లు, వ్యవసాయ రంగానికి అవుట్‌పుట్ కూడా ఇస్తామన్నారు. ఈ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 100 ఎకరాల భూమి అవసరముందని, దీని కోసం స్థల సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్.హనుమాపురం, సొల్లాపురం, మాల్యం గ్రామం వద్ద 100 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. భూసేకరణ ప్రక్రీయ పూర్తి అయితే మార్కెట్ విలువ ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉరవకొండ మండలం మోపిడి వద్ద 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఉందని ఆయన వివరించారు. సోమందేపల్లి, తాడిపత్రి సమీపంలోని తలారి చెరువు వద్ద కూడా ఇలాంటి సబ్‌స్టేషన్ నిర్మాణదశలో ఉందన్నారు. కణేకల్లు ప్రాంతంలో ఇలాంటిదే నాల్గో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. -
రూ.150 కోట్లా... ఏసీబీకే దిమ్మతిరిగింది
హైదరాబాద్ : ఆయనో ప్రభుత్వ ఉద్యోగి... అయితే ఆయన ఆస్తుల చిట్టా మాత్రం చాంతాండంత. ఆ అధికారి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగింది. ఓ బడా వ్యాపారవేత్త సంపాదనకు ఏమాత్రం తీసిపోకుండా కోట్లలో అందినకాడికి దండుకున్నా ఆ తిమింగలం... చివరకు ఏసీబీ వలకు చిక్కటం విశేషం. అయ్యగారి ఆస్తులు సుమారు రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ మయూరి విజయ్ గోపాల్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్‌తో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లపై అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ సందర్భంగా అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. గోపాల్ నివాసంలో షాద్ నగర్, అంబర్‌పేట డీడీ కాలనీ, చిక్కడపల్లి, హయత్ నగర్, నల్లకుంటల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లతో పాటు ఇళ్ల స్థలాలు, భారీ ఎత్తున బంగారం, విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏసీబీ ఇన్స్పెక్టర్లు సీఎస్ వేణుగోపాల్, కాశయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. మరోవైపు గోపాల్ అవినీతి చిట్టాను లెక్కకట్టేందుకు అధికారులకు కనీసం వారం రోజులు సమయం పడుతుందట. గతంలోనూ గోపాల్ అక్రమాస్తుల కేసులో ఓసారి ఏసీబీకి చిక్కారు. ఆ తర్వాత కూడా ఆయన తన అక్రమ సంపాదనను ఆపలేదు. అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్మును గోపాల్...బినామీల పేర ఉంచాడు. అయితే ఆస్తుల వివరాలను ఆ బినామీలకు కూడా తెలియకుండా మేనేజ్ చేశాడు. ఏసీబీ దాడుల సందర్భంగా మీడియా కంటపడకుండా దాక్కున్నా...చివరకు ఏసీబీ అధికారులకు ముందుకు రాక తప్పలేదు.