పోలీస్ అభ్యర్థులపై నకిలీ ‘వల’!
♦ రిక్రూట్మెంట్ వెబ్‌సైట్‌ను పోలిన సైట్‌కు కేటుగాళ్ల రూపకల్పన
♦ చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నేరాలు నియంత్రించే పోలీసుల కొలువులో చేరుదామనుకుంటున్న అభ్యర్థులకు ఆ మోసాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవమయ్యేలా నేరగాళ్లు చూపిస్తున్నారు. ఆధునిక సాంకేతితకను అనుకూలంగా మార్చుకొని ఖాకీల కొలువులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంటాయన్న పక్కా ప్లాన్‌తో ఏకంగా నకిలీ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు. ఇది అసలు వెబ్సైట్ పేరుకు దగ్గరగా ఉండటంతో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. రిక్రూట్మెంట్ బోర్డు వాస్తవ వెబ్సైట్ www.tslprb.in కాగా.... అందుకు దగ్గరగా ఉండేలా నకిలీ వెబ్సైట్ www.telprb.com రూపొందించారు.
నకిలీ వెబ్ స్క్రీన్‌పై ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఆన్లైన్ అప్లికేషన్’ అని ఉంది. దీంతో వెంటనే విషయం గ్రహించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. నకిలీ వెబ్సైట్ ఉదంతాన్ని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు...నిందితులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నేరగాళ్లు ఆన్లైన్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు...నకిలీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులెవరైనా ఫీజులు చెల్లించినట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
తొలి రోజే దాదాపు 10 వేల దరఖాస్తులు
పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తులు తొలిరోజైన సోమవారం 10 వేలకు పైగా చేరినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు విధానంలో అభ్యర్థులు తప్పిదాలకు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు వెబ్సైట్లో డమ్మీ అప్లికేషన్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో నిర్వహించిన రిక్రూట్మెంట్కు తెలంగాణ పది జిల్లాల నుంచి 2 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి రిక్రూట్మెంట్కు భారీగా వయసు సడలింపు ఉండటం, చాలా కాలంగా నియామకాలు లేకపోవడంతో దాదాపు 3 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్సైట్లో అంతరాయం కలగకుండా ఉండటంతోపాటు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినా స్వీకరించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.