ఆరోగ్యమిత్రలపై ప్రభుత్వం చిన్నచూపు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి మూలస్తంభాలైన ఆరోగ్యమిత్రలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్, నగర కార్యదర్శి పీవీఆర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యమిత్ర ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం జ్వాలానరసింహంను కలిసి ఆరోగ్యమిత్రలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జీవోల ప్రకారం నైపుణ్యం లేని, అక్షరాస్యత లేని దిన కూలీలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నెలకు 6700 చెల్లిస్తుండగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆరోగ్యమిత్రలకు 4600 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులకు చెందిన ఆరోగ్యమిత్రలకు 7200తో సరిపుచ్చుతున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న వారి బాగోగులు చూడటం, మందులు సక్రమంగా మింగుతున్నారో లేదో వారి గ్రామాలకు వెళ్లి పరిశీలించాల్సిన బాధ్యత ఆరోగ్యమిత్రలపై ఉందన్నారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా నెలకు వెయ్యి రూపాయల ఎఫ్‌టీఏ ఇస్తున్నప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కొన్ని గ్రామాలు దూర ప్రాంతాల్లో ఉండటంతో ఎఫ్‌టీఏ సరిపోవడం లేదన్నారు. ఆరోగ్యమిత్రలకు జీవో నెం.3 అమలు చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఎఫ్‌టీఏ సకాలంలో చెల్లించడంతోపాటు 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జాతీయ సెలవు దినాలు మంజూరు చేయాలని కోరారు.