breaking news
rajiv gandhi health scheme
-
ఆరోగ్యమిత్రలపై ప్రభుత్వం చిన్నచూపు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి మూలస్తంభాలైన ఆరోగ్యమిత్రలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్, నగర కార్యదర్శి పీవీఆర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యమిత్ర ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం జ్వాలానరసింహంను కలిసి ఆరోగ్యమిత్రలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జీవోల ప్రకారం నైపుణ్యం లేని, అక్షరాస్యత లేని దిన కూలీలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నెలకు 6700 చెల్లిస్తుండగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆరోగ్యమిత్రలకు 4600 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులకు చెందిన ఆరోగ్యమిత్రలకు 7200తో సరిపుచ్చుతున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న వారి బాగోగులు చూడటం, మందులు సక్రమంగా మింగుతున్నారో లేదో వారి గ్రామాలకు వెళ్లి పరిశీలించాల్సిన బాధ్యత ఆరోగ్యమిత్రలపై ఉందన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా నెలకు వెయ్యి రూపాయల ఎఫ్‌టీఏ ఇస్తున్నప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కొన్ని గ్రామాలు దూర ప్రాంతాల్లో ఉండటంతో ఎఫ్‌టీఏ సరిపోవడం లేదన్నారు. ఆరోగ్యమిత్రలకు జీవో నెం.3 అమలు చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఎఫ్‌టీఏ సకాలంలో చెల్లించడంతోపాటు 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జాతీయ సెలవు దినాలు మంజూరు చేయాలని కోరారు. -
రాష్ట్రంలో మరిన్ని ప్రజారోగ్య కేంద్రాలు
పింప్రి, న్యూస్‌లైన్: ప్రజలకు మరిన్ని ఆరోగ్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో మరో 1,500 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. పుణేలో రూబీ హాల్ ఆస్పత్రి మరో శాఖను గురువారం వాన్వాడి ప్రాంతంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఉచిత ఆరోగ్య సేవలను అందించేందుకు లక్ష రూపాయల సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్నవారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ‘వీరికి రాజీవ్ గాంధీ ఆరోగ్య పథకం ద్వారా వైద్యసేవలు అంది స్తామన్నారు. ‘‘ఈ సంక్షేమ పథకం వలన రాష్ట్రంలో 95 శాతం ప్రజలు లబ్ధి పొందుతారు. లక్ష నుంచి లక్షన్నర రూపాయల ఖర్చయ్యే గుండె, క్యాన్సర్ శస్త్ర చికిత్సల ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్సులను అందుబాటులోకి తెస్తున్నాం. గుండెపోటు, ప్రమాదాల వంటివి సంభవించినప్పుడు రోగులను వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీటిని ఉపయోగిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందక మృత్యువాతపడుతున్న ఘటనలు ఉంటున్నాయి. అవసరమైన చోటికి వెనువెంటనే రక్తాన్ని తరలించడానికి మోటార్ సైకిల్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాము’’ అని ఆయన ప్రకటించారు. ఎక్స్‌రే-సీటీస్కాన్, ఎం.ఆర్.ఐ. లాంటి పరీక్షలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో తక్కువ ధరలకే ప్రజలకు అందించే మరో కొత్త పథకం ముఖ్యమంత్రి ప్రకటించారు. క్యాన్సర్ రోగుల కోసం ముంబైలో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రిని టాటా క్యాన్సర్ సెంటర్‌కు చెందిన ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చవాన్ తెలిపారు. ఈ క్యాన్సర్ చికిత్స కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు వెచ్చించనుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి డాక్టర్ పతంగ్‌రావ్ కదమ్, రూబీ హాల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ పర్వేజ్ గ్రేట్, వ్యాపారవేత్త సంజీవ్ బజాజ్, పీఎంపీ డెరైక్టర్ ప్రశాంత్ జగతాప్, కార్పొరేటర్ నందా లోన్కర్, సీఐవో బోమి బోట్ ఇతరులు హాజరయ్యారు.