breaking news
Raghavendra guruprasad
-
మమకారమా... ప్రతీకారమా!
‘బాల భోగం... రాజభోగం’ అంటారు. ఎందుకంటే ప్రతి ఇంటా అమ్మానాన్నల్ని శాసించేది వాళ్లే. అడిగింది తక్షణం తెచ్చి ఇవ్వకపోయినా, తమకు ఆకలేసిన సంగతిని గ్రహించలేని అజ్ఞానాన్ని ప్రదర్శించినా వాళ్లకు కోపం వస్తుంది. దేశాన్నేలే రాజుకైనా అసమ్మతి ఉంటుందేమోగానీ అలాంటి వేషాలు పిల్లల ముందు సాగవు. విసుక్కున్నా, కసురుకున్నా చివరకు లొంగిరావలసింది అమ్మానాన్నలే. కంటిపాపల్లా, ఇంటిదీపాల్లా ఉండే పిల్లల్ని తిట్టడానికీ, కొట్టడానికీ ప్రయత్నిస్తేనే మనుషులా, రాక్షసులా అని నలుగురూ తిట్టిపోస్తారు. అలాంటిది కల్లాకపటం తెలియని ప్రేమతో పెనవేసుకున్న కన్నబిడ్డల్ని చంపేంత కిరాతకానికి ఒడిగట్టిన తండ్రిని ఏమనవచ్చు? హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాఘవేంద్ర గురుప్రసాద్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయనతో పాటు ఉండాల్సిన ఇద్దరు పిల్లల ఆచూకీ తెలియడంలేదని రెండురోజులక్రితం వార్తలు వచ్చినప్పుడు అందరూ ‘అయ్యో పాపం’ అనుకున్నారు. ఉన్నత విద్యావంతుడిగా, బాధ్యతగల ఆచార్యుడిగా ఉన్నవాడు ఇలా అర్ధంతరంగా ప్రాణం తీసుకోవాల్సినంత పరిస్థితులు ఏమొచ్చాయో అని బాధపడ్డారు. అతను ఆత్మహత్య చేసుకున్నది సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై. ఆ రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరాల్లో గురుప్రసాద్ ఒక్కడే కనిపించాడు గనుక పిల్లల్ని ఎవరికో అప్పగించి తానొక్కడే వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని అంచనావేశారు. గంటలు గడుస్తున్నా అయినవారి ఇళ్లలో ఎక్కడా ఆ పిల్లల ఆచూకీ లభ్యం కాకపోవడంతో బంధువులు కంగారుపడ్డారు. ఏదో కీడు శంకించారు. చివరకు వారి అనుమానాలే నిజమయ్యాయి. భార్యతో తగాదాపడి పంతాలకూ, పట్టింపులకూ పోయి... చివరకు వాటితో ఏమాత్రమూ సంబంధంలేని ముత్యాల్లాంటి ముద్దు బిడ్డల్ని గురుప్రసాద్ బలితీసుకున్నాడు. పెళ్లనేది కేవలం భార్యాభర్తల సహజీవన బంధం మాత్రమే కాదనీ... విస్తృతార్థంలో అది ఇద్దరూ ఉమ్మడిగా పౌర సమాజంపట్ల నెరవేర్చవలసిన బాధ్యతని అంటారు. కానీ ఆ బాధ్యతను నెరవేర్చడానికి దగ్గరయ్యే ఇద్దరూ సాధారణంగా భిన్న కుటుంబాల్లో, భిన్న వాతావరణాల్లో పెరిగేవారు గనుక ఇద్దరి దృక్పథాల్లో తేడాలుంటాయి. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం లేదు గనుక సహజీవనానికి దగ్గరయ్యే ఇద్దరిలోనూ దాని ప్రభావం కూడా ఉంటుంది. సర్దుకుపోయే మనస్తత్వాలైనప్పుడు ఆ ఇద్దరికీ ఇవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించకపోవచ్చు. కనుక వాటి ప్రభావం వారి జీవితాలపై పెద్దగా పడకపోవచ్చు. కానీ అవతలివారిపై ‘ఏం చేసైనా’ ఆధిపత్యాన్ని సాధించాలనుకున్నప్పుడు అది సహజీవనాన్ని ఛిద్రం చేస్తుంది. అలాంటి మనస్తత్వం ఉన్నవారితో కాపురం చేయడం దుర్భరమవుతుంది. ఈ ఆధిపత్యధోరణులే బహుశా గురుప్రసాద్, సుహాసిని దంపతుల మధ్య దూరాన్ని పెంచాయి. తాను కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం తొమ్మిదేళ్లపాటు అతడు పెట్టిన చిత్రహింసల్ని భరించానని, చివరకు ఏడాదిక్రితం 498ఏ కింద కేసు పెట్టాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. సుహాసిని చెబుతున్న మాటల్లో నిజమెంతో... గురుప్రసాద్ ఎలాంటివాడో, అతని మానసిక స్థితి ఎలాంటిదో తెలియడానికి పెద్ద పరిశోధన అక్కరలేదు. భార్య దగ్గరినుంచి పిల్లల్ని తీసుకెళ్లడానికి ముందే వారిని చంపడానికి అతను చేసుకున్న ఏర్పాట్లు...అందుకు సంబంధించిన పనులు జరిపిస్తూనే ఆమెతో జరిపిన ఫోన్ సంభాషణలు అతని హంతక మనస్తత్వాన్ని పట్టి ఇస్తాయి. ఆర్థిక ఇబ్బందుల మూలంగానో, అహం దెబ్బతినో ఆత్మహత్యలకు సిద్ధపడటం ఇటీవలికాలంలో పెరిగింది. కానీ, అలా చనిపోదల్చుకున్నవారు ఇతరులకు, అందునా కన్నబిడ్డలకు హాని తలపెట్టడం చాలా అరుదు. పెంపకంలో ఆడపిల్లలు, మగపిల్లలమధ్య చూపుతున్న వ్యత్యాసం ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నది. నడి బజారులో ఆడపిల్లలపై జరుగుతున్న యాసిడ్ దాడులకైనా, ఇళ్లల్లో మహిళలపై సాగే హింసకైనా మూలం అక్కడే ఉన్నదని సామాజిక విశ్లేషకులు చెబుతున్న మాట. ఇలాంటి సంస్కృతిని ఒంటబట్టించుకోబట్టే పెరిగి పెద్దయి భార్య స్థానంలో వచ్చినవారిని కాల్చుకుతినడం అలవాటుగా మారుతున్నదని వారంటున్నారు. అనురాగం ఉండాల్సినచోట అహంకారమూ... ఆత్మీయత ఉండాల్సినచోట పచ్చి విద్వేషమూ పెచ్చరిల్లితే ఏ కుటుంబమైనా కుప్పకూలుతుంది. అమ్మానాన్నల విభేదాలు పిల్లల పెరుగుదలపైనా, వారి మానసిక స్థితిగతులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈమధ్యనే మన హైకోర్టు ఒక జంట మధ్య తలెత్తిన సమస్య విషయంలో కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరకు సర్దుకుపోవడానికి ఆ ఇద్దరూ అంగీకరించారు. అయితే, అన్ని కేసుల్లోనూ ఇది సాధ్యంకాకపోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు తగాదా పడినప్పుడు దానికి పరిమితమై ఆలోచించి పరిష్కరించడం కాక...వారిద్దరి మానసిక స్థితి ఎలాంటిదో అంచనావేసే స్థితి ఉండాలి. గురుప్రసాద్‌లో సొంత బిడ్డల్ని చంపుకొనేంత ఉన్మాదం హఠాత్తుగా ఏర్పడి ఉంటుందా? అతని మానసిక స్థితిని సైతం ముందుగా విశ్లేషించగలిగితే ఆ ఉన్మాదం జాడల్ని పసిగట్టడం పెద్ద కష్టమా? వాస్తవానికి ఇలాంటి స్థితిని ఎంతో కొంత అంచనా వేయబట్టే సుహాసిని అతనికి దూరం జరిగివుంటారు. ‘నీ ఇంటికి వస్తే నువ్వు నన్ను... నా ఇంటికి వస్తే నేను నిన్ను చంపుకుంటామని అనుకుంటున్నావు. మనమేమైనా కసాయిలమా?’ అని ఫోన్లో అన్న సమయానికే పిల్లలకోసం గురు ప్రసాద్ ప్లాట్‌లో గోతులు తవ్వించి పెట్టాడు. ఈమధ్యే హైదరాబాద్‌లో ఇలా భార్యనూ, కన్నబిడ్డనూ హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఇలాంటి ఉదంతాలు సమాజాన్ని మొద్దుబారుస్తాయి. సున్నితత్వాన్ని దెబ్బతీస్తాయి. కనుక ఈ తరహా ఉన్మాదానికి తావులేని స్థితి ఏర్పడాలని అందరూ కోరుకుంటారు. -
భార్యనూ చంపాలనుకున్నాడా?
సాక్షి, హైదరాబాద్: రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఇక్ఫాయ్ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ తన భార్య సుహాసినిని సైతం అంతమొందించాలనుకున్నాడా? పథకంలో భాగంగా ముందుగా ఇద్దరు పిల్లలను చంపిన తరువాత సుహాసినిని ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్లి చంపాలనుకున్నాడా? అతని ఇంట్లో పోలీసులకు లభించిన తాడు ఆమెను చంపడానికే తెచ్చాడా అనే అనుమానాలకు.. ఆ రోజు అతను భార్యను తీసుకెళ్లడానికి యత్నించిన తీరు బలం చేకూరుస్తోంది. గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులు విఠల్ విరించి(9), నందవిహారి (5)లను చంపి సోమవారం సికింద్రాబాద్ జేమ్స్‌స్ట్రీట్ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 10.30-11.30 గంటల మధ్యలో మేడ్చల్‌కు తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి హత్య చేసి అక్కడే పూడ్చి పెట్టిన గురుప్రసాద్ మధ్యాహ్నం 12.30 గంటలకు మల్కాజ్‌గిరిలోని సుహాసిని ఇంటికి వెళ్లాడు. పిల్లలు గుడిలో భోజనం చేస్తున్నారని, నీవు కూడా వస్త్తే పిల్లలతో కలిసి వద్దామని బతిమాలాడాడు. అయితే సుహాసిని అంగీకరించకపోవడంతో అతని పథకం బెడిసికొట్టినట్టు కనిపిస్తోంది. కోర్టు ఆదేశాలతో కొడుకులను శనివారం తీసుకెళ్లిన గురుప్రసాద్ అదే రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి పూజ నెపంతో గొయ్యి చిన్నారులిద్దర్ని చంపి మేడ్చల్‌లోని తన సొంత ప్లాట్‌లో ఖననం చేయాలనుకున్న గురుప్రసాద్ హత్యకు ఒక రోజు ముందే అక్కడ గొయ్యి తీయించాడు. మృతదేహాల ఖననం కోసం అని చెబితే గొయ్యి తీసే వారికి అనుమానాలు వస్తాయని భావించిన గురుప్రసాద్ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయాల్సి ఉందని అబద్ధాలు చెప్పి కూలీలతో గొయ్యి తీయించాడని తెలుస్తోంది. కూలీలను కూడా మేడ్చల్‌లోని అడ్డాకూలీపై నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. హత్యకు దారితీసిన పరిస్థితులు, గురుప్రసాద్ ఒక్కడే ఈ ఘటనలో పాల్గొన్నాడా లేదా ఎవరి సహకారం తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇందులో కేవలం గురుప్రసాద్ ఒక్కడికే సంబంధం ఉందని తేలితే కేసును మూసివేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా పాలుపంచుకున్నారని తెలిస్తే వారిని కూడా అరెస్టు చేస్తామంటున్నారు. చిన్నారుల మెడపై వేటు కత్తిలాంటి పదునైన ఆయుధంతో మెడ నరకడంతో చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ధ్రువీకరించారు. పెద్దకుమారుడి మెడపై రెండు, చిన్నకుమారుడి మెడపై మూడు సార్లు ఆయుధంతో వేటేసినట్లు గుర్తించామన్నారు. విషప్రయోగం, మత్తుమందు ఆనవాళ్లను గుర్తించేందుకు శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపామని, పది రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందన్నారు. విషప్రయోగం, మత్తుమందు వంటి ప్రయోగాలు జరిగితే ముందునుంచే చంపేవాడని భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు మోహన్‌సింగ్ నేతృత్వంలో మంగళవారం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తల్లి సుహాసినికి అప్పగించారు. చిన్నారుల మెడపై వేటు వేసిన పదునైన కత్తి మాత్రం ఇంకా లభించలేదు. హత్య జరిగిన స్థలంలో చిన్నపాటి కత్తి మాత్రం పోలీసులకు లభ్యమైంది. అయితే ఈ కత్తితో మెడపై వేటువేయడం అసాధ్యమని పోలీసులు భావిస్తున్నారు. నన్ను కూడా రమ్మన్నాడు: సుహాసిని గురుప్రసాద్ తనను కూడా చంపేందుకు ఎత్తగడ వేశాడని ఆయన భార్య సుహాసిని మంగళవారం మీడియాకు తెలిపింది. శనివారం మధ్యాహ్నం అతడు తమ ఇంటికి వచ్చాడని, తనను కూడా వెంట రమ్మన్నాడని చెప్పింది. తాను పిల్లల కోసమే బతుకుతున్నానని, వారు లేకుండా ఈ ప్రాణాలు ఎందుకంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘తొమ్మిదేళ్లు భర్త కొడితే భరించాను. అత్తకూడా కొట్టడంతో ఇల్లు వదిలి పుట్టింటికి చేరుకున్నాను. ఆమె కూడా గురుప్రసాద్కే మద్దతు పలుకుతూ నాకు చీవాట్లు పెట్టేది’ అని సుహాసిని కన్నీటిపర్యంతమైంది. ట్యాబ్ కొనిస్తానని ఆశ పెట్టడంతో పిల్లలు సంతోషంగా తండ్రితో కలిసి వెళ్లారని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదని చెప్పింది. గాంధీ మార్చురీ వద్ద చిన్నారుల మృతదేహాలను చూసి ఆమె భోరున విలపించింది. చిన్నారుల మృతదేహాలను బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ఖననం చేశారు. గురుప్రసాద్‌తో సుహాసిని వివాహం ఘనంగా జరిపించామని పెళ్లయిన రెండో రోజు నుంచే గురుప్రసాద్ వేధింపులు మొదలయ్యాయని ఆమె తమ్ముడు స్వరూప్, అక్క గీత, మేనత్త సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు అన్నం తినకపోయినా శాడిస్ట్‌లా అగ్గిపుల్ల కాల్చి వాతలు పెట్టేవాడని చెప్పారు.