ఆయన తీరు బాలే..!
విజయనగరం మున్సిపాలిటీ : ‘ఆయను తీరు బాగోలేదు సార్... చీటికీమాటికీ మన పని తీరును పరీక్షిస్తున్నారు.. తెగ చీవాట్లు పెడుతున్నారు. ఏదో ఒకటి చేసి ఆయన చిత్తశుద్ధిని చెత్తలో కలిపేయకుంటే ... వామ్మో! ఉద్యోగం చేయటం చాలా కష్టం సార్..!’ ఇవీ విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ గురించి ప్రజారోగ్య శాఖకు చెందిన కొంత మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, పలువురు సార్జెంట్లు ఎంహెచ్ఓ యు.అప్పలరాజు ఎదుట సంధించిన అసంతృప్తి అస్త్రాలు. ఇటీవల ఓ సాయంత్రం మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో గల పాలాస్పత్రి వద్ద వీరంతా సమావేశమైనట్లు భోగట్టా. ఇన్స్పెక్టర్లు, సార్జెంట్లలో కొంత మంది మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలి తమకు నచ్చలేదంటూ ఎంహెచ్ఓ ఎదుట అక్కసు వెల్లగక్కారు.
ముఖ్యంగా ఏళ్ల తరబడి తమదైన నిర్లక్ష్యంతో విధి నిర్వహణను మమః అనిపించేస్తూ కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్న పలువురు సిబ్బంది.. కమిషనర్ తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. విధి నిర్వహణలో విషయంలో కమిషనర్ చిత్తశుద్ధిని వారంతా జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. పారిశుద్ధ్య కార్మికుల పని తీరును పరీక్షించే బాధ్యత డ్వాక్రా గ్రూపులకు అప్పగించడం ఎంత వరకు సమంజసమని కొంత మంది సార్జెంట్లు ఎంహెచ్ఓను ప్రశ్నించారు. ప్రజారోగ్య శాఖ విభాగాధిపతిగా మున్సిపల్ హెల్త్‌ఆఫీసర్ గానీ, మున్సిపాలిటీ హెడ్‌గా కమిషనర్‌గానీ పర్యవేక్షించాలే తప్ప.. ఎటువంటి అర్హతాలేని వారు పెత్తనం చేలాయిస్తే ఎలా సహించగలమంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంత మంది కమిషనర్లు వచ్చిపోయూరు గానీ.. ఎవరూ ‘యూనిఫారాలు ధరించండి. గుర్తింపు కార్డులు తగిలించుకోండి..’
అంటూ కార్మికులను, ఉద్యోగులను వేధించలేదంటూ కమిషనర్ పనితీరును ఎత్తిచూపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఎంహెచ్ఓ... ‘ముందు మనలో లోపాలను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయండి.’ అంటూ అసంతృప్తులకు తిరిగి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు విధానం సక్రమంగా అమలు చేస్తే కమిషనర్ ఏ ఒంపు పెట్టి ఉద్యోగాలను నిందించగలరని అందరికీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంతలోనే పలువురు సిబ్బంది కల్పించుకుని ప్రజారోగ్య శాఖలో చోటు చేసుకుంటున్న అక్రమాలను ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తున్నారని, సదురు ఉద్యోగిని హెచ్చరించాలని కోరారు.
వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాత గానీ ఎవరిపైనా చర్యలు తీసుకోవటం కుదరదని ఎంహెచ్ఓ సర్దిచెప్పి అక్కడి నుంచి వారిని పంపించేశారని సమాచారం. ఏదేమైనప్పటికీ మున్సిపల్ కమిషనర్‌గా సోమన్నారాయణ వచ్చిన తర్వాత పరిపాలనపరంగా ఎన్నోమార్పులు సంభవించారుు. సిబ్బంది పనితీరు కూడా మెరుగుపడింది. మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలపై కూడా పూర్తిస్థారుులో దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్న కితాబు కూడా ఆయనపై ఉంది. అటువంటి వ్యక్తిపై ప్రజారోగ్య శాఖ సిబ్బంది తిరుగుబాటుకు దిగడం గమనార్హం.