breaking news
pv narsimharao
-
మన ఆర్థిక ప్రస్థానం.. బ్రిటిష్ రాజ్... లైసెన్స్ రాజ్.. డిజిటల్ రాజ్!
17వ శతాబ్దం ఆరంభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 22.6 శాతం. అంటే దాదాపు యూరప్ మొత్తం వాటా (23%)తో సమానం. 1952 నాటికి మన వాటా 3.8 శాతానికి పడిపోయింది. కేంబ్రిడ్జ్ చరిత్రకారుడు ఆంగస్ మాడిసన్ వెల్లడించిన ఈ అంచనాలు చాలు... బ్రిటిష్ పాలనలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా కుదేలయిందో చెప్పడానికి! బ్రిటిష్ పాలకులు భారత్‌లో పారిశ్రామికీకరణను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో స్వాంత్రంత్య్రం పొందే నాటికి దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు 74 ఏళ్ల తర్వాత, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. కడు పేదరికం నుంచి డిజిటల్ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మన ఆర్థిక విధానాలు పోషించిన పాత్ర, మన ఆర్థికరంగంలో చోటు చేసుకున్న కీలక మార్పులపై 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఒక సింహావలోకనం. నెహ్రూ.. సర్వం ప్రభుత్వం చెప్పుచేతల్లోనే! స్వాతంత్య్రం వచ్చాక అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చికిత్స ప్రారంభించారు. స్వావలంబనతో కూడిన ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, దారిద్య్ర నిర్మూలన లక్ష్యాలతో సోషలిజం ఛాయలతో కూడిన అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వమే ఒక ఎంట్రప్రెన్యూర్‌గా వ్యవహరించేలా 1948లో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధాన తీర్మానం దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రైవేటు కంపెనీలను పూర్తిగా ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంచుకునేలా విధానాలను రూపొందించారు. దేశంలో లైసెన్స్ రాజ్‌కు ఇక్కడే బీజం పడింది. ఉక్కు, మైనింగ్, యంత్ర పరికరాలు, టెలికం, బీమా, విద్యుత్ తదితర కీలక పరిశ్రమల్లో ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగింది. అప్పటి సోవియెట్ యూనియన్ విధానాల ప్రభావంతో పంచ వర్ష ప్రణాళికలకు రూపకల్పన చేసిన నెహ్రూ సర్కారు... మొత్తం ప్రభుత్వ ప్రణాళికలను పర్యవేక్షించడం కోసం 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1951లో భారత్ మొట్టమొదటి పంచ వర్ష ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై ఈ ఐదేళ్లూ దృష్టి సారించారు. అధిక మొత్తంలో పొదుపులు, పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేలా పాలసీలను రూపొందించారు. ఈ తొలి పంచవర్ష ప్రణాళిక మంచి ఫలితాలనే అందించింది. 2.1 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాలను అధిగమించి 3.6 శాతం వృద్ధి సాకారమైంది. లైసెన్స్ రాజ్... 1956 నాటి రెండో పంచవర్ష ప్రణాళిక దేశంలో ప్రభుత్వ రంగ కంపెనీల జోరుకు బాటలు వేయడంతో పాటు లైసెన్స్ రాజ్ ఆవిర్భావానికి కారణమైంది. భారత్‌లో పరిశ్రమలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి, రెండవ గ్రూపుల్లో ప్రధానమైన, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న కంపెనీలను పూర్తిగా ప్రభుత్వ రంగంలో చేర్చారు. ఇక మూడో గ్రూపులో కన్జూమర్ పరిశ్రమలను చేర్చి, వాటిని ప్రైవేటు రంగానికి వదిలేశారు. అయితే, లైసెన్సుల జారీ వ్యవస్థ ద్వారా ప్రైవేటు రంగంపై ప్రభుత్వం పూర్తి పెత్తనం చలాయించేలా విధానాలను రూపొందించడంతో అన్నింటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని, అధికారుల జోక్యం మితిమీరి, విపరీతమైన అవినీతికి దారితీసింది. భాక్రా–నంగల్ టు భిలాయ్... భారతదేశ ఆధునిక దేవాలయాలు ప్రభుత్వ ప్రణాళికల్లో విద్యుత్, ఉక్కు రంగాలను కీలకమైనవిగా నెహ్రూ భావించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సట్లెజ్ నదిపై నిర్మించిన భాక్రా బహుళార్థసాధక ప్రాజెక్టును పునరుజ్జీవ భారతదేశంలో కొత్త దేవాలయంగా ఆయన అభివర్ణించారు. భాక్రా–నంగల్తో పాటు అనేక జల విద్యుత్ ప్రాజెక్టులు దేశంలో లక్షలాది ఇళ్లలో వెలుగులు నింపాయి, అనేక ఫ్యాక్టరీలను నడిపించాయి, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించాయి. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో 60 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో, జర్మనీ సహకారంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్.. రష్యా, బ్రిటన్ ఆధ్వర్యంలో భిలాయ్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), అణు ఇంధన కమిషన్ వంటి ఎన్నో ‘ఆధునిక దేవాలయాలు’ నెహ్రూ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. నెహ్రూ తదనంతరం ప్రధాని పగ్గాలు చేపట్టిన లాల్‌బహదూర్ శాస్త్రి హయాంలోనే ఆహార ధాన్యాలు, డెయిరీ రంగంలో స్వయం సమృద్ధికి దోహదం చేసిన హరిత విప్లవం, క్షీర విప్లవం చోటు చేసుకున్నాయి. ఇందిర హయాం... బ్యాంకుల జాతీయీకరణ నెహ్రూ, శాస్త్రి వెనువెంటనే మరణించడం... దేశంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. విదేశీ మారక నిల్వలు అడుగంటడం.. చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో 1966 జూన్ 6న ప్రధాని ఇందిరా గాంధీ డాలరుతో రూపాయి మారకం విలువను ఏకంగా 57 శాతం తగ్గించి 4.76 నుంచి 7.50కు తీసుకొచ్చేశారు. దీనివల్ల ఎగుమతులకు ఊతం లభించినా, దేశంలో ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వ్యవసాయ రుణాలను పెంచడమే లక్ష్యంగా 1969 జూలై 20న దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకుల కార్యకలాపాల్లో తీవ్ర రాజకీయ జోక్యం క్రోనీ క్యాపిటలిజానికి దారితీసి, విపరీతంగా మొండిబాకీలు పెరిగిపోయేందుకు కారణమైంది. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిర... 1977 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. డీమానిటైజేషన్ 1.0 1977లో అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్ సారథ్యంలోని జనతాపార్టీ.. నల్లధనానికి అడ్డుకట్టవేయడం కోసం రూ.1,000, రూ.5,000, రూ.10,000 బ్యాంకు నోట్లను రద్దు చేసింది. అప్పటి పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నాండెజ్... విదేశీ కంపెనీలపై కొరడా ఝుళిపించడంతో బహుళజాతి కంపెనీలైన ఐబీఎం, కోకాకోలా ఇక్కణ్ణుంచి దుకాణం సర్దేశాయి. రాజీవ్పాలన... ఐటీ, టెలికం విప్లవానికి నాంది 1984 అక్టోబర్‌లో ఇందిర హత్యతో 40 ఏళ్ల వయస్సులో యువ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ... ప్రత్యక్ష పన్నుల తగ్గింపు, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితుల పెంపు వంటి పలు సంస్కరణలు చేపట్టారు. అంతేకాదు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలికం విప్లవాలకు నాంది పలికిన ఘనత కూడా రాజీవ్‌కే దక్కుతుంది. పీవీ సంస్కరణల హీరో... 1991లో భారత్ చెల్లింపుల సంక్షోభంతో దివాలా అంచున నిలబడింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌లు బంగారాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రుణాలు తీసుకొని దేశాన్ని గండం నుంచి గట్టెక్కించారు. లైసెన్స్ రాజ్‌కు అంతంతో పాటు మన ఎకానమీని మలుపు తిప్పిన విప్లవాత్మకమైన సంస్కరణలు, సరళీకరణకు తెర తీశారు. దీంతో భారత్‌కు విదేశీ కంపెనీలు క్యూ కట్టి, భారీగా ఉద్యోగాలకు దోహదం చేసింది. వాజ్‌పేయి... ప్రైవేటీకరణకు సై నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున ప్రధాని పగ్గాలు చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ సంస్కరణలు జోరందుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారాలు తెరిచి.. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్), బాల్కో, హిందుస్థాన్ జింక్ తదితర కంపెనీలను విక్రయించారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల రూపురేఖల మార్చివేత వాజ్‌పేయి ఘనతే. జీడీపీ వృద్ధి ‘మన్మోహనం’ 1991లో ఆర్థిక మంత్రిగా సత్తా చూపిన మన్మోహన్ సింగ్... అనూహ్యంగా 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వ సారథిగా ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పలు సామాజికాభివృద్ధి పథకాలకు మన్మోహన్ సర్కారు బీజం వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో 5–20 శాతం వరకు వాటాలను విక్రయిచడం ద్వారా ఈ పథకాలకు నిధులను సమకూర్చుకోగలిగారు. పదేళ్ల మన్మోహన్ పాలనలోనే భారత్ అత్యధిక జీడీపీ వృద్ధి రేటును (8–9 శాతం) సాధించింది. అయితే, 2008లో చోటుచేసుకున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ వృద్ధి పడకేసింది. అంతేకాదు, కార్పొరేట్లకు ఎడాపెడా ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారడంతో పాటు, 2జీ, కోల్ గేట్ వంటి పలు కుంభకోణాలు మన్మోహన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశాయి. నోట్ల రద్దుతో మోదీ షాక్... 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ పాలనలో దేశ ప్రజలు అనేక విప్లవాత్మకమైన సంస్కరణలతో పాటు తీవ్రమైన షాక్‌లను కూడా చవిచూశారు. 2016 నవంబర్ 8న రాత్రికి రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి దేశంలో అతిపెద్ద డీమానిటైజేషన్‌ను ప్రకటించడం ద్వారా మోదీ షాకిచ్చారు. దేశంలో తొలిసారి రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రజలు పడరాని పాట్లు పడినా, దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. మరోపక్క, దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకునే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తీసుకొచ్చి సంస్కరణలను కొత్తపుంతలు తొక్కించారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. దివాలా చట్టం (ఐబీసీ)తో మొండిబాకీల సమస్యకు కొంతమేర పరిష్కారం చూపారు. మరోపక్క, మోదీ సర్కారు 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ కంపెనీల ప్రైవేటీకరణను వేగవంతం చేశారు. ఎల్ఐసీలో వాటానూ అమ్మకానికి పెట్టారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కొత్త ఆలోచనలతో విద్యా, ఉద్యోగావకాశాల సృష్టిలో మోదీ సఫలం అయ్యారనే చెప్పొచ్చు. మోదీ హయాంలోనే భారత్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సవాళ్లు ఉన్నా... ఉజ్వల భవిష్యత్తు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, బ్యాంకుల్లో మొండిబాకీల దెబ్బతో మందగించిన మన ఎకానమీపై.. కరోనా పంజా విసిరింది. దేశవ్యాప్త లాక్డౌన్ ఫలితంగా 2020–21 జూన్ త్రైమాసికంలో జీడీపీ 24.4 శాతం కుప్పకూలింది. భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే అత్యంత ఘోరమైన క్షీణతను చవిచూసింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా, ఎకానమీ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరినా... ప్రజల్లో ఆర్థిక అసమానతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తలసరి ఆదాయంలో మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా మనల్ని అధిగమించింది (2,227 డాలర్లు). ప్రస్తుతం 2100 డాలర్లతో తలసరి ఆదాయం విషయంలో ప్రపంచ దేశాల్లో మన ర్యాంక్ 144 స్థాయిలో అట్టడుగున ఉంది. అయితే, దేశ జనాభాలో 35 ఏళ్ల వయస్సు లోపు వారు 65 శాతం ఉండటం.. యువ భారత్ భవిష్యత్తుకు ఢోకా లేదనే నమ్మకాన్ని పెంచుతోంది. వచ్చే రెండు దశాబ్దాల పాటు ఏటా 12 లక్షల మంది కార్మిక శక్తి దేశానికి జతవుతుందని... 2030 నాటికి పని చేసే జనాభా (15–60 ఏళ్ల వయస్సు) 100 కోట్లకు చేరుతుందనేది పీడబ్ల్యూసీ తాజా అంచనా. ఇదే గనుక జరిగితే దేశంలో ఆర్థిక అసమానతలు దిగిరావడంతో పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాకారం అవుతుందని, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందనేది ఆర్థికవేత్తల మాట. -
24 నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ దివంగత ప్రధాన మంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సహింరావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై టీపీసీసీ పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గీతారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ గౌడ్లతో చర్చించినట్లు తెలిపారు. అంతేగాక పీవీ ఉత్సవ కమిటీ సభ్యులు వేణుగోపాల్‌తో కలిసి పీవీ కుటుంబ సభ్యులలైన పీవీ ప్రభాకర్ రావు, పీవీ మనోహర్ రావ్, వాణి దేవిలతో సమావేశమయ్యామని ఆయన చెప్పారు. పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీలో చీఫ్ పట్రాన్‌గా ఉండడానికి పీవీ మనోహర్ రావ్ అంగీకరించారని, 24న జరగబోయే ఆన్లైన్ సమావేశంలో మనోహర్రావ్ పాల్గొంటారని స్పష్టం చేశారు. అదే విధంగా పీవీ ప్రభాకర్ రావ్, వాణిదేవిలు వారి సందేశాలను కూడా పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: మరో సీనియర్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్) జూలై 24వ తేదీన ఉత్సవాలు ప్రారంభించి వరసగా ఏడాది పాటు వివిధ రకాల కార్యక్రమాలు కొనసాగిస్తామని ఉత్తమ్ వెల్లడించారు. పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం, ఆయన రాజకీయ కార్యక్రమాలు, ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యవహారాలు అన్ని అంశాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళతామని వివరించారు. ఆన్లైన్లో జరగబోయే ఈ కార్యక్రమంలో పీవీ అత్యంత సన్నిహితులైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత జరగబోయే కార్యక్రమాలలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, శశిథరూర్‌లు కూడా పాల్గొంటారని చెప్పారు. పీపీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులుగా మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావును నియమించినట్టు ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. -
పార్లమెంటులో ఓరుగల్లు దిగ్గజాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి లోక్‌సభ సభ్యులుగా దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఉన్నత పదవులు అధిష్టించి, వాటికి వన్నె తెచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గాలుండేవి. వరంగల్ లోక్‌సభ స్థానం 1952 సంవత్సరంలో ఏర్పాటైంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు వారిధిగా ఉండే భద్రాచలం నియోజకవర్గం 2009లో రద్దయింది. ఓరుగల్లుకు చెందిన పీవీ నర్సింహారావు భారత ప్రధానిగా సేవలందించి మన్ననలు పొందారు. గిరిజన ఎంపీగా ఎన్నికైన పోరిక బలరాంనాయక్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. మైనార్టీ వర్గానికి చెందిన కమాలోద్దీన్ అహ్మద్ మూడుసార్లు హన్మకొండ, ఒకసారి వరంగల్ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా సేవలందించారు. పీవీ.. మన ఠీవి.. హన్మకొండ నుంచి 1977, 1980లో రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన పీవీ.నర్సింహారావు ఆ తర్వాత భారత దేశానికి ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన నంద్యాల నుంచి రెండుసార్లు, రామ్‌టెక్, బరంపురల నుంచి కూడా గెలుపొందారు. మూడు రాష్ట్రాలలో ఎంపీగా ఉన్న తెలుగు నేతగా రికార్డుకు ఎక్కారు. అయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చారు. 1980–1989 మధ్యకాలంలో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 1957లో మంథని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి అడుగు పెట్టారు. 1962లో తొలిసారిగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా 1971 వరకు మంత్రిగా కొనసాగారు. 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ.నరసింహరావు బాధ్యతలు చేపట్టారు. 1973వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. కడియం ఎంపీగా... మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం వరంగల్ ఎంపీగా పని చేశారు. వరంగల్ ఎంపీ ఎస్సీకి రిజర్వ్ కావడంతో 2014లో కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఎన్నికైన ఆరు నెలల తరువాత రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా కమాలోద్దిన్ అహ్మద్ వరంగల్‌కు చెందిన హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు, వరంగల్ నుంచి ఒకసారి ఎంపీగా గెలుపొంది కమాలోద్దిన్ అహ్మద్ చరిత్ర సృష్టించారు. 1980లో వరంగల్ ఎంపీగా, 1989, 1991, 1996 సంవత్సరాల్లో హన్మకొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా సైతం గెలుపొందారు. పీసీసీ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగుసార్లు గెలుపొందిన సురేందర్‌రెడ్డి రామసహాయం సురేందర్‌రెడ్డి నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1967, 1989, 1991లలో వరంగల్ ఎంపీగా, 1965లో ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1996లో వరంగల్ లోక్‌సభ సభ్యునిగా పోటీ చేసి ఓటమి చెందారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేశారు. మంత్రిగా కమలకుమారి భద్రాచలం నుంచి లోక్‌సభ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు కమలకుమారి గెలుపొందారు. 1989లో సోడే రామయ్యపై, 1991లోనూ ఆయనపైనే విజయం సాధించారు. ఒక్కసారి కేంద్ర మంత్రిగా సైతం పని చేశారు. కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009లో ఎంపీగా గెలుపొందారు. ప్రధాని మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో ఎంపీగా, 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుత మంత్రి... ఒకప్పటి ఎంపీనే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు గతంలో వరంగల్ ఎంపీగా పనిచేశారు. 2008లో ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి రామేశ్వర్‌రెడ్డిపై గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలుపొంది, చంద్రబాబు కెబినేట్‌లో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. -
మళ్లీ తడబడ్డ మంత్రి నారా లోకేశ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అలవాటులో పొరపాటుగా మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా బుధవారం లోకేశ్ నోరు జారారు. తెలుగు దేశం పార్టీ నుంచి పీవీ ప్రధానమంత్రి అయ్యారంటూ వ్యాఖ్యానించారు. అయితే పొరపాటు గ్రహించిన ఆయన అనంతరం తప్పు సవరించుకున్నారు. తెలుగు ప్రజల నుంచి పీవీ నర్సింహారావు ప్రధాని అయ్యారంటూ కవరింగ్ ఇచ్చుకున్నారు. కాగా గతంలోనూ అనేకసార్లు నారా లోకేశ్ తన వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డారు కూడా. గతంలోనూ అంబేడ్కర్ జయంతిని వర్థంతిగా పేర్కొనడమే కాకుండా, శుభాకాంక్షలు కూడా చెప్పి నవ్వులపాలైన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇంకొంచెం ముందుకెళ్లిన నారా లోకేశ్ .....మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేతను తమ పార్టీ నుంచి ప్రధాని అయ్యారని వ్యాఖ్యలు చేసి మళ్లీ అభాసుపాలు అయ్యారు. -
యూనివర్సిటీ భవనంలో కలెక్టరేట్ వద్దు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీ కళాశాల పాత భవనంలో రంగారెడ్డి(శంషాబాద్) జిల్లా కలెక్టర్ భవనాన్ని తాత్కలికంగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ వర్సిటీ విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం నుంచి పాత భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... విద్యార్థులకు, రైతులకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని రూ. 2.50 కోట్లతో ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారన్నారు. ఇది వినియోగంలోకి వస్తే విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. కలెక్టరేట్ భవనం ఏర్పాటును ఉపసంహరించుకోకుంటే యూనివర్సిటీని నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు పశువైద్య శాస్ర్తవేత్తలు మద్దతు తెలిపారు.