breaking news
prem singh rathore
-
కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి తథ్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ సీఎం కేసీఆర్‌కు ఓటమి తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కూడా ఓడిపోతారన్నారు. బీజేపీ అభ్యర్థుల చేతుల్లోనే వారికి పరాభవం వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు, అన్ని సీట్లు అని కేటీఆర్ చెబుతున్నారని, ఆయన చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా పరిస్థితులున్నాయన్నారు. శనివారం కిషన్‌రెడ్డి, రాజాసింగ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, సుదర్శన్ సింగ్ రాథోడ్, విద్యావేత్త బాలాజీ నాయక్, బీఆర్ఎస్ నాయకులు జబ్బార్ నాయక్, శ్రీరాములు తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతల అక్రమ సంపాదనను కక్కిస్తామన్నారు. తెలంగాణలో అవినీతి, మాఫియా, కుటుంబపాలనతో కూడిన చీకట్లను తరిమి.. బీజేపీని అధికారంలోకి తేవడం ద్వారా డిసెంబర్ 3న నిజమైన దీపావళి రావాలని కోరుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలోని కారు చీకటి పోయి, మరో కమ్ముకున్న చీకటి (కాంగ్రెస్) రాకుండా కమలం పువ్వుతో లక్ష్మీదేవి వచ్చేలా చూడాలని చెప్పారు. భూములు అమ్మితేనే జీతాలు సీఎం కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను దగా చేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మద్యం అమ్మకాలు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్మితే తప్ప ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి బీఆర్ఎస్ పోయి ఇక్కడ కాంగ్రెస్ వస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పారు. పదేళ్లుగా అధికారంలో లేమని కాంగ్రెస్ నేతలు ఆవురావురు మంటున్నారని, రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మజ్లిస్, బీజేపీ రెండూ ఒకటేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ఇతరనాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎంఐఎంను పెంచి పోషించి లాభపడింది కాంగ్రెస్ కాగా, ఇప్పుడు బీఆర్ఎస్ మజ్లిస్‌ను మోస్తోందని విమర్శించారు. సూర్యుడు పడమట ఉదయించినా ఎంఐఎంతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. మతతత్వ, రజాకార్ల పార్టీతో బీజేపీ కలవబోదన్నారు. కర్ణాటకలో ఐదు నెలల పాలనలోనే ఐదేళ్ల అసంతృప్తిని, వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని ధ్వజమెత్తారు. ఐదు గ్యారంటీలంటూ కర్ణాటక ప్రజల తలలపై భస్మాసుర హస్తం పెట్టి కాంగ్రెస్ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించిందన్నారు. ఆ పార్టీ ట్రాక్‌రికార్డ్ ఘోరంగా ఉంటే ఆరు గ్యారంటీలతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామంటూ గొప్పలకు పోతోందన్నారు. -
టీఆర్ఎస్లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ టీఆర్ఎస్లో చేరారు. శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాథోడ్‌తో పాటు టీడీపీ నేత బండి రమేష్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు ప్రణాళిక రూపొందించిన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ కార్యాలయాలకు ఇప్పటికే తాళాలు పడ్డాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
గ్రేటర్లో బీజేపీకి షాక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో... ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ మొదలైంది. టిక్కెట్లు దక్కని నాయకులు, వారి అనుచరులు పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. గోషామహల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పార్టీకు రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికలలో తన అనుచరులకు టిక్కెట్లు కేటాయించకపోవడం వల్లే బీజేపీకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పని చేస్తున్న వారిని కాదని కొత్తగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంతో తాను మనస్తాపానికి గురైనట్లు రాథోడ్ తెలిపారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రాథోడ్‌ను బుజ్జిగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
బీజేపీ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై నిర్భయ కేసు
హైదరాబాద్: బీజేపీ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.... కంటోన్మెంట్లో అక్రమ కట్డడాల కూల్చివేతల్లో భాగంగా గత నెల 21వ తేదీన ప్యారడైజ్ సమీపంలోని అగ్రసేన్ భవన్లో ఇటీవల నిర్మించిన భననాన్ని అధికారులు కూల్చివేసారు. దీనికి నిరసనగా మాజీ ఎంపీ గిరిష్సంఘీ సహా, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ మరి కొందరు అగ్రసేన్భవన్లో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారు. దీంతో పాటు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ విషయమై వీరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో కీలక పాత్ర వహించిన కంటోన్మెంట్ సీఈవో సుజాతాగుప్తా వ్యక్తిగత, వైవాహిక జీవితంపై ప్రేమ్‌సింగ్ వివాదస్పదవ్యాఖ్యలు చేశారు. ప్రేమ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 26వ తేదిన ప్రేమ్‌సింగ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.