breaking news
power jobs
-
ఓకే అంటే.. అందరూ అర్హులే!
పూర్తిగా ఓపెన్ కేటగిరీలో విద్యుత్ కొలువుల భర్తీ స్థానిక కోటాపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరిన టీ జెన్కో సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల నియామకాల్లో స్థానిక రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలా? లేక స్థానిక కేటగిరీ లేకుండా పూర్తిగా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు భర్తీ చేయాలా? అన్న అంశంపై విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో) రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందున నిరుద్యోగుల కలలు సాకారం చేసేందుకు పూర్తిగా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలంటూ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాసిన లేఖ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో వుంది. తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ దినం కానుకగా జూన్ 2న ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం తెలంగాణలో సైతం స్థానిక రిజర్వేషన్లు కొనసాగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలు కార్పొరేషన్లు కావడంతో ఆర్టికల్ 371డీ అమలుకు ఆస్కారం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ‘371డీ’ స్ఫూర్తితో స్థానిక రిజర్వేషన్లు అమలు చేశాయి. ఎల్డీసీ/టైపిస్టు తత్సమాన హోదా గల జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో 80 శాతం స్థానిక, 20 శాతం ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు అమలు చేశాయి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సబ్ ఇంజనీర్ తత్సమాన హోదా గల జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో 70 శాతం స్థానిక, 30 శాతం ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు అమలు చేశాయి. జోనల్ పోస్టులైన ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల విషయంలో మాత్రం 60 శాతం స్థానిక, 40 శాతం ఓపెన్ కోటాను వర్తింపజేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా, జోనల్ ‘స్థానికత’తో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ కేటగిరీ పోస్టుకైనా ఇక్కడి నిరుద్యోగ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. వారం రోజుల్లో ప్రకటనలు! విద్యుత్ సంస్థల్లో 1,492 ఏఈ పోస్టులు, 427 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గత నెల 28న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెన్కోలో 788 ఏఈలు, 16 సబ్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కోలో 62 ఏఈలు, 42 సబ్ ఇంజనీర్లు, ఎస్పీడీసీఎల్లో 376 ఏఈలు, 139 సబ్ ఇంజనీర్లు, ఎన్పీడీసీఎల్లో 266 ఏఈలు, 230 సబ్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. స్థానిక కోటా విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు విద్యుత్ సంస్థలు ముసాయిదా నోటిఫికేషన్లతో సిద్ధమై ఉన్నాయి. అందువల్ల వారం రోజుల్లో ప్రకటనలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. -
కదం తొక్కిన జనం
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. 15వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ర్యాలీలతో అనంతపురం నగరం అట్టుడుకుతోంది. ఏపీ ఎన్జీవోలు, జాక్టో, నాన్‌పొలిటికల్ జేఏసీ, గ్రంథాలయ ఉద్యోగులు, ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల జేఏసీ, విద్యుత్ ఉద్యోగులు, వాణిజ్యపన్నులశాఖ, జెడ్పీ, పంచాయతీరాజ్ జేఏసీలు, న్యాయవాదులు, పెన్నార్భవన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జాక్టో దీక్షలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి సంఘీభావం ప్రకటించారు. జెడ్పీ ఎదురుగా పీఆర్ జేఏసీ దీక్షలకు వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడక ముందే కాంగ్రెస్ కుట్రలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలనే డిమాండ్‌తో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా పదవులను త్యాగం చేశారన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీ డ్రామాలాడుతున్నాయని, వాటికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు వెనుకకు నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. మానవహారం నిర్వహించారు. ఎస్కేయూలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. సీమాంధ్రలో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నా ప్రధాని మన్మోహన్సింగ్ మౌనం పాటించడాన్ని నిరసిస్తూ జేఏసీ నేతలు ఇటుకలపల్లి పోలీసుస్టేషన్లో ప్రధాని కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. మైనార్టీ ఉద్యోగుల సంఘం (ఆల్‌మేవా) ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. హిందూపురంలో భారీ ర్యాలీ హిందూపురంలో రెడ్డిసేవా సంఘం, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 20 వేల మందికిపైగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ దీక్షకు పలువురు సంఘీభావం ప్రకటించారు. స్థానిక వీవర్స్ కాలనీ వాసులు వంటా వార్పు చేపట్టారు. శింగనమలలో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, నియోజకవర్గ నేత ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గంలో న్యాయవాదులు, పెన్షనర్లు, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, మహిళా సంఘాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. క్రైస్తవులు మౌన ప్రదర్శన నిర్వహించారు. గుమ్మఘట్ట మండలం రంగచేడులో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు వంటా వార్పు చేపట్టారు. విద్యార్థులు రోడ్డుపైనే చదువుతూ నిరసన తెలిపారు. సమైక్యవాదులు, జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లు, గుత్తి పట్టణాల్లో సమైక్య నినాదాలు మార్మోగాయి.గుత్తిలో విద్యుత్ ఉద్యోగులు గొడుగులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. క్రైస్తవులు ర్యాలీ చేశారు. న్యాయ శాఖ ఉద్యోగులు ధర్నా చేశారు. మున్సిపల్ జేఏసీ, జాక్టో దీక్షలు కొనసాగుతున్నాయి. కదిరి మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల వాసులు వేలాది మంది స్థానిక అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాసంఘాలు, అంగన్వాడీలు, వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ర్యాలీలతో హోరెత్తించాయి. ఈ సందర్భంగా సోనియా దిష్టిబొమ్మను తగులబెట్టారు. కళ్యాణదుర్గం లో సమైక్యవాదులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో ఆటోలు, బైక్ ర్యాలీలు, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. మడకశిరలో బలిజ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. సమైక్యవాదులు ఎడ్లబండ్లు, పశువులతోప్రదర్శన నిర్వహించారు. తాడిపత్రిలో ముస్లింలు రిలే దీక్షలకు దిగారు. వస్త్రవ్యాపారులు వంటావార్పు చేపట్టారు. యాడికిలో ఓ పత్రికా విలేకరి శ్రీనివాసులు ఆమరణ దీక్షకు దిగారు. ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శాంతి హోమం చేపట్టి.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రాప్తాడు, పుట్టపర్తి, పెనుకొండ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జోరుగా కొనసాగాయి. రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక అమరాపురం మండలం గౌడనకుంటలో కెంచప్ప (55), వజ్రకరూరు మండలం పందికుంటలో తిరుపాల్ (50), లేపాక్షి మండలం విభూదిపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వరప్ప (62) అనే ముగ్గురు సమైక్యవాదులు గుండెపోటుతో మరణించారు.