యూరోప్ కార్యకలాపాలపై సమీక్ష: టాటా స్టీల్
న్యూఢిల్లీ: పోర్ట్ టాల్బాట్ (బ్రిటన్)లోని అతిపెద్ద స్టీల్ కర్మాగారంసహా యూరోప్ ప్రాంతంలోని తన మొత్తం కార్యకలాపాలను సమీక్షిస్తామని టాటా స్టీల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. బ్రిటన్లోని తన కర్మాగారాలు తీవ్ర ద్రవ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో టాటా స్టీల్ తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. టాటా గ్రూప్లో కీలకమైన యూకే టాటా స్టీల్ విభాగం నుంచి పూర్తిగా లేదా కొంతవాటాలను విక్రయించాలని గత వారం టాటా స్టీల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గడచిన 12 నెలల్లో దిగజారిన ఆర్థిక పరిస్థితులు దీనికి కారణం. లాంగ్ ప్రొడక్ట్స్ యూకే బిజినెస్ విక్రయంపై గ్రేబుల్తో చర్చలు పురోగతిలో ఉన్నట్లు టాటా స్టీల్ ప్రతినిధి వెల్లడించారు. భారీ నష్టాల్లో కూరుకుపోయిన బ్రిట న్ వ్యాపార విభాగాన్ని విక్రయించాలన్న టాటా స్టీల్ నిర్ణయం వల్ల 15,000 మందికి పైగా ఉద్యోగాల్లో కోత పడుతుందన్న ఆందోళన నెలకొంది.