బాలీవుడ్‌పై భగ్గుమన్న రాధికా ఆప్టే
వరుసపెట్టి క్వీన్, పికు, తను వెడ్స్ మను రిటర్న్స్.. ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అన్నీ బంపర్ హిట్లు అవుతున్నా, 'అహల్య' లాంటి షార్ట్ ఫిలింలకు కూడా భారీ ఎత్తున హిట్లు వస్తున్నా.. ఇప్పటికీ హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం తక్కువగానే ఉంటోందని హీరోయిన్ రాధికా ఆప్టే భగ్గుమంది. బద్లాపూర్, హంటర్ లాంటి సినిమాల్లో టాప్ పాత్రలు పోషించడంతో పాటు.. ఇటీవలే అహల్య అనే షార్ట్ ఫిలింలో కూడా రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. అందులో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అయినా పరిశ్రమలో మాత్రం హీరోయిన్లను చిన్నచూపు చూస్తున్నారని, వారికి హీరోల కంటే తక్కువ పారితోషికం ఇస్తున్నారని రాధికా ఆప్టే చెప్పింది. ఇది ఒక్క సినీపరిశ్రమలోనే కాదని, అన్నిచోట్లా ఇలాగే ఉందని వాపోయింది. సినిమాలు కేవలం మగవాళ్ల వల్లే పూర్తికావని, వాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉండాల్సిందేనని వ్యాఖ్యానించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా వందకోట్ల మార్కు అందుకున్నాయని, ఈ మార్పు పారితోషికాల్లో కూడా ఉండాలని తెలిపింది. హీరో హీరోయిన్లే కాక.. క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో కూడా ఈ వివక్ష కనపడుతోందంది.