breaking news
passionate
-
మన కన్నా చైనీయులే మక్కువ!
సాక్షి, నేషనల్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాకు భారతీయుల కంటే చైనీయులంటేనా మక్కువా? వలసదారులుగా కాకుండా తాత్కాలిక పర్యటనల కోసం అమెరికా వెళ్లేందుకు అవసరమైన నాన్–ఇమిగ్రంట్ వీసాల జారీ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం నిజమేమోనని అనిపించక మానదు. వైద్య చికిత్సలు, విహారయాత్రలు, వ్యాపారపరమైన సమావేశాలు తదితర అవసరాల కోసం అమెరికా వెళ్లే నిమిత్తం వివిధ దేశాల ప్రజలు ఈ తాత్కాలిక నాన్–ఇమిగ్రంట్ వీసాల కోసం దరఖాస్తు చేస్తారు. ఈ వీసాల విభాగంలో చైనీయులతో పోలిస్తే భారతీయుల దరఖాస్తులు రెట్టింపు సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. 2006తో పోల్చితే చైనీయుల దరఖాస్తుల తిరస్కరణ రేటు 2016 నాటికి దాదాపు సగానికి తగ్గిపోగా, భారత్‌కు సంబంధించి మాత్రం ఈ రేటులో పెరుగుదల కనిపిస్తోంది. 2006లో భారతీయుల అమెరికా తాత్కాలిక వీసా దరఖాస్తుల్లో దాదాపు 19.5 శాతం తిరస్కరణకు గురికాగా, 2016 నాటికి అది 6.5 శాతం పెరిగి 26 శాతానికి చేరింది. అదే చైనా విషయానికి వస్తే 2006లో ఈ దేశస్తుల దరఖాస్తుల తిరస్కరణ రేటు 24.6 శాతం. 2016 నాటికి ఈ రేటు 12.2 శాతం తగ్గి 12.4 శాతానికి చేరింది. అంటే దశాబ్దం క్రితం నాటి పరిస్థితి ప్రస్తుతం తారుమారైంది. అప్పట్లో భారతీయులకన్నా చైనీయుల వీసాలను ఎక్కువగా తిరస్కరించిన అమెరికా అధికారులు...ఇప్పుడు మనకన్నా చైనీయులకే ఎక్కువగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత దశాబ్దకాలంలో చైనా నిబంధనలను సరళీకరించి విదేశీ కంపెనీలు తమ దేశంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించడం ఇందుకు దోహదపడి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, అమెరికా అత్యధికంగా తాత్కాలిక వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్న దేశాల జాబితాలో క్యూబా తొలి స్థానంలో (81.9 శాతం తిరస్కరణ రేటు) ఉండగా, సౌదీ అరేబియా కేవలం 4 శాతం తిరస్కరణ రేటుతో చివరిస్థానంలో నిలవడం గమనార్హం. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా) దేశాల వరకు చూస్తే దక్షిణాఫ్రికా దేశస్తుల దరఖాస్తులు అతి తక్కువ సంఖ్యలో, 6.8 శాతమే తిరస్కరణకు గురవుతున్నాయి. బ్రిక్స్ దేశాల జాబితాలో భారత్ చిట్టచివరన ఉంది. -
దండ ‘కారుణ్య దేవత’
పుణ్య తీర్థం శంబర పోలమాంబ దండకారుణ్యంలో గిరిజనుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల ఆరాధ్యదైవంగా ప్రఖ్యాతిగాంచింది. విజయనగరం జిల్లా, ‘మక్కువ’ మండలం, ‘మక్కువ’ గ్రామంలో కొన్ని శతాబ్దాల క్రితమే కొలువైన అమ్మ ఉత్తరాంధ్ర ప్రజల పూజలందుకుంటోంది. ఏటా అమ్మవారికి అంగరంగ వైభవంగా జరిగే జాతరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి, పోలమాంబను దర్శించుకుంటారు. మక్కువ గ్రామంలో వెలిసిన అమ్మవారిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది... నాలుగు శతాబ్దాల కిందట శంబర గ్రామం దండకారణ్యంలో ఉండేది. ఈ అటవీ ప్రాంతంలో శంబరాసురుడనే రాక్షసరాజు ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు. ప్రజల వేడుకోలు విన్న అమ్మవారు పోలమాంబ రూపంలో శంబరాసురుని సంహరించిందని స్థానికులు చెబుతుంటారు. పోలమాంబ శంబరాసురుడిని వధించడంతో ఆ గ్రామానికి శంబరగా పేరు స్థిరపడిందని పల్లెవాసులు చెబుతున్నారు. శంబరాసురుని వధించిన తరువాత కూడా పోలమాంబ ఇక్కడే సామాన్యురాలిలా బతికి తనువుచాలించింది. ఆ తరువాత పూజలందుకుంటోంది. ఏటా జనవరినెలలో చినపోలమాంబ జాతర చేస్తారు. ఆ జాతరకు ముందు పెదపోలమాంబను గ్రామంలోకి తీసుకు వస్తారు. ఆమెను వారంరోజుల పాటు గ్రామంలో ఉంచి పూజలు చేస్తారు. అనంతరం అనుపుకోత్సవం నిర్వహించి, అదేరోజు చినపోలమాంబను గ్రామంలోకి తీసుకువచ్చేందుకు చాటింపు వేస్తారు. శంబర పోలమాంబ గ్రామానికి చేరుకుని 10 వారాల పాటు గ్రామంలో కొలువై భక్తుల పూజలందుకుంటారు. ఇద్దరు పోలమాంబలు వరుసకు మేనత్త– మేనకోడళ్లు అవుతారు. పోలమాంబ అమ్మవారి జాతర లో సిరిమానోత్సవం పోలమాంబ అమ్మవారి జాతరను వైభవంగా పండుగ చేసుకుంటారు. శంబర గ్రామస్తులలో పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లిన వాళ్లు, ఇతర చోట్ల నివసించే వారు కూడా శంబర జాతర సమయానికి సొంతూరుకి చేరుకుంటారు. అమ్మవారు శక్తిస్వరూపిణి. మంగళవారం రోజు పూజారి సిరిమాను రథంపై గ్రామంలోని అన్ని పురవీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అందువలన సిరిమాను అధిరోహించే పూజారికి అరటిపళ్లు, కొబ్బరికాయలు, చీరలు చూపించి భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటారు. మక్కువ, సాలూరు మండలాలకు సమీపంలో ఉన్న అడవుల్లో లభ్యమయ్యే సుమారు 36 నుండి 42 అడుగుల సిరిమాను కర్ర (తాడిమాను)ను గ్రామపెద్దలు, ట్రస్టు కమిటీ సభ్యులు సిరిమానోత్సవానికి రెండురోజులు ముందుగా గుర్తిస్తారు. గ్రామం నుండి పశువులేర్లను తీసుకువెళ్లి వారితో సిరిమాను కర్రను ఊరేగింపుగా తీసుకురావడం ఆనవాయితీ. గ్రామానికి చెందిన జన్నిపేకాపు వారి కుటుంబీకులు సిరిమానును అధిరోహిస్తారు. శంబర పోలమాంబ అమ్మవారి మహిమలను భక్తులు పలు కథలుగా చెప్పుకుంటారు. వాటిలో ఒకటి పోతికోడె రాళ్లమహిమ. అమ్మవారి ఆనవాళ్లే ఈ పోతికోడెరాళ్లని భక్తుల విశ్వాసం. ఆ రాళ్లకు మొక్కి కోరికలు కోరుకుంటే తప్పక కరుణిస్తుందని నమ్మకం. ఏటా గ్రామానికి చెందిన రైతులు తొలకరి పంటను సాగుచేసే ముందు పోతికోడెరాళ్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అమ్మవారి ప్రతిరూపం వేపచెట్టు గ్రామ ఆవలి ఒడ్డున ఉన్న వనంగుడి వెనుక ఉన్న వేపచెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తుంటారు. పోలమాంబ అమ్మవారు ఈ వేపచెట్టు వద్ద భూమిలో అంతర్థానం కావడం వలన జాతరకు వచ్చిన భక్తులు వనం గుడి వెనుకనున్న వేపచెట్టుకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, చీరలు, జాకెట్లు పెట్టి, మొక్కుబడి తీర్చుకుంటారు. పది వారాల జాతర గతంలో అమ్మవారి జాతరను మూడువారాలపాటు నిర్వహించేవారు. అమ్మవారిపై భక్తులుకు నమ్మకం ఏర్పడటంతో ఇప్పుడు పది వారాలకు పెంచారు. అంతేకాకుండా సంవత్సరం పొడవునా ప్రతి మంగళ, ఆదివారాలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. నదుల గలగలలు... కొండకోనల పచ్చదనాలు శంబర గ్రామానికి కిలోమీటరు దూరంలో వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ఎల్తైన కొండలు, జలజలపారే గోముఖీ, సువర్ణముఖీనదుల కలయిక ఎంతో ఆనందాన్నిస్తుంది. శంబర గ్రామం నుండి 8 కిలోమీటర్ల దూరంలో నంద గిరిజన గ్రామం ఉంది. చుట్టూ పెద్దపెద్ద కొండలు కనువిందు చేస్తాయి. అమ్మను దర్శించుకునేందుకు ఇలా రావాలి చత్తీస్ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు విజయనగరం వరకు ట్రైన్లో చేరుకోవాలి. అక్కడ నుండి సాలూరు వరకు ఆర్టీసీబస్సులలో చేరుకోవాలి. సాలూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబర గ్రామానికి లోకల్ సర్వీస్ ఆర్టీసీబస్సులుంటాయి. శంబరకు ప్రైవేటు వాహనాల్లో మామిడిపల్లి మీదుగా చేరుకోవచ్చు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
కోహ్లి దూకుడంటే ఇష్టం: గంగూలీ
ముంబై: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన నాయకుడని మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. అతని దూకుడు, వైఖరి అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ‘విరాట్ మంచి నాయకుడు. ఇంకా మంచి సారథిగా ఎదుగుతాడు. అయితే స్వదేశంలో కాకుండా విదేశాల్లో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొవాలి. మైదానంలో ఎప్పుడూ గెలవాలని కోరుకుంటాడు. ఈ దృక్పథం నాకు చాలా నచ్చుతుంది. ఆట అంటే కోహ్లికి అమితమైన ఆసక్తి. అతనిపై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది’ అని దాదా పేర్కొన్నాడు. నాగ్‌పూర్ టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో పిచ్‌పై వస్తున్న విమర్శలపై గంగూలీ స్పందించాడు. ‘మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. బంతి కచ్చితంగా టర్న్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే బ్యాట్స్‌మెన్ మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది. వికెట్ స్పిన్నర్లకు చాలా సహకరించింది. ఈసారే ఇలా జరిగింది. కాబట్టి భారత్ మరోసారి ఇలాంటి పిచ్‌లను రూపొందిస్తుందని నేను అనుకోవడం లేదు’ అని ఈ మాజీ సారథి వ్యాఖ్యానించాడు.