breaking news
parole expired
-
23 వరకూ రాయ్ పెరోల్ పొడిగింపు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు సెప్టెంబర్ 23వ తేదీ వరకూ పొడిగించింది. రెండు గ్రూప్ సంస్థలు మదుపుదారుల నుంచి మార్కెట్ నిబంధనలను వ్యతిరేకంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేయడం, వడ్డీతో సహా దాదాపు రూ.35,000 కోట్లు తిరిగి చెల్లించడంలో వైఫల్యం నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలు సుబ్రతా రాయ్ తిహార్ జైలులో గడిపారు. తల్లి మరణంతో మానవతా కారణాలతో మే నెలలో పెరోల్ పొందారు. అయితే ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన డబ్బు సమీకరణ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా సుప్రీంకోర్టు ఆయనకు పెరోల్‌ను పొడిగిస్తూ వస్తోంది. అయితే అందుకు ఆయన కొంత మొత్తం సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి రూ.353 కోట్లు డిపాజిట్ చేశారు. డిపాజిటర్లకు తాము ఇప్పటికే నిధులు మొత్తం చెల్లించేశామన్న సహారా వాదనపై సెప్టెంబర్ 2వ తేదీన తీవ్రంగా స్పందించింది. ఇందుకు డబ్బు ఎలా సమీకరించారు? డబ్బు చెల్లించిన వారి సుస్పష్ట వివరాలను తెలియజేస్తే కేసు మూసేస్తామని కూడా సుప్రీం సూచించింది. అంత డబ్బు ఆకాశం నుంచి రాలి పడదుకదా? అని కూడా వ్యాఖ్యానించింది. -
సహారా రాయ్‌కి పెరోల్ పొడిగింపు
♦ మిగిలిన రూ.300 కోట్లు కడతారా..? లేక జైలుకెళతారా? ♦ సుబ్రతారాయ్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ♦ సహారా ఆస్తుల విక్రయంపై ఆంక్షల తొలగింపు న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతారాయ్‌కు మరి కొంత ఊరట లభించింది. ఆయనకు గతంలో మంజూరు చేసిన పెరోల్ గడువును ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సహారా కేసులో జైలు పాలైన కంపెనీ డైరక్టర్లు రవిశంకర్ దూబే, అశోక్రాయ్చౌదరిలకు సైతం పెరోల్ మంజూరు చేసింది. రూ.500 కోట్లు కోర్టుకు జమ చేస్తానన్న హామీ మేరకు మిగిలిన రూ.300 కోట్లను కోర్టుకు జమ చేస్తారా...? లేక తిరిగి జైలుకు వెళతారా? అని రాయ్‌ని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మాతృమూర్తి మరణంతో మానవీయ కోణంలో సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఆయన రూ.200 కోట్లను మాత్రమే డిపాజిట్ చేశారు. కాగా, మిగిలిన రూ.300 కోట్లను డిపాజిట్ చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు గడువివ్వాలని సుబ్రతారాయ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే, ఆస్తుల విక్రయానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ధర్మాసనం రీసీవర్‌ను నియమించి సహారాకు చెందిన అన్ని ఆస్తులను అప్పగిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? అని ఎదురు ప్రశ్నించింది. తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ సున్నితంగా హెచ్చరించింది. ఇన్వెస్టర్లకు రూ.36వేల కోట్లను తిరిగి చెల్లించాలన్న తమ ఆదేశాలను గుర్తు చేసింది. ఆదేశాల అమలులో విఫలమైతే రాయ్‌తో పాటు మరో ఇద్దరు డైరక్టర్లను తిరిగి తిహార్ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అంతకుముందు రూబెన్ బ్రదర్స్ నుంచి తీసుకున్న 2.4 కోట్ల పౌండ్లు (సుమారు రూ.200కోట్లు) సెబీ-సహారా ఖాతాకు బదిలీ చేసేందుకు అనుమతించాలన్న సిబల్ అభ్యర్థనను ధర్మాసనం ఆమోదించింది. సహారా గ్రూపునకు సైతం ఊరట రాయ్‌తోపాటు సహారా గ్రూపునకు కూడా సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. సహారా గ్రూపునకు చెందిన ఇతర ఆస్తుల విక్రయ, హక్కుల బదిలీకి అనుమతించింది. దీని ద్వారా రూ.5వేల కోట్ల మేర నిధులు సమీకరించి బ్యాంకు గ్యారంటీ కింద సమర్పించేందుకు ఓ అవకాశం ఇచ్చింది. బెయిల్ కోసం సమర్పించాల్సిన రూ.5వేల కోట్లకు ఇది అదనం. లోగడ 19 ఆస్తులను మాత్రమే విక్రయిచేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మ్యూచువల్ పండ్స్, బంగారంపై డిపాజిట్లు, ఎన్ఎస్ఈలో వాటాలను నగదుగా మార్చుకునేందుకు సైతం సుప్రీంకోర్టు అనుమతి జారీ చేసింది.