breaking news
panchayats funds
-
పంచాయతీలకు నిధులు ఫుల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టించడంతో కేంద్రం కన్నెర్ర చేసింది. మంజూరైన నిధులకు యూసీలు సమర్పించకపోవడంతో తదు పరి నిధుల మంజూరుకు బ్రేక్ వేసింది. దీంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులకు కూడా నిధుల కొరత ఏర్పడింది. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులలో 60 శాతం వేతన పనుల కింద, 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనుల కింద ఖర్చు పెట్టాలి. ఈ రకంగా చేయాల్సిన గత ప్రభుత్వం వచ్చిన ఉపాధి నిధులను నిబంధనలకు విరుద్ధంగా వేరే వాటికి వినియోగించడం వలన పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాని దుస్థితి చోటు చేసుకుంది. దీంతో 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనులకు నిధుల సమస్య ఏర్పడింది. దీంతో ఆ పనులు చేపట్టిన కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని కొన్ని పనులు నిలిపివేయగా, మరికొందరు ఇష్టారీతిన, నాణ్యత లేకుండా పనులు చేపట్టి మమ అనిపించేశారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులకు దాదాపు రూ.80 కోట్ల బకాయిలున్నట్టు సమాచారం కొత్త ప్రభుత్వంలో కదలిక.. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది, మిగిలిపోయిన మెటీరియల్ కాంపోనెంట్ పనులతో కలిపి కొత్త పనులు చేపట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన రూ.300 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులతోపాటు మరో రూ.700 కోట్ల పనులు (మొత్తం రూ.1000 కోట్ల) పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు, అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం వెలగపూడిలోని సచివాలయం 5వ బ్లాక్లో సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూడు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్ కూడా ఇచ్చారు. పంచాయతీలకు తగ్గిన భారం.. గతంలో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలంటే నిర్దేశించిన అంచనా వ్యయంలో గ్రామ పంచాయతీలు మ్యాచింగ్ గ్రాంటుగా కొంత చెల్లించాల్సి వచ్చేది. 2 వేల జనాభా ఉన్న పంచాయతీలోనైతే 90 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 10 శాతం గ్రామ పంచాయతీలతో పనులు చేపట్టే పరిస్థితి ఉండేది. 2 వేల నుంచి 5 వేల జనాభా గల పంచాయతీల్లోనైతే 70 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 30 శాతం గ్రామ పంచాయతీలు భరించాల్సి ఉండేది. 5 వేల జనాభా దాటిన పంచాయతీల్లోనైతే 50 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 50 శాతం గ్రామ పంచాయతీలు తమ మ్యాచింగ్ గ్రాంటుగా సమకూర్చాల్సి ఉండేది. అంటే గ్రామ పంచాయతీల్లో మెటీరియల్ కాంపోనెంట్ పనులు జరగాలంటే పంచాయతీలు కొంత భారాన్ని మోయాల్సి ఉండేది. ఈ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండేది. అసలే నిధుల్లేక సతమతమవుతున్న పంచాయతీలకు ఇది అదనపు భారమయ్యేది. తమ వాటాగా ఇస్తేనే మెటీరియల్ కాంపోనెంట్ పనులు ఆయా పంచాయతీలకు దక్కేవి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పంచాయతీలపై భారం మోపకుండా కన్వర్జెన్సీ లేకుండా మొత్తం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతోనే పనులు చేపట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో పంచాయతీలకు ఆర్థిక భారం తొలగినట్టయింది. -
పంచాయతీలకు నిధులు విడుదల
సాక్షి, గుంటూరు :రెండున్నరేళ్లుగా నిధుల విడుదల నిలిచిపోయి సమస్యలతో కునారిల్లుతున్న పంచాయతీలకు శుభవార్త. వివిధ గ్రాంట్ల కింద జిల్లాలోని పంచాయతీలకు మొత్తం రూ.25.49 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులన్నీ ఇప్పటికే సబ్ట్రెజరీల్లోని పంచాయతీల ఖాతాలకు జమయ్యాయి. ఇక గ్రామాల్లో పనులు మొదలు పెట్టడమే తరువాయి. జిల్లాలో మొత్తం 1010 పంచాయతీలున్నాయి. ఇందులో 110 మేజర్ పంచాయతీలు, 900 మైనర్ పంచాయతీలు. వీటన్నింటికీ కిందటి జూలైలో ఎన్నికలు జరిగాయి. ఆగస్టు రెండో తేదీ నుంచి కొత్త సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చిన సర్పంచులు ఖాళీ ఖజానాలను చూసి విస్మయానికి గురయ్యారు. వీధిలైట్లు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, తాగునీటి సమస్యల్ని పరిష్కరించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక కొత్త సర్పంచులు మౌనం వహించారు. ఆగస్టు 12 నుంచి ఎన్జీవోల సమైక్య సమ్మె. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. వర్షాలకు దెబ్బతిన్నరోడ్లు, దయనీయంగా మారిన పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య, వీధిలైట్లు వెలగక గ్రామీణ జనం నానా ఇక్కట్లకు గురవుతున్నారు. 2011 ఆగస్టు నెలతో పాత పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు అన్ని రకాల నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయ్యాకే నిధుల విడుదలంటూ కేంద్రం షరతులు విధించింది. దీంతో వివిధ గ్రాంట్లు మొత్తం ఆగిపోయాయి. అయితే పది రోజుల కిందటే రాష్ట్రస్థాయిలో సమావేశమైన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గ్రాంట్ల విషయం కూలంకుషంగా సమీక్షించి కేంద్రాన్ని కోరిన దరిమిలా అన్ని జిల్లాలకు నిలిచిపోయిన గ్రాంట్ల విడుదల పూర్తయ్యింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.25,49,39,469 విడుదలయ్యాయి. ఆర్థిక సంఘం నిధులే ఎక్కువ.. విడుదలైన నిధుల్లో ఎక్కువ భాగం 13వ ఆర్థిక సంఘం నిధులే ఉన్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలోని రెండో విడత నిధుల కింద వీటిని కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మాత్రం రెండు విడతలవీ విడుదలయ్యాయి. మూడు, నాలుగు గ్రాంట్ల కింద విడుదలైన నిధులు జనాభా ప్రాతిపదికన మంజూరయ్యాయి. ఇందులో మేజర్ పంచాయతీలకు రూ. 2 నుంచి రూ.5 లక్షల వరకూ, మైనర్ పంచాయతీలకు రూ.30 నుంచి 50 వేల వరకూ కేటాయించే అవకాశాలున్నాయి. ఈ నిధులతో కొత్త సర్పంచులు గ్రామాల్లో వివిధ రకాల సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణకు మాడిపోయిన వీధిలైట్లను మార్చి కొత్తలైట్లు ఏర్పాటు చేసుకోవడం, బురదరోడ్లను బాగు చేసుకోవడం, మంచినీటి పైప్లైన్లు, మోటార్లకు మరమ్మతులు, ఫిల్టర్బెడ్లలో ఇసుక మార్పించడం, పంచాయతీ భవనాల నిర్మాణం తదితర పనులన్నీ చేసుకోవచ్చు. సర్పంచితో పాటు పంచాయతీ కార్యదర్శుల సంయుక్త సంతకాలతో చెక్కులు పాసవుతాయి. నేడు మండలాల్లో సమావేశం.. నిధుల వినియోగంపై సర్పంచులు, కార్యదర్శులకు సరైన అవగాహన కల్పించేందుకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వివిధ మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖరరావు ఎంపీడీవోలకు సూచించారు. మేడికొండూరు, చేబ్రోలు, దుగ్గిరాల వంటి మండలాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, మిగతా మండలాల్లో సమావేశాలు జరగాలని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో పంచాయతీలకు ఇప్పుడు విడుదలైన నిధుల కంటే నాలుగు రెట్లు అధికంగా మళ్లీ నిధులు విడుదలయ్యే అవకాశముందన్నారు. విడుదలైన నిధులు ఇవీ... 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 16,82,44,100 రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ. 5,55, 52,200 వృత్తి పన్ను నిధులు రూ. 2,41,89,400 జనాభా గ్రాంటు రూ. 63,53,768 ----------------------------------- మొత్తం నిధులు రూ. 25,49,39,468