breaking news
outdoor shooting
-
Twinkle Khanna: చచ్చిపోతాననే అనుకున్నా!
బహిరంగ ప్రదేశాలలో ఉన్నప్పుడు ప్రకృతి కల్పించిన అత్యవసరతను తీర్చుకోటానికి మహిళలకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం అన్నది ఇప్పటికీ ఉంది. ఏ చోటా వారికి ‘చాటు‘ దొరకదు. ప్రతిచోటా మగవాళ్లు.. మగవాళ్లు... మగవాళ్లు. ఎంతసేపని ఆపుకుని ఉండగలరు? చచ్చేంత పనౌతుంది.1990 లలో ‘జాన్‘ షూటింగ్ అప్పుడు ట్వింకిల్ ఖన్నాకు ఇలాంటి గడ్డు కాలమే దాపురించింది. చీకటితోనే కాలకృత్యాలు ముగిసినా, వెలుగొచ్చాక మళ్లీ ఒకసారి ‘ఒకటికి‘ వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ జరుగుతూ ఉన్నది ఒక కొండ పైన. చుట్టూ అంతా మగవాళ్లు. తను, ఒక హెయిర్ డ్రెసర్ మాత్రమే అక్కడున్న అమ్మాయి. వ్యానిటీ వ్యాన్ కూడా లేని రోజులు అవి! అసహాయంగా అలా ప్రాణాలు ఉగ్గబట్టుకునే ఉన్నారు ట్వింకిల్. మధ్యాహ్నం 3 గంటలు అయింది. ‘ఇక చచ్చిపోతాననే అనుకున్నాను. చివరికి భరించలేక నేనే క్రాలర్ నడుపుకుంటూ ఆ కొండ ప్రాంతంలో వెళ్లగలిగినంత దూరం వెళ్లి, తేలికపడ్డాను ‘ అని.. తనకెదురైన అనుభవాన్ని తన ‘ట్వీక్ ఇండియా‘ ఛానల్లో తాజాగా షేర్ చేసుకున్నారు ట్వింకిల్ ఖన్నా.మునుపు జయా బచ్చన్ కూడా ఇలాంటి భయానక పరిస్థితి గురించే తన మనవరాలు నవ్య నవేలీ నందా పాడ్ కాస్ట్లో బయటికి చెప్పుకున్నారు. ‘ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళినప్పుడు మాకు వ్యాన్ లు ఉండేవి కావు. పొదల చాటునే దుస్తులు మార్చుకోవలసి వచ్చేది. ప్రతిదీ పొదల వెనకే! కనీసం టాయ్లెట్స్ కూడా ఉండేవి కావు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కొన్నిసార్లు 3–4 సార్లు ప్యాడ్స్ మార్చుకోవలసి వచ్చేది. వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ లో కట్టి ఉంచి, ఇంటికి వెళ్లాక పడేయవలసి వచ్చేది‘ అని చెప్పారు జయాబచ్చన్. పిల్లలు ఎక్కడ కావలిస్తే అక్కడ పని కానిచ్చేస్తారు. ఈ విషయంలో మగవాళ్లు పిల్లలుగా ఉండగలరు. కానీ స్త్రీలకు ప్రకృతి కొన్ని స్వభావసిద్ధమైన పరిమితులను విధించింది. సగటు మహిళ అయినా, స్టార్ సెలబ్రిటీ అయినా.. వారి దేహధర్మాలు, సంకోచాలు, బిడియాలలో తేడాలేమీ ఉండవు. వాళ్లకు ఆ ‘స్పేస్‘ కల్పించటం, చూపించటం, లేదా ముందుగా ఏర్పాటు చేసి ఉంచటం పురుష ధర్మం. పురుష లక్షణం కూడా! -
దక్షిణాదిలో చేదు అనుభవాలు
సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన తాజా నటి రాధికాఆప్తే అని పేర్కొనవచ్చు. బాలీవుడ్లో అర్ధనగ్నం దాటి నగ్నంగానూ నటించి పెద్ద సంచలనానికి దారి తీసిన ఈ ఉత్తరాది నటి ఆ మధ్య ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి రమ్మన్నాడని చెప్పి పెద్ద దుమారాన్నే రేపారు. ఇలా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే నటి రాధికాఆప్తే తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణలు గుప్పించి మరోసారి తన వాటం ప్రదర్శించారు. ఇంతకీ ఈ అమ్మడేమందో చూద్దాం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నేను చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. ఈ భాషల్లో తాను ఎక్కువ చిత్రాలు చేయలేదు. అందువల్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం గురించి నేను మాట్లాడను. నేను నటించిన చిత్రాల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మాత్రమే చెబుతాను. తమిళం, తెలుగు చిత్రాల ఔట్ డోర్ షూటింగ్ల సమయంలో హీరోయిన్ల కంటే హీరోలకే హోటళ్లలో బసకు మంచి వసతులను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా హీరోలను షూటింగ్కు తొమ్మిది గంటలకు వస్తే చాలు అంటారు. ఇక హీరోయిన్లను అంతకు రెండు గంటలు ముందే రావాలని ఆర్డర్ వేస్తారు. ఇలా చాలా విషయాలు నన్ను బాధించాయి. అయితే కబాలి చిత్రానికి ఆ చిత్ర హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఇతర చిత్రాల్లో ఆ పరిస్థితి లేదు అని రాధికాఆప్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.