breaking news
one baby
-
అచ్చంపేట ఆస్పత్రిలో దారుణం
అచ్చంపేట రూరల్: వైద్య నిర్లక్ష్యానికి తల్లి కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. మరికొద్ది నిమిషాల్లో భూమ్మీదకు రావాల్సిన గర్భస్థ శిశువు రెండు ముక్కలై ప్రాణాలు విడిచింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ గర్భిణికి వైద్యులు సాధారణ ప్రసవం చేస్తుండగా శిశువు తల భాగం మొండెం నుంచి వేరుపడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన సాయిబాబు భార్య స్వాతి ఈ నెల 18న ఉదయం ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో చేరింది. గర్భిణి రిపోర్టులను పరిశీలించిన అనంతరం అదే రోజు ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, వైద్యులు సుధారాణి, సిరాజుద్దీన్ ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతుండటం, శిశువు తలభాగం బయటకు కనిపించడంతో బయటకు లాగేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మొండెం నుంచి తల వేరుపడగా మొండెం మాత్రం గర్భిణి కడుపులోనే ఉండిపోయింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన వైద్యులు శిశువు పొట్ట నీరుతో నిండి ఉండటంతో బయటకు రావట్లేదని, మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. అప్పటికే గర్భిణి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌లోని జజ్జిఖాన ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. శిశువు తలభాగం లేకపోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమకు విషయం చెప్పకుండా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ తీసుకెళ్లాకే తెలిసింది.. బాధితురాలి భర్త సాయిబాబు మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిల్లో తన భార్యకు పరీక్షలు చేయించినప్పుడు అందరూ బాగానే ఉందన్నారని చెప్పారు. అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మాత్రం తన భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పడంతోనే హైదరాబాద్‌కు తీసుకెళ్లామన్నారు. కానీ అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు చెబితేనే శిశువుకు తల లేని విషయం తెలిసిందన్నారు. తల్లి ప్రాణం కాపాడటానికే రెఫర్ చేశాం.. తల్లి గర్భంలో శిశువు పొట్ట లావుగా ఉందని రిపోర్టులలో చూశాక తెలిసిందని, ఆ విషయం కుటుంబ సభ్యులకు ముందుగానే చెప్పామని వైద్యులు సుధారాణి, తారాసింగ్ చెప్పారు. స్కానింగ్ రిపోర్టులో కూడా శిశువు బరువుగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పామన్నారు. మహిళకు మొదటిసారి అబార్షన్ జరగ్గా ప్రస్తుతం రెండో కాన్పుకు ఆస్పత్రికి వచ్చిందన్నారు. గర్భంలోని శిశువు తలభాగం మెత్తగా ఉండటంతోనే లాగే సమయంలో బయటకు వచ్చిందని చెబుతున్నారు. కాగా, శిశువు తల భాగం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి పరిసరాల్లోనే ఉందని స్థానికులు అంటున్నారు. కలెక్టర్ విచారణ.. ఇద్దరిపై వేటు ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ విచారణ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆస్పత్రిలోనే ఉన్న కలెక్టర్... ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ ఉత్తర్వులు జారీ చేశారు. -
వణుకు పుట్టిస్తున్న గజరాజు!
గువహటి: ఏనుగుల బీభత్సంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అస్సాంలోని గోల్పారా జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ గజరాజు నానా బీభత్సం సృష్టించడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు సహా మరో చిన్నారిపై దాడిచేసి వారి చావుకు కారణమైంది. దీంతో ఆగ్రహించిన గెంద్రపారా గ్రామస్తులు ఏనుగుల దాడుల నుంచి తమను కాపాడాలంటూ వారు శనివారం ఉదయం రోడ్డుపై బైఠాయించారు. అటవీ అధికారుల వైఫల్యంతోనే ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆరోపించారు. ఆ ముగ్గురి మృతదేహాలతో జాతీయ రహదారి 37పై అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబసభ్యులకు నష్టపరిహారం ఇప్పించి వారికి న్యాయం చేయాలని కోరారు. గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో గజరాజులు తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని గెంద్రపారా వాసులు తెలిపారు. ఇంత దారుణం జరిగినా ఏనుగును పట్టుకునేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అధికారులు ఇప్పటికైనా మేల్కోని తమ సమస్య పరిష్కారం చేయాలన్నారు.