భారత్‌లో వ్యాపారం కష్టమే..!
ఫోర్బ్స్ రేటింగ్‌లో 97వ స్థానంలో భారత్
అవినీతి, హింస, వాణిజ్య అంశాలే ఆటంకాలు
దేశంలో ఇప్పటికీ చాలా సమస్యలున్నాయి
అధిక యువ జానాభా కలిసొచ్చే అంశం
న్యూయార్క్: ఫోర్బ్స్ వ్యాపారానుకూల దేశాల జాబితా-2015లో భారత్ మెరుగైన స్థానాన్ని అందుకోలేకపోయింది. చివరకు 97వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫోర్బ్స్ 144 దేశాలతో ‘ఈ ఏడాది వ్యాపారానుకూల దేశాల జాబితా’ను రూపొందించింది. అవినీతి హింస కట్టడి, వాణిజ్య పర్యవేక్షణా స్వేచ్ఛ వంటి అంశాల విషయంలో భారత్ పనితీరు అంతంత మాత్రంగానే ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. ఈ జాబితాలో డెన్మార్క్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకోగా... యూకే 10వ స్థానంలో నిలిచాయి. జర్మనీ 18, అమెరికా 22, జపాన్ 23, దక్షిణాఫ్రికా 47, రష్యా 81, శ్రీలంక 91, చైనా 94 స్థానాల్లో నిలిచాయి. పాకిస్తాన్ 103, బంగ్లాదేశ్ 121వ స్థానంలో నిలవటం గమనార్హం.
ఇంకా భారత్‌లో చాలా సమస్యలున్నాయి..
భారత్‌లో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని ఫోర్బ్స్ తెలిపింది. దేశంలో పేదరికం, అవినీతి, హింస, మహిళల పట్ల వివక్ష, బలహీన విద్యుత్ రంగ వ్యవస్థ, సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం, వ్యవసాయ మౌలిక సదుపాయాల లేమి, పరిమితంగా ఉన్న వ్యవసాయ రంగ ఉపాధి అవకాశాలు, అందుబాటులో లేని నాణ్యమైన విద్య, అధిక వ్యయాలు తదితరాల్ని పరిష్కరించాల్సిన సమస్యలుగా పేర్కొంది. గతేడాది భారత్ వృద్ధి రేటు దశాబ్ద కనిష్టానికి పడిపోయిందని, రాజకీయ నాయకులు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చాలా కష్టపడాల్సి వచ్చిందని పేర్కొం ది. భారత్ బహిరంగ మార్కెట్ కలిగిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోందని, కానీ గత పాలసీల మూలాలు ఇంకా ఉన్నాయని తెలిపింది.
2014 నుంచి ఇన్వెస్టర్ల దృక్పథం మారింది: దేశంలో 2014 నుంచి కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు సానుకూల దృక్పథానికి వచ్చారని ఫోర్బ్స్ తెలిపింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వపు సంస్కరణలపై ఉన్న అంచనాల వల్ల దేశంలోకి మూలధన ప్రవాహం పెరిగిందని, రూపాయి మారక విలువ స్థిరంగా కొనసాగుతోందని వివరించింది. యువ జనాభా, తక్కువ డిపెండెన్సీ రేషియో, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ రేట్లు సానుకూలంగా ఉండటం వంటి అంశాల కారణంగా భారత్‌పై దీర్ఘకాల వృద్ధి అంచనాలు సానుకూలంగానే ఉన్నాయని పేర్కొంది.
ఈ అంశాల్లో పర్వాలేదు..
ఇన్వెస్టర్‌కు రక్షణ కల్పించడంలో 8, కొత్త ఆవిష్కరణల్లో 41, వ్యక్తిగత స్వేచ్ఛ అంశంలో 57, ఆస్తి హక్కు విషయంలో 61వ స్థానాల్లో భారత్ నిలిచింది. అయితే వాణిజ్య సంబంధిత అంశంలో 125వ స్థానంలో, పర్యవేక్షణ స్వేచ్ఛలో 139వ స్థానంలో ఉంది.