breaking news
Munisipalitis
-
నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్
-
అద్దెల వెనుక..అక్రమాలు
మునిసిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ మడిగెల అద్దె వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అద్దెను తక్కువకు కేటాయించి కమీషన్లు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నర్సంపేట : నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్లోని చాపల మార్కెట్, బాలికల పాఠశాల, సెంట్రల్ బ్యాంక్, నెహ్రు పార్కు, మునిసిపాలిటీ ముందు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మునిసిపాలిటీకి చెందిన మొత్తం 64 షాపులను అద్దెకు కేటాయించారు. వాస్తవానికి షాపుల అద్దెను రెన్యూవల్ ద్వారా కాకుండా టెండర్లతో కేటాయిస్తే మూడు రెట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే మూడు సంవత్సరాలకు ఒక్కసారి 33శాతం అద్దె పెంచుతూ రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నారు. అంబేద్కర్ సెంటర్లోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న మునిసిపాలిటీ షాపులకు నెలకు గతంలో రూ.2700 చొప్పున అద్దె నిర్ణయించారు. దీంతో ప్రతి ఏడాది రూ.25లక్షలు ఆదాయం వస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. వాస్తవానికి అంతే విస్తీర్ణంలో ఉన్న ప్రైవేట్ షాపులకు మార్కెట్లో రూ.6వేల నుంచి రూ.7వేల వరకు అద్దె ఉంది. ఈ వ్యత్యాసం చూస్తే ప్రతీ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రైవేట్ షాపుల కంటే సగం అద్దెకు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో ప్రతి ఏడాది మరో రూ.25 లక్షల ఆదాయం కోల్పోతోంది. 13 ఏళ్లుగా ఇదే తంతు.. షాపింగ్ కాంప్లెక్స్‌లకు 2005 సంవత్సరంలో టెండర్ల ద్వారా అద్దెలు నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ప్రతీ సారి అద్దె 33శాతం పెంచి రెన్యూవల్తోనే కొనసాగిస్తున్నారు. దీంతో రూ.కోటికి పైగానే ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. అధికారుల కనుసన్నల్లోనే.. మునిసిపాలిటీ పరిధిలో పనిచేసే అధికారుల కనుసన్నల్లోనే అద్దెల వ్యవహారం కొనసాగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నా యి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నర్సంపేట 2011లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. టెండర్లు నిర్వహించిన 2005 నుంచి ఆరు సంవత్సరాల పాటు నలుగురు ఈఓపీఆర్డీలు మారారు. 2011 నుంచి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన 2018 వరకు ముగ్గురు కమిషనర్లు మారారు. మొత్తం ఏడుగురు అధికారులు మారినా షాపింగ్ కాప్లెక్స్లకు రెన్యూవల్తోనూ అద్దెలకు కేటాయించారు. కొన్నిచోట్ల ఒక్కరికే రెండు షాపులను కేటాయించి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. తక్కువ అద్దెకు షాపులు కేటాయించి సదరు యజమానులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కమీషన్లు దండుకుంటూ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారైనా సక్రమంగా జరిగేనా.. భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ సారి కూడా రెన్యూవల్ పద్ధతిన గట్టెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 64 షాపులలో 75శాతం వాటికి గత మార్చి 31వ తేదీతో గడువు ముగిసిపోయింది. వాటికి వచ్చే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి అద్దెను నిర్ణయించే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి మునిసిపాలిటీకి జరుగుతున్న నష్టాన్ని పాలకవర్గం అడ్డుకుని ఆదాయం పెంచుకుని అభివృద్ధికి బాటలు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నష్టం జరగకుండా చూస్తాం.. మునిసిపాలిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె పెంచేందుకు సర్వే చేయిస్తాం. ప్రైవేట్ షాపుల అద్దెతో పోల్చి సరాసరి అద్దెను నిర్ణయించి నష్టం జరగకుండా చూస్తాం. ఒకే వ్యక్తికి రెండు షాపులు కేటాయించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. మునిసిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారమే షాపులను కేటాయించేలా కౌన్సిల్ సమావేశంలో నిర్ణయిస్తాం. -
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల ఎన్నికలకు ఈ నెల 30వ తేదీ పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. మొత్తం 142 వార్డులకు 592 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, 2 లక్షల 12 వేల 179 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు 219 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. 268 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) ఏర్పాటుచేసి 1,313 మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు వివరించారు. 303 మంది సర్వీస్ ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ చెప్పారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, చీమకుర్తి, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల ఎన్నికలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ముందుగా వార్డుల వారీగా ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత చైర్మన్లను ఎన్నుకుంటారని తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. రీ పోలింగ్ అవసరమైతే ఏప్రిల్ 1వ తేదీ నిర్వహిస్తామన్నారు. 2వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోనే కౌంటింగ్ జరుగుతుందన్నారు. చీమకుర్తి, అద్దంకి ప్రాంతాల్లో 8 టేబుల్స్ చొప్పున, మిగిలిన ప్రాంతాల్లో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటుచేసి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 87 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మున్సిపల్ ఎన్నికల్లో 87 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు వీడియోగ్రఫీ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక సెక్యూరిటీ పర్సన్‌ను నియమించామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 1+2 పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 5గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసిందని, ఒక్కో అభ్యర్థికి ఒక వాహనానికి మాత్రమే అనుమతిచ్చామని తెలిపారు. చిన్నచిన్న వార్డులుంటే వాటి పరిధిలోనే ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల అనంతరం కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారిని ఏజెంట్లుగా నియమిస్తే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి ఏజెంట్‌కు ఫొటో గుర్తింపు కార్డు ఇచ్చి కౌంటింగ్ కేంద్రంలోకి పంపిస్తామని తెలిపారు. పూర్తిగా పోలీసులకే వదిలిపెట్టలేదు... ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు నిరంతర నిఘా పెట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆ విషయాన్ని పూర్తిగా పోలీసులకే వదిలి పెట్టకుండా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్స్ కలిగిన వారిని ఫ్లయింగ్ స్క్వాడ్స్ కింద నియమించినట్లు చెప్పారు. వారు జాయింట్ టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల వాహనాలతో పాటు ఎలక్షన్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వాహనాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూనే ఉంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 3 కోట్ల 65 లక్షల రూపాయలను పట్టుకున్నామని, ఆ నగదుకు సంబంధించిన రికార్డులు చూపించడంతో వదిలేశామని, ఆ మేరకు జిల్లా ఎస్పీ నుంచి వివరణ తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. అవికాకుండా ఇప్పటివరకు 6 లక్షల 80 వేల రూపాయలను పట్టుకున్నట్లు చెప్పారు. ఓటుహక్కు కోసం 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు... ఓటుహక్కు కోసం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం గడువిచ్చిందని కలెక్టర్ తెలిపారు. కొన్నిచోట్ల ఓట్లను తొలగించారన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ నెల 9, 16 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా ఓటు హక్కు కోసం జిల్లాలో 94 వేల 560 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 60 వేల దరఖాస్తులను విచారించామని చెప్పారు. మిగిలిన వాటిని కూడా రెండుమూడు రోజుల్లో విచారిస్తామన్నారు. గతంలో ఓటు హక్కు ఉండి జాబితాలో పేర్లులేనివారు సక్రమంగా వివరాలు అందించకుంటే తిరస్కరిస్తామన్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఒక్క ఓటు కూడా తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. సుమోటాగా ఓట్లను తొలగించే అధికారం కూడా లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు పాల్గొన్నారు.