breaking news
Minister Mukhtar Abbas Naqvi
-
ఆర్థిక సంస్కరణలతో ‘ప్రగతి’ పరుగులు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంస్కరణలతో దేశప్రగతి పరుగులు తీస్తోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రమోషన్ క్యాంపెయిన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం నక్వీ మాట్లాడుతూ బలమైన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారతదేశాన్ని ప్రపంచం గుర్తించిందని అన్నారు. భారతదేశం ప్రస్తుతం పెట్టుబడులకు అత్యంత భద్రమైన, బలమైన గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి ‘ముద్ర యోజన’లో భాగంగా దాదాపు రూ.9.13 కోట్ల మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ‘ముద్ర యోజన’లబ్ధిదారుల్లో సుమారు 76 శాతం మంది మహిళలు ఉన్నారని మంత్రి వెల్లడించారు. 55 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలవారు ఉన్నారని వివరించారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే ముద్ర లక్ష్యమని అన్నారు. నోట్ల రద్దు ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. ముద్ర యోజనతోపాటు ‘స్టార్టప్ ఇండియా’‘స్టాండప్ ఇండియా’’ తదితర పథకాల గురించి మంత్రి వివరించారు. ‘జన్‌ధన్’లో అగ్రగామి జన్‌ధన్ ఖాతాలు తెరిపించడం, నగదు లావాదేవీలు నిర్వహించడంలో రాష్ట్రం ముందుందని నక్వీ అన్నారు. స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద కొంత వెనుకబడి ఉన్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశంలోనే అగ్రగామిగా మహిళా గ్రూపులు పనిచేస్తున్నాయని, వివిధ కార్యక్రమాల కింద రూ.3,700 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర గ్రామీణావృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్త్రీనిధి ద్వారా మహిళలకు రూ.35 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనా«థ్, కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, స్టీఫెన్సన్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.500 కోట్ల విలువ గల చెక్కులను 14 వేల స్వయం సహాయక గ్రూపులకు అందజేశారు. పలు బ్యాంకుల నుంచి మంజూరైన ముద్ర రుణాలను మంత్రులు పంపిణీ చేశారు. డిజిటల్ చెల్లింపులు జరిపే విధానం, ‘భారత్ క్యూఆర్ కోడింగ్’, ‘భీమ్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవడం, బ్యాంకు ఖాతాలను ‘ఆధార్’తో జోడించడం వంటి అంశాలను కూడా వివరించారు. దాదాపు 35 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల గురించి వివరించేందుకు 60 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. 9 రకాల ఆర్థిక సేవలను అక్కడికక్కడే అందజేశాయి. -
మైనారిటీల సాధికారతపై నఖ్వీ సమీక్ష
ముఖ్యమంత్రి ఫడ్నవీస్, సంబంధిత అధికారులతో భేటీ ♦ మోడల్ కార్పొరేషన్లుగా మూడు నగరాల అభివృద్ధి ముంబై: మైనారిటీల సాధికారతకు సంబంధించిన అంశాలపై కేంద్ర మైనారిటీల సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం ఇక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమాన్ని గూర్చిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించానని చెప్పారు. అంతకుముందు మైనారిటీల సంక్షేమంపై రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సే, సంబంధిత అధికారులతో కూడా సమావేశమయ్యానని తెలిపారు. మైనారిటీల సాధికారత కోసం రాష్ట్రంలోని మూడు నగర కార్పొరేషన్లను మోడల్ కార్పొరేషన్లుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఈ సమావేశాల్లో ముందుకొచ్చిందని నఖ్వీ చెప్పారు. ఈ అంశంపై తాను ఫడ్నవీస్‌తో సవివరంగా చర్చించానని, ఆ మూడు నగరాలను జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుందని తెలిపారు. చాందసవాద శక్తులు, తాలీబానీ మనస్తత్వం అభివృద్ధికి శత్రువులని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే ఈ శక్తులను ఓడించగలమని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు లౌకికవాదులం అని చెప్పుకుంటూనే మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేసి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తుంటాయని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజలందరి సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని నఖ్వీ చెప్పారు. దేశ పురోగతి దృష్ట్యా ఈ సమావేశాలు ఎంతో ప్రాముఖ్యమైనవని అన్నారు. బడ్జెట్‌తో పాటు సంస్కరణల ప్రక్రియకు సంబంధించిన అనేక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. అందుకోసం తాము ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటున్నామని చెప్పారు. తమ ప్రయత్నాల్లో భాగంగానే ఈ నెల 22న న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించి బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేయగలవని నఖ్వీ ఆశాభావం వ్యక్తం చేశారు.