మొహంపై మచ్చ.. ప్లాస్టిక్ సర్జన్‌కు ప్రధాని అదిరిపోయే కౌంటర్!
కోపెన్హాగన్: డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ సహనం కోల్పోయారు. తనపై చేస్తున్న బాడీ షేమింగ్ కామెంట్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆమెకు ఒక ప్లాస్టిక్ సర్జన్ నుండి షాకింగ్ మెసేజ్ వచ్చింది. ‘మీ ముక్కు మీద ఉన్న ఆ చిన్న మచ్చను సరిచేస్తాను అని సదరు సర్జన్ మెట్కు మెసేజ్ చేశారు.ఆ మెసేజ్‌తో చిర్రెత్తిపోయిన ఆమె.. ఆ ప్లాస్టిక్ సర్జన్ చేసిన ఆఫర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు (అతని పేరును గోప్యంగా ఉంచారు). ఇన్నేళ్లుగా నా రూపం గురించి నాకు లెక్కలేనన్ని మెసేజ్‌లు వచ్చాయి. నా పళ్లు అందవిహీనంగా ఉన్నాయని, జుట్టు పలుచగా ఉందని, నా ముక్కు మీద ఒక మచ్చ ఉందని చాలామంది కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జన్‌ను ఉద్దేశిస్తూ.. నా ముక్కు మీద ఉన్న మచ్చపై చూపిస్తున్న మీ శ్రద్ధకు ధన్యవాదాలు. నాకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదు. నా శరీరం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. దాని గురించి సలహాలు ఇవ్వడానికి నాకు ఏ పురుష ప్లాస్టిక్ సర్జన్ అవసరం లేదు’ అని ఘాటుగా బదులిచ్చారు. నేను ఇతరుల రూపంపై ఎప్పుడూ జోక్యం చేసుకోను. 50 ఏళ్లకు దగ్గరవుతున్న ఒక మహిళగా నా శరీరం విషయంలో నేను సంపూర్ణ సంతృప్తితో ఉన్నాను. మీరు నాకు ఉత్తరం రాయాలనుకుంటే రాయండి. అందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దయచేసి మీ విలువైన సమయాన్ని అర్థవంతమైన ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి ఉపయోగించండి. అంతేకాని నా ముక్కు గురించి కాదు’ అని ఆమె హితవు పలికారు.ఇక ఆమె రాజకీయాల విషయానికొస్తే.. సోషల్ డెమోక్రాట్ పార్టీకి చెందిన మెటె ఫ్రెడెరిక్సన్, డెన్మార్క్ రెండవ మహిళా ప్రధానిగా ప్రస్తుతం తన మూడవ పదవీకాలంలో కొనసాగుతున్నారు. ఈ హోదాతో ఆమె యూరప్‌లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన, అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరిగా నిలిచారు. ఆమె 2019 మధ్యకాలం నుండి యూరోపియన్ యూనియన్,మరియు నాటో ,సభ్య దేశమైన డెన్మార్క్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల గ్రీన్‌ల్యాండ్‌పై వస్తున్న రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటానని, అలాగే రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు తన మద్దతు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.