చంద్రబాబు వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని ఏపీ సీఎం చంద్రబాబుపై ఓ న్యాయవాది కేసు వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చడం రాజద్రోహమని అందులో పేర్కొన్నారు. ఇలాంటి వాఖ్యలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్ నగరంలో ఉండి ఆంధ్రను పరిపాలించడం విదేశాల్లో ఉండి పరిపాలించినట్లు ఉందని చేసిన వ్యాఖ్యలపై రాజశేఖర్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, తెలంగాణలో ఉండి పరిపాలించడం విదేశంతో పోల్చడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈ విషయం దేశ సార్వభౌమత్వాన్ని కూడా ప్రశ్నించే విధంగా ఉందని తెలిపారు. ఈ విషయమై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు.