breaking news
lalaguda police
-
రెండో భార్యతో కలిసి దొరికిపోయాడు
హైదరాబాద్(సిటీబ్యూరో): ఆ ఇద్దరూ భార్యాభర్తలు. ఆమె అతడికి రెండో భార్య. ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవడంతో రెండు ఫ్యామిలీలు మ్యానేజ్ చేయడం కష్టంగా మారింది. దీంతో రెండో భార్యతో కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ దంపతుల్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. వీరి నుంచి 100 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంబర్‌పేట శంకర్‌నగర్‌లో నివసిస్తున్న ఒగ్గు శ్రీనివాస్ గతంలో సెక్యూరిటీగార్డుగా పని చేశాడు. వివాహితుడైన ఇతగాడు అదే ప్రాంతానికి చెందిన పని మనిషి వి.రేణుకను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య ఇతడిపై వేధింపుల కేసు పెట్టింది. ప్రస్తుతం రెండో భార్యతోనే కలిసి జీవిస్తున్న శ్రీనివాస్ అప్పుడప్పుడు మొదటి భార్య పోషణ సైతం చూస్తున్నాడు. సక్రమంగా విధులు నిర్వర్తించని కారణంగా ఉద్యోగం పోగొట్టుకుని దినసరి కూలీగా మారాడు. ఇలా వచ్చే ఆదాయంతో మొదటి భార్య, రెండో భార్యల్ని పోషించడం ఇతడికి కష్టంగా మారింది. దీంతో రెండో భార్యతో కలిసి చోరీలు చేయాలని పథకం వేశాడు. తనకు ఉన్న కైనటిక్ హోండా వాహనంపై ఇరువురూ బయలుదేరతారు. పగటిపూట సంచరిస్తూ రెక్కీలు చేస్తారు. టులెట్ బోర్డులు ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటారు. తాము భార్యాభర్తలమని, ఇల్లు అద్దెకు కావాలంటూ యజమానితో మాట్లాడతారు. ఓపక్క ఇలా చేస్తూనే మరోపక్క ఆ భవనంలో తాళం వేసి ఉన్న మరో ఇంటిని గుర్తిస్తారు. యజమానితో మాట్లాడటం పూర్తయి, ఆయన ఇంట్లోకి వెళ్లిపోయిన తర్వాత తాళం వేసి ఉన్న ఇంటి వద్దకు వెళ్తారు. దాని తాళం పగులకొట్టి లోపలకు ప్రవేశించడం ద్వారా అందినకాడికి ‘ఊడ్చేస్తారు’. ఆపై ఏమీ ఎరుగనట్లు చోరీ సొత్తుతో తమ వాహనంపై వెళ్ళిపోతారు. ఈ పంథాలో జూబ్లీహిల్స్, లాలాగూడ, మల్కాజ్‌గిరిల్లో పంజా విసిరారు. లాలాగూడ ఠాణా పరిధిలో 10 రోజుల క్రితం నేరం జరగడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగలు వాడిన వాహనాన్ని గుర్తించారు. అది ఏ మార్గంలో ప్రయాణించిందో తెలుసుకోవడానికి మరో 100 సీసీ కెమెరాల ఫుటేజీని అధ్యయనం చేశారు. చివరకు ఆ వాహనం అంబర్‌పేట వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలో ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రవి, బి.శ్రవణ్‌కుమార్ తమ బృందాలతో ఆ ప్రాంతంలో గాలించారు. ఆదివారం శంకర్‌నగర్‌లో ఇరువురినీ పట్టుకున్నారు. వీరి నుంచి బంగారం, వెండి, వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును లాలాగూడ పోలీసులకు అప్పగించారు. -
లాలాగూడలో మరో యువకుడు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మొబైల్ చోరీ కేసులో గురువారం ఆత్మహత్యకు పాల్పడిన తరుణ్ యాదవ్ స్నేహితుడు ముఖేష్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసుల వేధింపులు తాళలేకే ముఖేష్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సుశీల్ అనే స్నేహితుడు ఇచ్చిన పార్టీకి తరుణ్ యాదవ్, ముఖేష్‌లు హజరయ్యారు. ఆ సమయంలో సుశీల్ ట్యాబ్ పోయింది. ఈ నేపథ్యంలో సుశీల్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ క్రమంలో తన అనుమానం తరుణ్, ముఖేష్‌లపై ఉన్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. ఆ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన తరుణ్ గురువారం ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే శుక్రవారం ముఖేశ్ శుక్రవారం యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు.