లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
లకురవా..! ఒకప్పుడు నైజీరియాలో దోపిడీ దొంగల నుంచి గ్రామీణులను కాపాడతారనే పేరున్న ఈ ముఠా సభ్యులు.. క్రమంగా కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో జతకట్టారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలో పాగా వేశారు. ఇప్పుడు పెద్దన్న...... అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా మారారు. అందుకే ట్రంప్ క్రిస్మస్ రోజున ‘హ్యపీ క్రిస్మస్’ సందేశమిస్తూ.. నైజీరియా వాయవ్య సరిహద్దుల్లోని సోకోటో రాష్ట్రంలో ఐఎస్ ఉగ్రవాదులను టార్గెట్‌గా చేసి, దాడులు జరిపిన విషయాన్ని బహిర్గతం చేశారు. ఏమిటా లకురవా ముఠా? ట్రంప్ వారిపై ఎందుకు కక్షకట్టాడు?? లకురవా అంటే రిక్రూటింగ్ అని అర్థం. 2016-17 మధ్యకాలంలో లకురవా ముఠా టంకాసాలోని గోంగానో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలపై దాడులు జరిపి, దోపిడీలకు పాల్పడే మూకల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేది. తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడే ఈ గ్రామాలను దోచుకునే బందిపోట్ల పీచమణిచేది. వ్యవసాయాధారితమైన ఈ గ్రామాల్లో రాజకీయ అస్థిరతకు తోడు.. నైజీరియా సైన్యం రక్షణ లేకపోవడంతో.. దోపిడీదారులు విజృంభించేవారు. ఈ పరిస్థితుల్లో నైజర్, మాలి నుంచి వచ్చిన కొంతమంది యువకులు దోపిడీదారులపై ఎదురుదాడి చేశారు. గ్రామస్థులు కూడా వీరికి మద్దతిచ్చారు. 2018 నాటికి ఈ ముఠా శక్తిమంతమైంది. తమ ముఠాకు లకురవా అని నామకరణం చేసింది. స్థానికులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని స్థిరపడింది. ఆ తర్వాత.. తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. ఇస్లామిక్ నిబంధనలను అమలు చేయడం మొదలు పెట్టింది. మ్యూజిక్ వినేవారికి కొరడాలతో శిక్షలు విధించింది. 2023 నాటికి లకురవా ముఠా.. సోకోటోలోని అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. గతంలో ఈ ప్రాంతాలను బెంబేలెత్తించిన దోపిడీదారులను మించి.. ప్రజలను హింసించడం మొదలు పెట్టింది. క్రమంగా క్రూరత్వానికి మారుపేరుగా లకురవా మారిపోయింది. గ్రామాలపై పన్నులు విధించి.. దారుణంగా వసూలు చేసేది. దాదాపు 500 గ్రామాల్లో లకురవా పాగా వేసింది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే నైజీరియా సైన్యంపై అత్యంత క్రూరంగా దాడులు జరిపేది.క్రమంగా లకురవా ముఠాలు రిక్రూట్మెంట్లను తీవ్రతరం చేశాయి. 18-35 ఏళ్ల యువకులను ఆకట్టుకున్నాయి. తమతో జతకట్టే యువకుల కుటుంబాలకు డబ్బులివ్వడమే కాకుండా.. వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, విత్తనాలను అందజేసేది. అలా.. దారుల్ ఇస్లాం అనే పేరుతో శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. దీంతో.. నైగర్, నైజీరియా సైన్యాలు చర్యలకు ఉపక్రమించాయి. 2024 నవంబరులో ఈ రెండు దేశాలు లకురవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో లకురవా ఉగ్రదాడులను మరింతగా పెంచింది. అదే నెలలో కేబ్బీలోని మెరా అనే గ్రామంపై దాడి చేసి, 25 మంది గ్రామస్థులను హతమార్చింది.లకురవాను ఉగ్రసంస్థగా ప్రకటించడానికి సరిగ్గా రెండు నెలల ముందు.. అంటే.. 2024 సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి ఓ కీలక సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. లకురవా నేతలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారనేది ఆ సమాచారంలో ప్రధానాంశం. ఐఎస్‌లో చేరి ఐఎస్‌జీఎస్.. అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ద గ్రేటర్ సహారాను ఏర్పాటు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా.. ఐఎస్ నుంచి అధునాతన ఆయుధాలు, డ్రోన్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలను సేకరించింది. ఐఎస్‌జీఎస్ ఇప్పుడు బోకోహరామ్‌తో కూడా చేతులు కలిపే ప్రమాదాలున్నట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అదే సమయంలో.. లకురవా మాత్రం అరాచకాలను మరింత పెంచింది. క్రైస్తవులు అధికంగా ఉండే గ్రామాలను టార్గెట్‌గా చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను టార్గెట్‌గా చేసుకుంది. లకురవా చర్యలపై ఉప్పందుకున్న అమెరికా రంగంలోకి దిగింది. ఈ ఏడాది నవంబరు నుంచే అమెరికా గూఢచర్య సంస్థలు వాయవ్య నైజీరియాలో నిఘాను పెంచినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కూడా ఈ నెల 22న ఓ కథనాన్ని ప్రచురించింది. అందుకు తగిన ఆధారాలుగా అమెరికా సైన్యం ఫైటర్ జెట్ల రాకపోకలకు సంబంధించిన ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను పాఠకుల ముందుంచింది. అంతేకాదు.. క్రైస్తవులపై హింస పెరుగుతుండడంతో మత అసహన దేశాల జాబితాలో నైజీరియాను ట్రంప్ ప్రభుత్వం చేర్చింది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా ట్రంప్ ప్రపంచానికి షాకిచ్చారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలోని బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని, దాడులు జరిపినట్లు ప్రకటించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ దాడులు జరిపానంటూ తననుతాను సమర్థించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతంచేస్తానని ప్రతినబూనారు.లకురవా అరాచకాలు ఒక్కటని చెప్పలేం. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో కూడా క్రిస్మస్ రోజున దాడులు జరిపింది. కొన్ని వారాల క్రితం ఉత్తర నైజీరియాలో ఓ క్యాథలిక్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, 300 మంది పిల్లలను అపహరించింది. నైజీరియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక అపహరణ ఉదంతం. చాలా మంది పిల్లలను ఆ తర్వాత విడుదల చేసినా.. మిగతావారెక్కడ? అనేదానిపై స్పష్టత లేదు. ఓ క్రైస్తవ మిషనరీ సంస్థ కోసం పనిచేసే ఓ పైలట్ కూడా ఇటీవల అపహరణకు గురయ్యారు. నైజీరియాలో ముస్లిం-క్రిస్టియన్ల జనాభా దాదాపుగా చెరిసగం ఉంటుంది. ఈ నేపథ్యంలో నైజీరియాలో క్రైస్తవులపై దాడులు కొనసాగితే.. అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఆ మేరకే క్రిస్మస్కు ముందు సోకోటోలోని అనేక ఉగ్రవాద స్థావరాలను అమెరికా, నైజీరియా సైన్యాలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. ఈ ఉదంతాన్ని బహిర్గతం చేస్తూనే ట్రంప్ ‘హ్యాపీ క్రిస్మస్’ అంటూ పోస్టు చేశారు. ట్రంప్ పట్టుదలను చూస్తుంటే.. నైజీరియాలో అమెరికా సైన్యాన్ని మరింతగా మోహరించి, మున్ముందు మరిన్ని దాడులు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -హెచ్.కమలాపతిరావు