కోవైకు మరో చాన్స్
సాక్షి, చెన్నై : కోయంబత్తూరులో మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం మరో చాన్స్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. మళ్లీ పరిశీలనకు కేంద్రం నిర్ణయించింది. అయితే, మోనో జపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెట్రోకు అనుకూలంగా స్పందించేనా అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. డీఎంకే హయాలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెయింట్ థామస్ మౌంట్ - గిండి - సైదా పేట మీదుగా చెన్నై సెంట్రల్‌కు ఓ మార్గం, చాకలి పేట - కోయంబేడు - ఆలందూరు మీదుగా విమానాశ్రయానికి మరో మార్గం చొప్పున రైలు సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కోయంబేడు - ఆలందూరు వరకు పనులు ముగింపు దశకు చేరడంతో ఈ ఏడాది ఆఖర్లో రైలు సేవలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతున్నారు. మిగిలిన పనులు మరో ఏడాది లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చెన్నై తర్వాత రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూరు సైతం ట్రాఫిక్ ఇక్కట్లను ఎదుర్కొంటూ వస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఈనగరానికి మెట్రో రైలు సేవలకు మరో మారు పరిశీలనకు కేంద్రం సిద్ధం అయింది.
పరిశీలన
యూపీఏ -2 హయాంలో కోయంబత్తూరుకు మెట్రో రైలు సేవలను అందించేందుకు కేంద్రం నిర్ణయించిం ది. అయితే, స్థల సేకరణ, భాగస్వామ్య వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ కనబరచని దృష్ట్యా, ఆ ప్రాజెక్టు కాస్త వెనక్కు వెళ్లింది. అదే సమయంలో మెట్రో రైలుకు ప్రత్యామ్నాయంగా మోనో రైలు సేవలను కోయంబత్తూరుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటన చేసి ఏళ్లు గడుస్తున్నా, ఇంత వరకు ఆ పనులు అడుగైనా ముందుకు సాగలేదు. దీంతో కోయంబత్తూరువాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంది వచ్చి న మెట్రో పథకాన్ని విస్మరించి, మోనో నినాదాన్ని తెరపైకి తెచ్చింది కాకుండా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నిధులు
చేజారిన అవకాశం మళ్లీ కోయంబత్తూరు వాసుల ముంగిట వాలుతున్నది. మరో చాన్స్ ఇచ్చేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధం అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల పరిశీలనకు నిధులను కేటాయించారు. 21 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల్లో ఈ ప్రాజెక్టుల అమలుకు నిర్ణయించారు. ఆ మేరకు కోయంబత్తూరు జనాభా 21 లక్షల పైమాటే. దీంతో ఈ నగరంతో పాటుగా 20 లక్షల మంది జనాభా కలిగిన మదురైను సైతం ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేయడానికి కేంద్రం కసరత్తుల్లో పడి ఉంది. దక్షిణ తమిళనాడుకు కేంద్రంగా మదురై బాసిల్లుతుండడం, ఇక కొంగు మండలానికి ప్రధాన కేంద్రంగా ఉన్న కోయంబత్తూరు నిలుస్తుండడంతో, ఈ రెండింట్లో ఓ నగరాన్ని తొలి విడతగా ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేయగానికి పరిశీలనలు వేగవంతం అయ్యాయి.
రాష్ట్రం స్పందించేనా?
మదురైను ఇప్పట్లో పరిగణనలోకి తీసుకోవడం అనుమానమే. దక్షిణాది జిల్లాలు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న సమయంలో ఆ జిల్లా ప్రధాన కేంద్రంలో మెట్రో ప్రాజెక్టుకు అనుకూల వాతావరణం లేదు. ఈ దృష్ట్యా, కోయంబత్తూరుకే అధిక ఛాన్స్ కనిపిస్తోంది. పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందిన కోయంబత్తూరు ఛాయల్లోకి ఇది వరకే మెట్రో పథకం వచ్చి వెనక్కు వెళ్లిన దృష్ట్యా, మరో మారు ఆ నగరాన్ని ఎంపిక చేయడానికి కేంద్రం సిద్ధం అవుతోంది. ఈ సమాచారం కోయంబత్తూరువాసుల్లో ఆనందాన్ని నింపుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఇది వరకు వచ్చిన ప్రాజెక్టును పక్కన పెట్టి, మోనో నినాదం అందుకున్న అన్నాడీఎంకే సర్కారు, మరోమారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ నగరానికి మెట్రో రైలు తీసుకు వస్తే, మరింత శోభ సంతరించుకోవ డంతో పాటుగా ట్రాఫిక్‌ను క్రమ బద్ధీకరించేందుకు వీలుందని కోయంబత్తూరువాసులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారైనా స్పందించాలన్న ఆత్రుతతో ఆ నగరవాసులు ఎదురుచూస్తున్నారు.