breaking news
kodandaramaswami
-
రామతీర్థానికి కోదండరాముడు
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా రామతీర్థానికి తిరుమలలో రూపుదిద్దుకున్న కోదండరాముని విగ్రహాలు శనివారం చేరుకున్నాయి. రామతీర్థంపై ఉన్న కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. టీటీడీకి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో స్వామివారి విగ్రహాలను తయారు చేశారు. దేవదాయ ఆర్జేసీ భ్రమరాంబతో పాటు మరికొందరు అధికారులు శుక్రవారం తిరుపతి వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో సీతారామలక్ష్మణస్వామి విగ్రహాలను శనివారం రామతీర్థానికి తీసుకువచ్చారు. అర్చకులు విగ్రహాలు తీసుకువచ్చిన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి స్వామివారి విగ్రహాలను రామతీర్థంలో తిరు వీథి గావించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. విగ్రహాలకు అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం పక్కనే ఉన్న ప్రత్యేక గదిలో భద్రపరిచారు. ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ..ఈ నెల 28న శాస్త్రోక్తంగా బాలాలయంలో విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. నీలాచలంపై కోదండ రామాలయం అభివృద్ధి పనులు పూర్తయ్యాక అక్కడ విగ్రహాలను పునః ప్రతిష్టింపజేస్తామన్నారు. అప్పటివరకు బాలాలయంలోనే స్వామివారికి నిత్యపూజలు కొనసాగుతాయని చెప్పారు. -
చిన్న శేషుడిపై శ్రీరాముడి చిద్విలాసం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ నిర్వహించారు. గజరాజులు ఠీవీగా ముందుకు కదిలాయి. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. వాహన సేవ అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చం దనం, పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. సాయంత్రం 5 గంటలకు కోదండరాముడికి ఊంజల్‌సేవ నిర్వహించారు. హంస వాహనంపై స్వామివారి వైభవం శనివారం రాత్రి కోదండరాముడు హంస వాహనం అధిరోహించి పురవీ దుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. కళాకారుల భజనలు, రామనామ స్మరణల మధ్య స్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీధర్, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నమచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకుడు ఎంవీ.సింహాచలశాస్త్రి బృందం నిర్వహించిన భక్త శబరి హరికథా పారాయణం ప్రేక్షకులను అలరించింది.