breaking news
kariganipalli
-
వివాహిత ఆత్మహత్య
కుందుర్పి : కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన శిల్ప(24) అనే వివాహిత శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు. వారి కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం పొన్నసముద్రానికి చెందిన చిక్కీరప్పతో నాలుగేళ్ల కిందట శిల్ప వివాహమైంది. ఏడాది పాటు వారి సంసారం సజావుగా సాగింది. ఆ తరువాత వేరు కాపురం వెళ్దామని భర్తకు చెప్పగా ఆయన ససేమిరా అనడంతో రెండేళ్ల కిందట ఆమె అగిగి పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు భర్త కోరగా పంచాయితీలు జరిగాయి. భర్త, వారి బంధువులు శనివారం కరిగానిపల్లికి వచ్చి శిల్ప తండ్రి రామప్పతో కలసి చర్చించారు. ఎలాగైనా కాపురానికి పంపాలని వారు కోరగా, రామప్ప తన కుమార్తెకు సర్దిచెప్పారు. దీంతో ఆమె భర్త వెంట వెళ్లేందుకు సమ్మతించినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. మృతురాలికి మూడేళ్ల కుమార్తె ఉంది. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కుందుర్పి : మండలంలోని కరిగానిపల్లి గ్రామానికి చెందిన రుద్రన్న(33)అనే వ్యక్తి శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. అతడికి పదేళ్ల క్రితం అప్పిలేపల్లికి చెందిన అనితతో వివాహమైంది. శుక్రవారం అర్ధరాత్రి అప్పిలేపల్లిలో జరిగిన ఆంజనేయస్వామి రథోత్సవం చూసి తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మోటర్‌బైక్‌పై కరిగానిపల్లికి బయలు దేరాడు. మార్గమధ్యంలో చిన్నపాటి దెబ్బలతో సృహ కోల్పోయి ఉండడాన్ని గమనించిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతడు మృతి చెందాడు. అతడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి అన్న తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.