breaking news
janga raghavareddy
-
పొన్నాల వర్సెస్ జంగా!
సాక్షి , వరంగల్ : పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, అతని అనుచరులకు ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామలోని 30 వార్డులకు గానూ పొన్నాల అనుచరులకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన పొన్నాలకు ఈసారి కనీసం బీ ఫాంలు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొన్నాలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డీసీసీ నేత జంగా రాఘవరెడ్డికే బీ ఫాంలు, అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు టీపీసీసీ ఇవ్వగా, జంగా రాఘవరెడ్డి ఒకే కుటుంబానికి రెండు రెండు టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు జనగామలో రోడ్డెక్కారు. చేసేదేం లేక పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పీసీసీ కార్యదర్శులు కంచ రాములు, ధర్మ సంతోష్‌రెడ్డి అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్‌లో బీసీలను అణిచివేశారని ఈ సందర్భంగా వారు ఆరోపణలు చేశారు. పెల్లుబికిన నిరసనలతో పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరిన కాంగ్రెస్ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జంగా రాఘవరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనగామలో స్థానికేతురుడైన రాఘవరెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. -
డీసీసీబీ చైర్మన్ జంగాపై వేటు!
⇔ వరంగల్ డీసీసీబీలో అక్రమాలు ⇔ చైర్మన్ రాఘవరెడ్డిపై సీఎంకు ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు ⇔ ప్రాథమిక విచారణలో అక్రమాల ధ్రువీకరణ.. ⇔ పాలకవర్గంపై వేటుకు సర్కారు మొగ్గు సాక్షి, హైదరాబాద్: అక్రమాల ఆరోపణలు వరంగల్ సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గం రద్దుకు దారి తీస్తున్నాయి. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ సహకార శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. డీసీసీబీలో అక్రమాలు, చైర్మన్ రాఘవరెడ్డి అవినీతిపై అదే జిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సహకార శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా విచారణ పూర్తి చేశారు. మార్చి 22న వరంగల్ డీసీసీబీ కార్యాలయానికి వచ్చి అధికారులు రికార్డులను పరిశీలించారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. విచారణ నివేదికలను సీఎం కార్యాలయానికి, హైదరాబాద్‌లోని నాబార్డు, ఆర్బీఐ అధికారులకు పంపారు. ప్రాథమిక విచారణ నివేదికలో అధికారులు పాలక వర్గాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అక్రమాల్లో భాగస్వాములైన అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా వరంగల్ డీసీసీబీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా సహకార చట్టంలోని 51 సెక్షన్ ప్రకారం కూడా విచారించాలని సహకార శాఖ ఉన్నతాధికారులు సోమవారం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నివేదిక రాగానే... పాలకవర్గాన్ని రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకోనుంది. జంగా రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరో ఐదుగురు ఎమ్మెల్యేలతో కలసి డీసీసీబీలో అక్రమాలపై సీఎంకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల కోసం నాబార్డు కేటాయించిన రూ.50 లక్షల నిధులలో ఒక్క రూపాయి కూడా అన్నదాతలకు ఇవ్వకుండా రాఘవరెడ్డి మొత్తం తన పేరిటే తీసుకున్నారని, అలాగే కుటుంబ సభ్యులకు భారీగా ప్రయోజనం చేకూర్చేలా రుణాలు పొందారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాఘవరెడ్డి ప్రాతినిధ్యం వహించే దర్గా కాజీపేట సొసైటీలో కుటుంబీకులందరి పేరిట పంట రుణాలు, ఇతరుల పేరుతో బినామీ రుణాలు తీసుకున్నారని, మళ్లీ ఇవే భూములపై మార్టిగేజ్ రుణాలు పొందారని పేర్కొన్నారు. ఇలా ఎమ్మెల్యేలు మొత్తం 16 అంశాలపై ఫిర్యాదులు చేశారు.