breaking news
Independent india history
-
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
1975. జూన్ 25. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటిమయమైన అధ్యాయానికి తెర లేచిన రోజు. దేశం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. ఆ నిశిరాత్రి వేళ ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాలు దేశ ప్రజల పాలిట నిత్య కాళరాత్రే అయింది. ఎటుచూసినా దమనకాండ. రాజకీయ ప్రత్యర్థులు మొదలుకుని సామాన్యుల దాకా దేశవ్యాప్త నిర్బంధాలు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులు దేవుడెరుగు, జీవించే హక్కుకే దిక్కు లేని దుస్థితి.పత్రికా స్వేచ్ఛను ఉక్కుపాదంతో తొక్కిపెట్టిన పరిస్థితి! సర్వం సహా అధికారమంతా ఇందిర చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ రూపంలో ఓ రాజ్యాంగేతర శక్తి చేతుల్లో కేంద్రీకృతం! అసలే దుందుడుకుతనానికి మారుపేరు. ఆపై బాధ్యతల్లేని అధికారం. దాని అండతో, సన్నిహిత కోటరీ చెప్పినట్టల్లా ఆడుతూ ఆయన పాల్పడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అనుమానం వచ్చిన వారల్లా జైలుపాలే. చివరికి జనాభాను తగ్గించే చర్యల పేరిట కంటబడ్డ వారికల్లా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేయడం సంజయ్ నియంతృత్వ పోకడలకు పరాకాష్టగా నిలిచింది.మొత్తంగా దేశమే ఓ జైలుగా మారి 21 నెలల పాటు అక్షరాలా హాహాకారాలు చేసింది. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అయింది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి, నియంత పోకడలు పోయేవారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పారు. అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెర లేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా, అందుకు దారి తీసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ అకృత్యాలు, దాని పరిణామాలు తదితరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.....అలా మొదలైందినిజానికి ఎమర్జెన్సీ నాటికి దేశమంతటా నానారకాలుగా అస్థిరత రాజ్యమేలుతోంది. ఇందిరకు వ్యతిరేకంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తదితరుల సారథ్యంలో విపక్షాలు సంఘటితమవుతూ వస్తున్నాయి. అయితే ఎమర్జెన్సీకి పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది మాత్రం ఇందిర ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా వెలువరించిన చరిత్రాత్మక తీర్పే. 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఇందిరపై తలపడి ఓడిన సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిర ఎన్నికల ఏజెంటు యశ్పాల్ కపూర్ ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే ఆమె కోసం పని చేశారని పేర్కొన్నారు.ఈ కేసును కొద్దిరోజులకు అంతా మరచిపోయినా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తాలూకు ఆర్థిక భారం కారణంగా నాలుగేళ్లుగా జనంలో రగులుతున్న అసంతృప్తి ఇందిర సర్కారుపై ఆగ్రహంగా మారుతున్న సందర్భమది. మూడేళ్ల పాటు ఇందిర సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు నానాటికీ బలం పుంజుకోసాగాయి. అలాంటి సమయంలో ఎంపీగా ఇందిర ఎన్నికను కొట్టేస్తూ జస్టిస్ సిన్హా 1975 జూన్ 12న అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించారు. అంతేగాక ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు! దానిపై ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. ఆమెను ప్రధానిగా కొనసాగనిచ్చినా, పార్లమెంటులో ఓటు హక్కులకు మాత్రం కత్తెర వేస్తూ జూన్ 24న సుప్రీం తీర్పునిచ్చింది.ఇది విపక్షాలకు అతి పెద్ద ఆయుధంగా అందివచ్చింది. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి (సంపూర్ణ విప్లవ) నినాదం అప్పటికే దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. చూస్తుండగానే దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటసాగాయి. సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడు జూన్ 25న విపక్షాలన్నీ ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కారు పునాదులనే కదిలించింది.పౌరులు సహాయ నిరాకరణ చేయాలని, పోలీసులు, సైనిక బలగాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాత్మ ప్రబోధానుసారం నడచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పరిస్థితులు చేయి దాటుతున్నాయని భావించిన ఇందిర సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు. ‘అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించా’లంటూ ఆ అర్ధరాత్రే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు సిఫార్సు చేయడం, క్షణాల మీద ఆయన ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.ఏం జరిగింది?⇒ ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్య్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి. ⇒ మీడియాపై కనీవినీ ఎరగని రీతిలో పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగాయి. ⇒ అనుమానం వస్తే చాలు, ఎంతటివారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ⇒ జేపీతో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే ఆడ్వాణీ, మధు దండావతే, నానాజీ దేశ్‌ముఖ్, ప్రకాశ్‌సింగ్ బాదల్, కరుణానిధి, జార్జి ఫెర్నాండెజ్, ప్రకాశ్ కారత్ తదితర విపక్ష నేతలందరినీ నిర్బంధించి జైలుపాలు చేశారు.⇒ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా) వంటి చట్టాలతో ఎవరినైనా కటకటాల్లోకి నెట్టారు. ⇒ ఈ నిర్బంధాలకు గుర్తుగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ సమయంలో పుట్టిన తన కూతురికి మీసా భారతి అని పేరు పెట్టుకోవడం విశేషం! ⇒ న్యాయవ్యవస్థ హక్కులకు కూడా కోత పడింది. విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు కత్తెర వేశారు. ⇒ జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ⇒ సుందరీకరణ పేరుతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని మురికివాడలన్నింటినీ అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేశారు.చివరికేమైంది? ⇒ ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977 జనవరి 20న లోక్‌సభను రద్దు చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారి ఓటమి పాలైంది. ⇒ ఇందిరతో పాటు ఆమె తనయుడు సంజయ్ కూడా ఓటమి చవిచూశారు. ⇒ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా మార్చి 24న జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ⇒ లుకలుకలతో కొద్దికాలానికే కుప్పకూలినా, కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయింది. ⇒ ఎమర్జెన్సీ ఆందోళనల్లోంచే ఫెర్నాండెజ్, కారత్ వంటి కొత్త తరం నాయకులు ఎదిగి వచ్చారు.మీడియాకూ చుక్కలే ⇒ ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిర సర్కారు, ముఖ్యంగా ఆమె తనయుడు సంజయ్ గాంధీ అక్షరాలా ఉక్కుపాదం మోపారు! అందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ మ్యాటర్ పేరుతో చట్టమే తెచ్చారు. ⇒ మాట విననందుకు 200 మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిపై పన్నుల ఎగవేత వంటి పలు అభియోగాలు మోపారు. ⇒ జేపీ ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు కుల్దీప్ నయ్యర్, కె.ఆర్.మల్కానీ వంటి జర్నలిస్టులను జైలుపాలు చేశారు. ⇒ మాట వినని పత్రికలకు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారు. ⇒ చివరికి గాంధీ స్వయంగా స్థాపించిన నవజీవన్ ప్రెస్ తాలూకు ప్రింటింగ్ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు. ⇒ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ), యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ఐ), హిందూస్తాన్ సమాచార్, సమాచార్ భారతి వంటి వార్తా సంస్థలను ‘సమాచార్’ పేరిట బలవంతంగా విలీనం చేసిపారేశారు. ⇒ వార్తా పత్రికలపై నియంత్రణ కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ప్రతి వార్తనూ అక్షరాక్షరం క్షుణ్నంగా చదివి సరేనన్న మీదటే ప్రింటుకు వెళ్లేది. ⇒ ఇన్ని చేసినా కలానికి మాత్రం సంకెళ్లు వేయలేకపోయారు. నియంతృత్వాన్ని నిరసిస్తూ మీడియా గళం విప్పింది. ⇒ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఖాళీ ఎడిటోరియల్ ప్రచురించింది.సినిమాలకూ చీకటి రోజులే!⇒ బాలీవుడ్‌తో పాటు దేశ సినీ పరిశ్రమకు కూడా ఎమర్జెన్సీ చీకటి కాలంగానే మిగిలిపోయింది.⇒ సంజయ్గాందీని ప్రస్తుతించేందుకు నిరాకరించారని బాలీవుడ్ స్టార్ దేవానంద్ సినిమాలను దూరదర్శన్‌లో నిషేధించారు.⇒ ప్రభుత్వ 20 సూత్రాల పథకాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన గాన విభావరిలో పాల్గొనేందుకు ససేమిరా అన్న గాయక దిగ్గజం కిశోర్‌కుమార్ గొంతు ఆలిండియా రేడియోలో విని్పంచకుండా, ఆయన పాటలు దూరదర్శన్‌లో కన్పించకుండా చేశారు.⇒ ఇందిరను పోలిన పాత్రలో సుచిత్రసేన్ జీవించిన ‘ఆం«దీ’, నియంతృత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన ‘కిస్సా కుర్సీ కా’ వంటి సినిమాలను నిషేధించారు. ఇందిర నియంతృత్వాన్ని సినీ పరిశ్రమ ఎదిరించింది. దేవానంద్ ఏకంగా నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేరిట కొత్త పార్టీయే పెట్టారు.⇒ శత్రుఘ్న సిన్హా, ప్రాణ్, డానీ డెంగ్జోంగ్పా వంటి బాలీవుడ్ దిగ్గజాలు పొలిటికల్ స్టార్ బ్రిగేడ్ పేరిట జనతా పార్టీకి మద్దతిచ్చారు. ⇒ విప్లవ ఇతివృత్తంతో పట్టాభిరామారెడ్డి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా చండ మారుతను నిషేధించడమే గాక అందులో నటించిన ఆయన భార్య స్నేహలతారెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. ఏడాదికి పైగా తీవ్ర నిర్బంధంలో గడిపిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పెరోల్‌పై బయటికొచ్చిన ఐదు రోజులకే కన్నుమూశారు.హోం మంత్రికే తెలియదు! దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం మర్నాటిదాకా సాక్షాత్తూ నాటి కేంద్ర హోం మంత్రి ఓం మెహతాకే తెలియదు! ఉదయం పత్రికల్లో చదివి విస్తుపోవాల్సి వచ్చింది. తర్వాత కాసేపటికే కేంద్ర కేబినెట్‌ను సమావేశపరిచిన ఇందిర, ఎమర్జెన్సీ విధింపు గురించి సహచర మంత్రులకు తీరిగ్గా వెల్లడించారు. అనంతరం ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన సర్కారుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో లోతైన కుట్ర జరుగుతున్నందున తనకు మరో దారి లేకపోయిందని చెప్పుకొచ్చారు.ఇది ప్రజాస్వామ్యానికి ఇందిర పాతర వేసిన రోజు – ఎమర్జెన్సీ నిర్ణయంపై లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
27సార్లు అవిశ్వాసాలు.. ఒక్కటీ నెగ్గలేదు
స్వతంత్ర భారత చరిత్రలో లోక్‌సభలో ఇప్పటిదాకా ఏకంగా 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెగ్గలేదు. వాటి కారణంగా ఒక్కసారి కూడా కేంద్రంలో ప్రభుత్వం పడిపోలేదు. అయితే ప్రభుత్వమే కోరి తెచ్చుకునే విశ్వాస పరీక్షల్లో మాత్రం కనీసం మూడుసార్లు ప్రభుత్వాలు పడిపోయినట్టు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన సంస్థ పేర్కొంది. ఇందిరపై అత్యధికంగా 15 ‘అవిశ్వాసాలు’ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రధాని హయాంలో ఇదే అత్యధికం! ► ఇందిరపై తొలి అవిశ్వాసాన్ని 1966లో ఆమె అధికారంలోకి రాగానే కమ్యూనిస్టు దిగ్గజం హీరేంద్రనాథ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. కేవలం 61 మంది ఎంపీలే మద్దతివ్వగా 270 మంది వ్యతిరేకించారు.1966లోనే ఆమెపై రెండో అవిశ్వాసమూ వచి్చంది. తర్వాత 1967, 1968 (రెండుసార్లు), 1969, 1970, 1973, 1974 (రెండుసార్లు), 1975 (రెండుసార్లు–రెండోసారి ఎమర్జెన్సీ విధింపుకు కేవలం నెల రోజుల ముందు), 1976, 1978, 1981 (రెండుసార్లు), 1982ల్లో ఇందిరపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ► 1976లో ఇందిర ప్రభుత్వంపై బీజేపీ (నాటి జనసంఘ్) మేరునగం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రవేశపెట్టడం విశేషం! దానికి ఏకంగా 162 మంది ఎంపీలు మద్దతిచ్చారు! ఒక అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వచి్చన అత్యధిక ఓట్లు ఇవే. 257 మంది వ్యతిరేకంచడంతో తీర్మానం వీగిపోయింది. ఇదీ చరిత్ర... ► స్వతంత్ర భారత చరిత్రలో తొట్టతొలి అ విశ్వాస తీర్మానం 1963లో లోక్‌సభ తలుపు తట్టింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే చెందిన ఆచార్య కృపాలనీ దీన్ని ప్రవేశపెట్టడం విశేషం. 1962లో చైనాతో యుద్ధంలో ఓటడిన వెంటనే కృపాలనీ ఈ చర్యకు దిగారు. దీనిపై ఏకంగా 4 రోజుల పాటు 20 గంటలకు పైగా చర్చ జరిగింది. కేవలం 62 మంది ఎంపీలు మాత్రమే దీన్ని సమరి్థంచారు. 347 మంది వ్యతిరేకించడంతో చివరికి తీర్మానం వీగిపోయింది. ► లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంపై 1964లో ఎన్సీ ఛటర్జీ 1965లో ఎస్.ఎన్.ది్వవేది, స్వతంత్ర పార్టీ ఎంపీ ఎం.ఆర్.మసానీ ప్రవేశపెట్టారు. ► 1979లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రాజీనామాకు దారితీసింది. తీర్మానంపై ఓటింగ్ జరగక చర్చ అసంపూర్తిగా మిగిలిపోయినా ఆయన స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం! ► 2003లో వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్ష నేత హోదాలో నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కేవలం 189 మంది ఎంపీలు మద్దతివ్వగా, 314 మంది వ్యతిరేకించారు. దాంతో 21 గంటల చర్చ అనంతరం తీర్మానం వీగిపోయింది. ► 2018 మోదీ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి 135 మంది ఎంపీలు మద్దతివ్వగా 330 మంది వ్యతిరేకించారు. పీవీపై మూడుసార్లు తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రభుత్వం మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొంది! తొలిసారి 1992లో బీజేపీ ఎంపీ జశ్వంత్‌సింగ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలపై లోక్‌సభ వేదికగా నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం జరిగింది. ఏకంగా 225 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతిచ్చారు. 271 మంది వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయి పీవీ సర్కారు ఊపిరి పీల్చుకుంది! 1992లోనే పీవీ ప్రభుత్వంపై వాజ్‌పేయీ, 1993లో అజయ్ ముఖోపాధ్యాయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాజీవ్ సర్కారుపై మన ఎంపీ మాధవరెడ్డి... ► 1987లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ టీడీపీ ఎంపీ సి.మాధవరెడ్డి కావడం విశేషం! అయితే అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ చీకటి యుగానికి 40 ఏళ్లు
-
ఆ చీకటి యుగానికి 40 ఏళ్లు
⇒ స్వతంత్ర భారత చరిత్రపై చెరగని మచ్చ ⇒ ప్రజాస్వామ్యానికి ఎదురైన ఏకైక తొలి సవాలు అదే బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారత్‌లో.. ఈ ప్రజాస్వామ్యం ఎన్నాళ్లు మనగలుగుతుంది? అన్న ప్రశ్న ఆదిలోనే తలెత్తింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. కానీ.. సువిశాల భారతావనిలోని ప్రజలు.. భిన్న మతాలు, సంస్కృతుల కలయిక కనుక దేశం త్వరగానే ముక్కలతుందని చాలా మంది ‘జోస్యం’ చెప్పారు. కానీ.. ఆ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ ఏడు దశాబ్దాలుగా భారత్ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. భారత్‌తో పాటు స్వాతంత్య్రం పొందిన పొరుగు దేశాలు.. సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనల్లో కూరుకుపోతూ ఉంటే.. భారత్‌లో ప్రజాస్వామ్య పునాదులు రోజురోజుకూ బలపడుతున్నాయి. కానీ.. ఈ 70 ఏళ్ల ప్రజాస్వామ్య పయనంలో భారత్ కూడా ఒక పెను సవాలు ఎదుర్కొంది. ఒక చీకటి అధ్యాయం లిఖితమైంది. సరిగ్గా 40 ఏళ్ల కిందట.. ఈ దేశంలో ‘ఎమర్జెన్సీ’ పేరుతో నియంతృత్వం జూలు విదిల్చింది. ప్రజాస్వామ్య మూల స్తంభాలను నాటి నియంతృత్వ ప్రభుత్వం తన కబంధ హస్తాల్లో బంధించింది. విపక్షాన్ని జైల్లో నెట్టి, పత్రికల గొంతు నొక్కేసింది. శాసనవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని చట్టాలను మార్చేసింది. 21 నెలలుసాగిన ఆ చీకటి యుగంలో.. పౌరుల ప్రాథమిక హక్కులన్నీ రద్దయ్యాయి. వాక్స్వాతంత్య్రమే కాదు.. జీవన స్వాతంత్య్రమూ లేదని నాటి ప్రభుత్వమే చెప్పింది. ఆనాటి నియంతృత్వ ప్రభుత్వం ఏక వ్యక్తి ప్రభుత్వం.. ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఆమె కోటరీ ప్రభుత్వం. ఆ చీకటి యుగం.. 1975 జూన్ 25 అర్ధరాత్రితో మొదలై.. 1977 మార్చి 21 వరకూ కొనసాగింది. ప్రజాస్వామ్యానికి ఎదురైన ఆ పెను సవాలును భారత్ అధిగమించింది. అందుకు కారణం.. ప్రజాస్వామ్య విలువలపై ఈ దేశ ప్రజల అచంచల విశ్వాసం, రాజీలేని పోరు! ఆ ఎమర్జెన్సీ ఆరంభానికి ఈ గురువారానికి 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ తరుణంలో ఎప్పటిలానే ‘ఎమర్జెన్సీ’పై చర్చ మొదలైంది. అలాంటి నియంతృత్వ పాలన ముప్పు ఇంకా తొలగిపోలేదని.. నాడు జైలు నిర్బంధంలో ఉన్న అద్వానీ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల కిందట ‘ఎమర్జెన్సీ’ పూర్వాపరాలపై ‘సాక్షి’ ఫోకస్.. ఎమర్జెన్సీకి కారణాలేమిటి? ఎమర్జెన్సీకి ముందు ఇందిరాగాంధీ చాలా ప్రజాదరణగల నాయకురాలు. 1966లో నాటి ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి మరణించిన తర్వాత.. తొలి భారత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ కుమార్తె అయిన ఇందిరను కాంగ్రెస్ ప్రధానిగా ఎన్నుకుంది. కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్వహించిన ఓటింగ్‌లో మొరార్జీదేశాయ్ను 355 - 169 ఓట్ల తేడాతో ఓడించి.. భారత తొలి మహిళా ప్రధానిగా ఆమె పగ్గాలు చేపట్టారు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పటికీ.. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. మొత్తం 518 సీట్లలో 352 సీట్లు గెలుచుకుంది. 1971లో పాక్‌తో యుద్ధంలో భారత్ గెలవటంతో ఆమె ప్రతిష్ట పెరిగింది. కానీ.. రెండేళ్లు తిరిగేసరికే ఇందిర ప్రతిష్ట మసకబారటం మొదలైంది. ఆమె సర్కారుతో పాటు.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గుజరాత్లో నవ నిర్మాణ్ ఉద్యమం, బిహార్‌లో జయప్రకాష్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’ ఊపందుకున్నాయి. దేశ వ్యాప్తంగా రైల్వే కార్మికులు సమ్మె చేశారు. దీనిపై ఇందిర ప్రభుత్వం కఠినంగా విరుచుకుపడింది. వేలాది మంది ఉద్యోగులను అరెస్ట్ చేసి, వారి కుటుంబాలను క్వార్టర్ల నుంచి గెంటివేసింది. ప్రతిపక్షాల నుంచి ఇందిర సర్కారుపై దాడి ముమ్మరమైంది. పార్లమెంటులో సైతం ఇందిర కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 1966 నుంచి తొమ్మిదేళ్లలో పది అవిశ్వాస తీర్మానాలను ఇందిర ఎదుర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు... ఈ పరిస్థితుల్లో.. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు.. 1971 ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది. ఆ ఎన్నికలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ నిధులను ప్రచారానికి వినియోగించారని.. అదే స్థానంలో ఆమె ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయిణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఇందిర మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని నిషేధం విధించింది. ఈ తీర్పు నేపథ్యంలో ఇందిర ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లతో ప్రతిపక్షాల నుంచి భారీ నిరసనలు వెల్లువెత్తాయి. విపక్షాల నేతలు రాష్ట్రపతిని కలసి.. హైకోర్టు తీర్పుతో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని, ఇందిరను తొలగించాలని కోరారు. కాంగ్రెస్‌లోనూ ఇందిర రాజీనామా కోసం డిమాండ్లు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు... హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తీర్పుపై 1975 జూన్ 24న స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇందిర కొన్ని షరతులకు లోబడి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగవచ్చని అనుమతిచ్చింది. ఒక ఎంపీగా పార్లమెంటు సమావేశాల్లో కానీ, ఓటింగ్‌లో కానీ పాల్గొనరాదని, లోక్‌సభ సభ్యురాలిగా వేతనాలు అందుకోరాదని ఆదేశించింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిర లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించినది అయినందున.. ఈ షరతులు ఆమె ప్రధానమంత్రి హోదాపై ప్రభావం చూపబోవని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాని హోదాలో ఆమె పార్లమెంటు సమావేశాలకు హాజరుకావచ్చునని (ఓటింగ్ హక్కు లేకుండా), ప్రధానిగా ఇతర విధులూ నిర్వర్తించవచ్చని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. జేపీ ‘సహాయ నిరాకరణ’ పిలుపు... అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇందిర రాజీనామా చేసి తప్పుకోవాలంటూ జయప్రకాష్ నారాయణ్(జేపీ) డిమాండ్ చేస్తూ ‘సంపూర్ణ విప్లవం’ పిలుపుతో భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో.. సైన్యం, పోలీసులు, ప్రభుత్వాధికారులు ఇందిర సర్కారుకు ‘సహాయ నిరాకరణ’ చేయాలని, ఆమె ఆదేశాలను పాటించవద్దని, రాజ్యాంగానికి కట్టుబడాలని జేపీ పిలుపునిచ్చారు. ఇందిర రాజీనామా కోసం దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. పత్రికలపై ఆంక్షలు... ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభమైన పత్రి కా రంగం ఇబ్బందుల పాలైంది. పత్రికలు, చానళ్లు, రేడియో ప్రసారాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రచురించే, ప్రసారం చేసే వార్తలు, కథనాలను ప్రభుత్వానికి చూపించి, ఆమోదం పొందాలని షరతులు విధించారు. జేపీ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక మినహా.. ఈ ఆంక్షలను ధిక్కరించే ధైర్యం మరెవరూ చేయలేకపోయారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. సంపాదకీయం స్థానాన్ని ఖాళీగానే ఉంచి ముద్రించింది. సంజయ్ ఆదేశాలను పాటిం చేందుకు తిరస్కరించినందుకు.. అప్పటి కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ఐ.కె.గుజ్రాల్‌ను కూడా ఇందిర తొలగించి.. విద్యాచరణ్శుక్లాను ఆయన స్థానంలో నియమించారు. పౌరులకు హక్కులు లేవు.. కోర్టులు ప్రశ్నించ జాలవు.. ఎమర్జెన్సీ ప్రకటనతోనే దేశంలో పౌరుల ప్రాథమిక హక్కులన్నీ రద్దయ్యాయి. ఎవరినైనా ఎటువంటి ఆరోపణా లేకుండా, ఎటువంటి విచారణా లేకుండా అరెస్ట్ చేసి, నిర్బంధంలో ఉంచే అధికారం ప్రభుత్వానికి దక్కింది. దీంతో.. ప్రభుత్వ వ్యతిరేకులు అనుకున్న వారినందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించటం షరా మామూలుగా మారింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.40 లక్షల మందిని ఎటువంటి విచారణా లేకుండా నిర్బంధించినట్లు అంచనా. ఎమర్జెన్సీలో ఇందిర చట్టాలను యథేచ్ఛగా తిరగరాశారు. తనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హం చేసిన కేసులో అభియోగాల నుంచి విముక్తి లభించే విధంగా.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. తన ఆదేశాలు, ఆర్డినెన్సులను కోర్టులు సమీక్షించకుండే ఉండేలా కొన్ని చట్టాలను సవరించారు. ఎమర్జెన్సీలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను వాయిదా వేశారు. తనను వ్యతిరేకించే ప్రభుత్వాలు ఉన్న గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం 356 అధికరణను వినియోగించి రాష్ట్రపతి పాలనను విధించారు. ఎమర్జెన్సీ ఎత్తివేత.. ఇందిర పరాజయం... ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విక్షాలన్నీ ఉద్యమించాయి. పంజాబ్‌లో సిక్కులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. జనతా పార్టీ, సీపీఎం, ఆర్ఎస్ఎస్ కూడా జైళ్లలో ఉన్న నేతలు, అజ్ఞాతంలో ఉన్న కార్యకర్తల సారథ్యంలో ఉద్యమాలు కొనసాగించాయి. ఈ పరిస్థితుల్లో 21 నెలల పాటు సాగిన చీకటి పాలనకు స్వయంగా ఇందిరే తెరదించారు. అన్ని వర్గాల వ్యతిరేకత, విదేశీ పరిశీలకుల విమర్శలు దీనికి కారణమని భావిస్తున్నారు. పైగా.. ఎన్నికల్లో తాను మళ్లీ గెలుస్తానని ఆమె ధీమాగా ఉన్నారని పరిశీలకులు అంటారు. 1976 ఫిబ్రవరి 4న లోక్‌సభ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించిన ఇందిర సర్కారు.. ఆ మరుసటి ఏడాది జనవరి 18న లోక్‌సభను రద్దు చేసింది. మార్చిలో ఎన్నికలు ప్రకటించింది. అరెస్ట్ చేసిన నాయకులందరినీ విడుదల చేసి మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించింది. 1977 మార్చి నాటి ఎన్నికల్లో.. భారత ప్రజానీకం ఆగ్రహావేశాలను ఇందిర చవిచూశారు. స్వాతంత్య్రానంతరం 30 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తొలిసారి ఘోరంగా ఓడించారు. ఇందిర, సంజయ్ స్వయంగా పరాజయం పాలయ్యారు. జేపీ నేతృత్వంలోని జనతా పార్టీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఒకప్పుడు.. ఇందిర ప్రభుత్వంలోనే ఉప ప్రధానిగా పనిచేసిన మొరార్జీదేశాయ్.. ఎమర్జెన్సీ తర్వాత తొలి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇందిర అరెస్టు.. మళ్లీ గెలుపు... ఈ ‘జనతా’ ప్రభుత్వం.. ఎమర్జెన్సీ అకృత్యాలపై 1977 మే 28న షా కమిషన్‌ను నియమించింది. ఇందిర ఆమె అవసరాల కోసమే ఎమర్జెన్సీ తెచ్చారని షా తప్పుబట్టారు. దీనికి సంబంధించిన ఆరోపణలపై.. జనతా ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చౌదరి చరణ్‌సింగ్.. ఇందిర, సంజయ్‌ల అరెస్టుకు ఆదేశించారు. అయితే.. ఈ అరెస్టులు, ఆపై సుదీర్ఘ విచారణలు.. సమస్యలు పరిష్కరించటంలో జనతా పార్టీ వైఫల్యం కలగలసి.. అనంతర కాలంలో ఇందిరపై ప్రజల్లో సానుభూతి పెరిగేందుకు దోహదపడ్డాయి. ఇందిర తన ప్రసంగాల్లో ‘చేసిన పొరపాట్ల’కు క్షమాపణలు చెప్పటం వంటి పరిణామాలతో.. మూడేళ్లు తిరక్కముందే 1980 ఎన్నికల్లో ఆమె మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఎమర్జెన్సీ విధించటం అంత సులభమా? 1978కి ముందు.. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించటం.. ఇప్పటితో పోలిస్తే సులభమే. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ.. 1978లో రాజ్యాంగ నిబంధనలను సవరించి ఎమర్జెన్సీ విధించటాన్ని మరింత కఠినతరం చేసింది. ఇందిర నాడు ‘అంతర్గత అలజడుల’ ప్రాతిపదికన ఎమర్జెన్సీని విధించారు. కానీ.. జనతా సర్కారు ఆ పదాన్ని ‘సాయుధ తిరుగుబాటు’గా మార్చి మరింత నిర్దిష్టతను ఇచ్చింది. ఇందిర ఎమర్జెన్సీ విధించినప్పుడు.. అందుకు తొలుత రాష్ట్రపతి ఆమోదం పొందారు. ఆ మరుసటి రోజున తన మంత్రివర్గానికి ఆ విషయాన్ని తెలియజేశారు. 1978లో చేసిన సవరణ ప్రకారం.. రాష్ట్రపతి ద్వారా ఎమర్జెన్సీ ప్రకటన చేయటానికి ముందు.. దానికి కేంద్ర మంత్రివర్గం అంగీకారం తప్పనిసరి. 1978 సవరణకు ముందు.. ఎమర్జెన్సీ ప్రకటనకు కానీ, దానిని పొడిగించటానికి కానీ.. పార్లమెంటులో సాధారణ మెజారిటీ ఆమోదం ఉంటే సరిపోతుంది. అంటే.. హాజరైన సభ్యుల్లో ఓటు వేసిన వారిలో సగం మంది కన్నా ఒక్కరు ఎక్కువగా ఆమోదం తెలిపితే సరిపోతుంది. దీనిని సవరించి.. పార్లమెంటు ఆమోదాన్ని కఠినతరం చేశారు. ఎమర్జెన్సీ విధించటానికి కానీ, కొనసాగించటానికి కానీ.. పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ.. అంటే హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో మూడింట రెండు వంతులు.. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో (హాజరుకాని వారితో సహా) కనీసం సగం మంది ఆమోదించాలని మార్చారు. ఆ రాత్రే ఎమర్జెన్సీ.. అరెస్టులు... జూన్ 25 అర్ధరాత్రికి కొన్ని నిమిషాల ముందు.. ఇందిర సిఫారసుతో నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ‘ఎమర్జెన్సీ’ ప్రకటించారు. దేశంలో ‘అంతర్గత అలజడులు’ చెలరేగుతున్నాయంటూ ఎమర్జెన్సీ ఉత్తర్వులు జారీచేశారు. దేశరక్షణ, ప్రజా ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఇందిర సమర్థించుకున్నారు. అయితే.. ఈ నిర్ణయం వెనుక ఆమె కుమారుడు సంజయ్‌గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం ఎస్.ఎస్.రే తదితరుల ప్రోద్బలం ప్రబలంగా ఉందన్న వాదనలు ఉన్నాయి. ఆ రాత్రికి రాత్రే.. ప్రధాన వార్తా పత్రికలన్నిటికీ కరెంటు నిలిపివేశారు. ఇందిరను ప్రశ్నిస్తున్న దాదాపు 100 మంది నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. వీరిలో జేపీ, మొరార్జీ దేశాయ్, ఎల్.కె.అద్వానీ, అటల్ బిహారీ వాజపేయి వంటి నేతలు ఉన్నారు. దాదాపు ప్రతిపక్షమంతా జైల్లోనే అన్న స్థితి ఉండేది. నాలుగు మత, రాజకీయ, విప్లవ పార్టీలన నిషేధించారు. వీటిలో ఆనంద్‌మార్గ్, ఆర్ఎస్ఎస్, జమాత్-ఎ-ఇస్లామీ వం టి సంస్థలున్నా యి. తొలి విడత అరెస్టుల తర్వాత మిగతా నాయకు లు, కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సంజయ్‌గాంధీ అకృత్యాలు.. ఎమర్జెన్సీ ద్వారా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాదు.. అప్పటికే ‘రాజ్యాంగేతర శక్తి’గా పేరుపడ్డ ఆమె తనయుడు సంజయ్‌గాంధీ కూడా అపరిమిత అధికారాలు చలాయించారు. ముఖ్యంగా దేశంలో జనాభా పెరుగుదలను తగ్గించేందు కోసమంటూ కుటుంబ నియంత్రణ పేరుతో.. ఆయన లక్షలాది మందికి నిర్బంధ గర్భనిరోధ శస్త్రచికిత్సలు చేయించారు. ఒరిగిపోగలం కానీ.. మేం తల వంచలేం! సత్యం సంఘర్షణ.. అధికారంతో న్యాయం పోరాటం.. నిరంకుశంతో అంధకారం సవాలు విసిరింది కిరణమే తుది అస్త్రం అవుతుంది! - అటల్ బిహారీ వాజపేయి (ఎమర్జెన్సీ సమయంలో జైల్లో రాసిన కవిత) -
చీకటి అధ్యాయం
స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా అందరూ పరిగణించే ఎమర్జెన్సీ విధించి నేటితో నాలుగు దశాబ్దాలు పూర్తవుతుంది. 1975 జూన్ 25 అర్ధరాత్రి వేళ... అందరూ ఆదమరిచి నిదురిస్తున్నవేళ రాజ్యం హఠాత్తుగా విరుచుకుపడిన సందర్భమది. అప్పుడు దేశమే పెద్ద జైలయింది. 21 నెలలపాటు నిరంకుశత్వమే రాజ్యమేలింది. ప్రశ్నిస్తే సహించలేకపోయారు. ఇదేం అన్యాయమని నిలదీస్తే భరించలేకపోయారు. దేన్నీ వదల్లేదు. ఎవరినీ మినహాయించలేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ వేటాడి, వెంటాడారు. ఇప్పుడే మాట్లాడి పంపిస్తామని నమ్మబలికి ఎందరెందరినో ఆచూకీ దొరక్కుండా పొట్టనబెట్టుకున్నారు. తల్లికి బిడ్డనూ... భార్యకు భర్తనూ...పిల్లలకు తల్లిదండ్రుల్నీ కాకుండాచేశారు. లేకుండా చేశారు. ఆర్తనాదాలన్నీ అరణ్యరోదనలయ్యాయి. ప్రతిపక్షాన్ని ఖైదు చేశారు. న్యాయవ్యవస్థను లొంగదీసుకున్నారు. పత్రికల కుత్తుకలపై ఆంక్షల బయొనెట్ పెట్టి కళ్లతో చూస్తున్నది కాదు...తాము చెప్పిందే రాయాలన్నారు. చెప్పిన మాట వినని పాత్రికేయులను చీకటి కొట్టాల్లోకి నెట్టారు. బహుశా హిట్లర్ కాలంనాటి జర్మనీ అలాంటి దుర్మార్గాన్నీ, దౌష్ట్యాన్నీ చవిచూసి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా చెప్పుకునే భారత్‌కు అలాంటి దురవస్థ వస్తుందని మన జాతీయోద్యమ నాయకులుగానీ, రాజ్యాంగ నిర్మాతలుగానీ కలలో కూడా అనుకుని ఉండరు. అన్ని విలువలకూ మంగళం పాడి... అధికారాన్ని అంటి పెట్టుకుని ఉండటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే దుర్మార్గమైన పాలకులు సమీప భవిష్యత్తులోనే దాపురిస్తారని అంచనావేసి ఉండరు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీయే అలాంటి పనికి పూనుకుంటారని అసలే అనుకుని ఉండరు. అవినీతి పద్ధతులు అవలంబించినందువల్ల లోక్‌సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరేళ్లపాటు పోటీకి అనర్హురాలని అల్హాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో ఇందిర అభద్రతాభావానికి లోనయ్యారు. ఒకపక్క లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజాందోళన రోజురోజుకూ విస్తరించడం...హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వె ళ్తే అక్కడ సైతం బేషరతు స్టే లభించకపోవడంతో గద్దెను అంటిపెట్టుకుని ఉండటానికి ఎమర్జెన్సీ విధింపే పరిష్కారంగా ఆమె భావించారు. లాంఛనప్రాయమైన కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తీసుకోకుండా... ఆంతరంగిక కల్లోల పరిస్థితులవల్ల దేశ భద్రతకు ముప్పుకలిగిందన్న తప్పుడు కారణాలు చూపి ఆనాటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్‌తో ఎమర్జెన్సీ విధింపు ఉత్తర్వులపై సంతకం చేయించారు. ఆ క్షణం నుంచి దేశవ్యాప్తంగా సాగించిన తమ అకృత్యాలు వెల్లడికాకుండా ఉండటం కోసం పత్రికలపై ఆంక్షలు విధించారు. అందుకోసం ఒక ప్రత్యేక చట్టమే తెచ్చారు. న్యాయవ్యవస్థను సైతం అదుపులోనికి తెచ్చుకున్నారు. ‘అంకితభావంతో కూడిన న్యాయవ్యవస్థ’ పేరిట అంతకు చాన్నాళ్లముందే మొదలెట్టిన ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయడం మొదలెట్టారు. ఎమర్జెన్సీలో పౌర హక్కులు సస్పెండైనాయి గనుక పౌరుల ప్రాణానికీ, స్వేచ్ఛకూ పూచీపడే రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు పౌరులు కోల్పోయినట్టేనని వెన్నెముక లేని ‘న్యాయం’ నిస్సిగ్గుగా ప్రకటించింది. బెంచ్‌లోని ఒకే ఒక న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా...‘అయితే రాజ్యానికి పౌరుల ప్రాణాలు తీసే హక్కు కూడా ఉందంటారా’ అని విచారణ సందర్భంగా ప్రశ్నిస్తే ‘అవును...చట్టవిరుద్ధంగా ప్రాణాలు తీసినా కోర్టులేమీ చేయలేవు’ అని ఆనాటి అటార్నీ జనరల్ నిరేన్ డే తలపొగరుతో జవాబిచ్చాడు. నలభైయ్యేళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూస్తే ఆశానిరాశలు రెండూ కలుగుతాయి. అనేక కులాలు, మతాలు, భాషలు, సంప్రదాయాలున్నా ప్రజలంతా ఒక్కటై లాకప్ హింసకూ, చీకటి నిర్బంధానికీ, తుపాకులకూ వెరవకుండా పోరాడిన సందర్భాలు ఎమర్జెన్సీ కాలంలో ఎన్నో కనిపిస్తాయి. రచయితలు, కవులు, కళాకారులు తమకు తోచిన పద్ధతుల్లో నిరంకుశత్వాన్ని ఎదిరించారు. ఎమర్జెన్సీ కాలంలో నిర్బంధాన్ని ఎదుర్కొనని పార్టీగానీ, సంస్థగానీ లేదు. సిద్ధాంతపరంగా ఉత్తర, దక్షిణాలుగా ఉండే జాతీయవాదులు, సీపీఎం నేతలు, విప్లవకారులు... అందరూ జైళ్లకెళ్లారు. ఆ సమయంలో లక్షన్నరమందిపైగా జైలుపాలయ్యారని ఒక అంచనా. సోషలిస్టు సిద్ధాంతాలను ఆచరించే కన్నడ సినీ నటి స్నేహలతారెడ్డి నిర్బంధంలో తీవ్ర అనారోగ్యంపాలై కన్నుమూశారు. అయితే, అలా పోరాడినవారిలో చాలామంది అనంతరకాలంలో పాలకులుగా మారాక తామూ అవే పోకడలనే ప్రదర్శించారు. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. అప్పుడు నియంత, ఆమె మద్దతుదార్లు ఒకపక్కనుంటే...మిగిలినవారంతా వేరొక వైపున్నారు. ఇప్పుడు అన్నిచోట్లా అలాంటివారు విస్తరించారు. సిద్ధాంతాలు, విలువల ప్రమేయం లేకుండా...అధికారమే పరమావధిగా ఏ పార్టీలోకైనా ఎవరైనా వెళ్తున్నారు. ప్రజాస్వామ్యానికి శత్రువు అనేక రూపాల్లో... ఏకకాలంలో అనేకచోట్ల ఉంటున్న వైనం ఇప్పుడు కనబడుతోంది. మీడియాను అదుపులో పెట్టుకునేందుకు పాలకులు సృజనాత్మక విధానాలు అవలంబిస్తున్నారు. సామాజిక మాధ్యమాల గొంతు నులిమే ఐటీ చట్టంలోని సెక్షన్ 66-ఏ చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే దాన్ని మరో రూపంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎవరినైనా, ఎంతకాలమైనా నిర్బంధించేందుకు వీలుకలిగించే నల్లచట్టాలు రూపొందాయి. ఏదేమైనా దేశ చరిత్రలో జాతీయోద్యమం తర్వాత ఆ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన సందర్భం ఎమర్జెన్సీలోనే కనబడుతుంది. అది ఏ తరానికైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడినా ఈ దేశంలో ప్రజాస్వామ్యం చెక్కుచెదరదన్న భరోసానిస్తుంది.