‘గంజాయి’ ముఠా అరెస్ట్
- 410 కేజీల సరకు, ఆటో, బైక్, 7 సెల్ఫోన్లు స్వాధీనం
- చింతపల్లి, పాడేరు ఏజెన్సీల నుండి తరలింపు
- తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు సరఫరా
- ఆరుగురు ముఠా సభ్యుల అరెస్ట్
అల్లిపురం: అక్రమంగా గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాను పెందుర్తి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి సుమారు రూ.4 లక్షల విలువ గల 410 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాజువాక డీసీపీ రాంగోపాల్‌నాయక్ వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి పెందుర్తి రక్ష క్ ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలసి సుజాతనగర్లో ఒక ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిలువ ఉంచిన 410 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో చింతపల్లి మండలం లోతుగెడ్డ గ్రామానికి చెందిన గుల్లెల వినోద్‌కుమార్, రోలుగుంట మండలం వాడిప గ్రామానికి చెందిన ముక్కడపల్లి నాగేశ్వరరావు, వేపగుంట, అప్పలనరసయ్య కాలనీకి చెందిన అబ్దుల్‌బాషా, చింతపల్లి, లోతుగడ్డ ప్రాంతానికి చెందిన గుల్లెల లోవరాజు, తమిళనాడుకు చెందిన సయ్యద్‌ఖాజా, ఒడిశా కటక్ జిల్లా, చౌదా గ్రామానికి చెందిన ఆసిత్ దిబేటాలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు,
కేసు వివరాలు
చింతపల్లి, లోతుగెడ్డ గ్రామానికి చెందిన గుల్లెల వినోద్‌కుమార్, గుల్లెల లోవరాజులు అన్నదమ్ములు. వినోద్‌కుమార్ ఆటో డ్రైవరుగా పెందుర్తిలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను సోదరుడితో కలసి గంజాయిని తన ఆటోలో నగరానికి తీసుకువచ్చి సుజాతనగర్లో శివారు ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని భద్రపరుస్తుంటాడు. ఆటోలో గంజాయి పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిపై స్టీల్ సామాను లోడ్ చేసి నగరానికి తీసుకువస్తుంటారు. పెందుర్తి నుండి గంజాయిని రైళ్ల ద్వారా తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాలో మరికొంతమంది తప్పించుకున్నారని డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఎంత పెద్దవారి ప్రమేయమున్నా వదిలేదిలేదని స్పష్టం చేశారు. సమావేశంలో పెందుర్తి సీఐ, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.