breaking news
health precautions
-
చలివెచ్చని జాగ్రత్తలు
కాలాలన్నింటిలోనూ శీతకాలం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఓవైపు చల్లటిగాలి జివ్వుమనిపిస్తుంటే– స్వెటర్ తొడుక్కుని లేదా శాలువలు కప్పుకుని తిరగడం దగ్గర నుంచి, వెచ్చటి చలిమంటల ముందో, రూమ్ హీటర్ ముందో ఒద్దికగా కూర్చోవడం వరకు, ఇవన్నీ ఆస్వాదించాల్సిన సందర్భాలే! త్వరగా చీకటిపడి, ఆలస్యంగా వెలుతురు రావడం, కాలం వేగంగా పరుగులు తీస్తున్న భావన కలగడం– ఈ సీజన్లో మరో ప్రత్యేకత! నిజానికి చాలామంది కాలాలన్నింటిలోనూ పసందైన కాలం చలికాలమే అంటారు. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు ఎక్కువైనా, తక్కువైనా వాటిని భరించలేం కాని, చలికాలంలో స్వెటర్లు, గ్లౌజులు వేసుకుని చలి గజగజలను ఆస్వాదిస్తూ గమ్మత్తుగా గడిపేయవచ్చు మరి! అయితే శీతకాలంలో చలి మాత్రమే కాదు, వ్యాధులు కూడా వణికించేస్తుంటాయి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వస్తే తగ్గించుకోవడం ఏమంత సులభం కాదు.చలికాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్యాలు ఎంతవరకు అంటువ్యాధులుగా మారతాయి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? వాటి సంగతి ఒకసారి పరిశీలిద్దాం... చలికాలంలో వాతావరణం పొడిగా ఉండటం, అలాగే మనుషులంతా ఇండోర్స్‌లో గుమిగూడటం వలన జలుబు చేసే క్రిములు, ఫ్లూ వైరస్లు, ఇతర శ్వాసకోశ వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపించక ముందు, లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇవి ఇతరులకు సోకే అవకాశముంటుందని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ – క్లీవ్‌లాండ్ క్లినిక్ వెల్లడించింది. సాధారణంగా వ్యాధి సోకిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత ఇతరులకు అంటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆ క్లినిక్ తేల్చింది. ఈ చలికాలంలో సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు, అవి ఎలా వ్యాప్తి చెందుతాయో ఇప్పుడు చూద్దాం!సాధారణ జలుబుఇది అంటువ్యాధి. లక్షణాలు కనిపించకముందే, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు (సుమారు మూడవ రోజు వరకు) ఇతరులకు సులభంగా సోకుతుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాల వరకు వైరస్ ఇతరులకు అంటించే అవకాశవఫ్లూఇది కూడా త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! లక్షణాలు కనిపించకముందే ఇతరులకు అంటుతుంది. లక్షణాలు కనిపించిన తర్వాత ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు సోకే అవకాశముంటుంది.కోవిడ్ 19ఇది చాలా సులభంగా, అలాగే వేగంగా వ్యాపిస్తుంది. లక్షణాలు కనిపించడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు, అలాగే లక్షణాలు మొదలైన తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముంది. తేలికపాటి లక్షణాలున్నవారు ఐదు రోజుల వరకు, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు 20 రోజుల వరకు కూడా ఈ వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశముంది.రెస్పిరేటరీ సిన్సిషీయల్ వైరస్ఇది సాధారణంగా ఆరోగ్యవంతులలో జలుబులా ఉన్నప్పటికీ, శిశువులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారికి ఇది ప్రమాదకరమైన వ్యాధి. లక్షణాలు కనిపించడానికి కొన్ని రోజుల ముందు, ఆ తర్వాత ఎనిమిది రోజుల వరకు ఇది అంటువ్యాధి. అయితే, శిశువులు, రోగనిరోధక శక్తి లేనివారు నాలుగు వారాల వరకు కూడా ఈ వైరస్‌ని వ్యాప్తి చెయ్యగలరు.చెస్ట్ కోల్డ్ (బ్రోంకైటిస్)బ్రోంకైటిస్ అంటువ్యాధి కాదు. ఇది వస్తే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాల వాపు, శ్లేష్మం ఎక్కువ ఉత్పత్తి కావడం, ఛాతీ బిగువుగా, నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే బ్రోంకైటిస్కు కారణమయ్యే జలుబు, ఫ్లూ లేదా ఇతర వైరస్లు మాత్రం అంటువ్యాధులే. వేరొకరి నుంచే వైరస్ వ్యాప్తి చెంది చెస్ట్ కోల్డ్లా మారుతుంది.న్యుమోనియావైరల్ న్యుమోనియా, బ్యాక్టీరియల్ న్యుమోనియా ఇవి రెండూ అంటువ్యాధులే. వైరల్ న్యుమోనియా జ్వరం పూర్తిగా తగ్గేంత వరకు వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియల్ న్యుమోనియా అయితే, యాంటీబయోటిక్స్ తీసుకున్నా, 48 గంటలు తర్వాతే అంటువ్యాధి తీవ్రత తగ్గుతుంది.పింక్ ఐవైరస్ లేదా బ్యాక్టీరియాతో వచ్చే పింక్ ఐ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. వైరల్ పింక్ ఐ లక్షణాలు ఉన్నంత కాలం, ఇంక్యుబేషన్ పీరియడ్‌లో ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. బ్యాక్టీరియల్ పింక్ ఐ యాంటీబయోటిక్స్ తీసుకున్న 24 గంటల వరకు లేదా లక్షణాలు పూర్తిగా తగ్గేంత వరకు అంటువ్యాధిగానే పరిగణిస్తారు.సైనస్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ సైనస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదు. కానీ, సైనస్‌కు కారణమయ్యే జలుబు మాత్రం ఇతరులకు సోకుతుంది. ఇతరుల వల్లే మనకొస్తుంది.స్ట్రెప్ థ్రోట్గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియాతో ఇది వస్తుంది. ఇది తీవ్రంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి! జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత కనీసం 12 గంటల పాటు యాంటీబయోటిక్స్ తీసుకున్న తర్వాతే జనాల్లో తిరగడం ఉత్తమం. అంతవరకు ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది.ఆయుర్వేద చిట్కాలు ఆహార నియమాలుఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.ఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.అల్లం: ఆయుర్వేదంలో దీనిని ‘సార్వజనీన ఔషధం’ అని పిలుస్తారు. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. టీలోను, కూరల్లోను, సూపుల్లోను అల్లం వాడటం మంచిది. అలాగే, అల్పాహారంలో శొంఠి లడ్డూలు, అల్లం చట్నీ తీసుకోవడం కూడా మంచిదిపసుపు: ముఖ్యంగా శీతకాలంలో పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులో వాపును తగ్గించే రసాయనాలు ఉంటాయి. ఇది శరీరానికి, మెదడుకి, గుండెకు చాలా మంచిది. శీతకాలంలో కూరల్లోను, పాలల్లోను పసుపు తరచుగా తీసుకోవచ్చు.జాజికాయ : ఇది శరీరానికి వెచ్చదనాన్నిచ్చే సుగంధ ద్రవ్యం. నిద్ర మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు ఇది బాగా సహాయపడుతుంది. వేడి పాలలోను, మిఠాయిల్లోను, కూరల్లోని మసాలా మిశ్రమాల్లోను జాజికాయ పొడిని వాడుకోవచ్చు. ఉసిరి: చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుంచి ఉసిరి రక్షణనిస్తుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. రోజుకి ఒకటైనా పచ్చి ఉసిరిని నేరుగా తినొచ్చు. తేనె లేదా పంచదారతో కలిపి కూడా తినవచ్చు. ఉసిరిని ఊరగాయలా కూడా తీసుకోవచ్చు.నువ్వులు: నువ్వులలో ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయానికి, గుండెకు రక్షణనిస్తాయి. ఈ చలికాలంలో నువ్వుల లడ్డూలు, నువ్వుల చిక్కీలు తీసుకోవచ్చు. రకరకాల వంటకాలపై నువ్వులపొడిని కలుపుకుని తినడం కూడా మంచిదే!బెల్లం: బెల్లం శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లంతో చిక్కీలు, అరిసెలు, లడ్డూలు చేసుకుని తింటే ఉత్తమం.సజ్జలు– రాగులు : ఈ చిరుధాన్యాలు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడానికి సహాయపడతాయి. వీటితో రొట్టెలు, ఉప్మా, దోసె, అంబలి, లడ్డూలు వంటివి చేసుకోవచ్చు.నెయ్యి: చలికాలంలో నెయ్యి శరీరానికి శక్తిని, చురుకుదనాన్ని ఇస్తుంది. దీనిలో విటమిన్–ఎ, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మానికి కాంతినిస్తుంది. కిచిడీ, పప్పు, పరాఠాలు, హల్వా లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు.మెంతులు–మెంతికూర: ఇవి చలికాలంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకుని తినడం మంచిది. మెంతి ఆకులను పరాఠాలు లేదా కూరల్లో కూడా వాడుకోవచ్చు.గోందు: చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే చక్కటి ఆహారం ఇది. తుమ్మచెట్ల నుంచి సేకరించే జిగురును గోందు కటిర అంటారు. ఇది బరువు నియంత్రణకు, కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి, కాల్షియం పెరగడానికి సహాయపడుతుంది. దీంతో లడ్డూలు కూడా చేసుకుంటారు.బాదం – వాల్నట్లు: చలికాలంలో బాదం, వాల్నట్ వంటి గింజలు తినడం మంచిది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్నట్లలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, బాదంలో విటమిన్– ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి చిరుతిండిగా తినడం లేదా డ్రై ఫ్రూట్ లడ్డూలలో కలిపి తినడం మంచిది.చిలగడ దుంపలు – క్యారట్లు: చలికాలంలో ఈ దుంపలు శరీరానికి వెచ్చదనాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. క్యారట్లలో విటమిన్ ఎ, చిలగడ దుంపలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలను ఎక్కువగా ఉడికించి లేదా కాల్చి తింటారు. వీటిని సూప్‌లలో కూడా వాడుకోవచ్చు. క్యారట్‌ను కూరల్లో ఉపయోగించడంతో పాటు హల్వా రూపంలోను తీసుకుంటారు.ఆకు కూరలు: పాలకూర, తోటకూర వంటివి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఐరన్, కాల్షియం అందించడానికి సహాయపడతాయి. వీటిని పప్పు, పరాఠాలు, సూప్‌ల రూపంలో తీసుకోవడం మంచిది.జామకాయ: జామకాయల్లో విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జామకాయ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చిగా లేదా పండురూపంలో తినొచ్చు.స్టమక్ బగ్ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు సోకే అవకాశముంటుంది. పైగా ఈ వైరస్లు ఉపరితలాలపై వారాల తరబడి జీవించగలవు.ఇలాంటి అంటువ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న అంటువ్యాధులతో పాటు చెవినొప్పి, చలి–జ్వరం, దవడ వాపు వంటివన్నీ చలికాలంలో వచ్చే సాధారణ వ్యాధులే.టాన్సిలైటిస్చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే మరో సమస్య టాన్సిలైటిస్. ఇది అంటువ్యాధి కాదు! గొంతు లోపలి భాగంలో గుండ్రటి కణజాలాలుంటాయి. వాటినే టాన్సిల్స్ అంటారు. బ్యాక్టీరియా లేదా వైరస్ సోకినప్పుడు వీటికి వాపు రావడాన్నే టాన్సిలైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, ఆహారం, నీళ్లు, లాలాజలం కూడా మింగడానికి కష్టంగా ఉంటుంది.ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు)మధ్య వయస్సు లేదా వృద్ధాప్యంలో ఉన్నవారికి శీతకాలపు కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ నొప్పులకు కచ్చితమైన కారణాన్ని వైద్య శాస్త్రం ఇంకా చెప్పలేకపోతోంది. నొప్పి, వాపు, కండరాలు బిగించినట్లుగా అనిపించడం ఇవన్నీ లక్షణాలే! ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ సమస్య కాళ్ళ కీళ్లపై భారం పడేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తుండాలి. బాడీ మొత్తం కప్పి ఉండేలా ఉన్ని దుస్తులు వేసుకోవాలి. ఎందుకంటే తీవ్రమైన చలికి గురికావడం కూడా కీళ్ల నొప్పికి కారణమవుతుంది. పొగతాగే అలవాటు ఉంటే మానేయాలి. సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. ఈ కాలంలో ఆహారం, నీళ్లు, ఇతర వస్తువులను తోటివారితో పంచుకోకపోవడం ఉత్తమం.శీతకాలంలో డీహైడ్రేషన్!సాధారణంగా డీహైడ్రేషన్ అనే మాట మనం వేసవిలో ఎక్కువగా వింటాం. నిజానికి చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా, డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి పండ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చర్మానికి సహజ కాంతిని ఇవ్వడానికి వీటిని తీసుకోవడం ఉత్తమం. దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. చలికాలంలో శరీరానికి శక్తినిస్తుంది. వీటితో పాటు వెచ్చని నీళ్లు లేదా హెర్బల్ టీలను తరచుగా తీసుకోవడంతో శరీరంలో తేమ శాతం నిలకడగా ఉంటుంది.చలికాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి చిట్కాలు⇒ దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతులకు కాకుండా మోచేతి లోపలి భాగానికి అడ్డు పెట్టుకోవాలి.⇒ తలుపు నాబ్స్, కౌంటర్‌టాప్‌ల వంటి తరచుగా తాకే ఉపరితలాలను శుభ్రం చేయాలి.⇒ వ్యక్తిగత వస్తువులను పంచుకోకుండా ఉండాలి.⇒ లక్షణాలు తగ్గేంత వరకు ఇంటికే పరిమితం కావాలి.⇒ తరచుగా సబ్బు, గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోవాలి. ⇒ వైరస్లు– టేబుల్స్, డోర్నాబ్లు, కౌంటర్‌టాప్‌లు, ఆఫీస్ సామాగ్రి వంటి ఉపరితలాలపై కొన్ని గంటలు లేదా రోజులు కూడా జీవించగలవు. ఈ సాధారణంగా తాకే ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడానికి, సురక్షితమైన క్లీనర్లను ఉపయోగించాలి⇒ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తగినంత నిద్ర అవసరం. పెద్దలు రాత్రికి 7–9 గంటలు, పిల్లలు వారి వయస్సును బట్టి ఎక్కువ నిద్ర పోవాలి. నిద్ర లేమి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.⇒ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినడంతో రోగనిరోధక వ్యవస్థను కాపాడుకోవచ్చు. విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.⇒ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో రోగనిరోధక వ్యవస్థ పుంజుకుంటుంది. జలుబు దగ్గు వంటి లక్షణాల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. వారంలో ఎక్కువ రోజులు కనీసం30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ⇒ చేతులతో తరచుగా ముఖం, నోరు తాకకుండా ఉండాలి. గొంతును తేమగా ఉంచడానికి క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. ⇒ వైరస్ లేదా బ్యాక్టీరియా బారిన పడితే రోజుకు రెండుమూడు సార్లు ఉప్పు నీటితో కొన్ని నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ⇒ ఈ సీజన్లో ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగాలి. ఇంటి వాతావరణాన్ని తేమగా ఉంచడానికి ఎయిర్ హ్యూమిడిఫైయర్ గాడ్జెట్ (చర్మం, గొంతు, ముక్కు, పెదవులు పొడిబారకుండా నివారించే పరికరం) ఉపయోగించాలి.ఇక ఈ కాలంలో చర్మం పొడిబారిపోకుండా కళావిహీనంగా మారిపోకుండా ఆలివ్ నూనె, వెన్న, కొబ్బరి నూనె వంటి వాటితో శరీరానికి మర్దన చేసుకున్నాక స్నానం చేయడంతో మంచి ఫలితముంటుంది. ఎక్కువగా క్రీమ్స్, లోషన్స్ వంటి కాస్మెటిక్స్ వాడటం కంటే వంటింటి చిట్కాలను పాటించడమే మేలు. ఆరోగ్యం, ఆహారం, అందం ఈ మూడింటా తగు జాగ్రత్తలు తీసుకుంటే వింటర్‌కి మించి సీజనే ఉండదు. - సంహిత నిమ్మన -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
పారిశుద్ధ్యం మెరుగు మనందరి బాధ్యత
కర్నూలు : ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం మనందరి బాధ్యత అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి వైద్యాధికారులు, సిబ్బందికి చెప్పారు. మంగళవారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో ఆయా విభాగాల ప్రొఫెసర్లు, హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులతో ఆయన సమావేశమయ్యారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, సెక్యూరిటీల విధులపై సమీక్షించారు. శుభ్రతపై రోగులను, వారి కుటుంబీకులను చైతన్యపరచాలన్నారు. బయోవేస్ట్ నిర్వహణను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇన్చార్జి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు, ఏడీ మోహన్‌ప్రసాద్, ఏవో భరత్‌మోహన్ సింగ్‌పాల్గొన్నారు.


