breaking news
Health Minister Dr C. Lakshmareddy
-
నగర శివారుకు సెంట్రల్ జైలు
జైలు ఆవరణలో యూనివర్సిటీ భవనం 70 ఎకరాల విస్తీర్ణంలో ఎంజీఎం ట్విన్ టవర్స్ 2000 పడకలకు విస్తరించనున్న ఎంజీఎం మామునూరుకు తరలనున్న సెంట్రల్ జైలు సాక్షి, హన్మకొండ : నగరం నడిబొడ్డున ఉన్న వరంగల్ కేంద్ర కారాగారం శివారుకు తరలిపోనుంది. సెంట్రల్ జైలు విస్తరించి ఉన్న 70 ఎకరాల స్థలంలో ఎంజీఎం ఆస్పత్రి ట్విన్ టవర్స్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన యూనివర్సిటీకి కేటాయించనున్నారు. ఈ అంశం ఇప్పటి వరకు ప్రతిపాదనలన దశలో ఉండగా బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆర్యోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శాఖాపరమైన వ్యవహారాలపై దృష్టిసారించారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రస్తుతం 70 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇందులో 35 ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ హెల్త్ వర్సిటీకి కేటాయించాలని నిర్ణయించారు. కాళోజీ వర్సిటికి సంబంధించిన పరిపాలన భవన నిర్మాణం, ఇతర సదుపాయాలకు ఈ స్థలాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం రీజనల్ ఆస్పత్రిగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రి స్థాయిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వేయి పడకల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించింది. ఈ రెండు వేల పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఆధునిక హంగులతో ట్విన్ టవర్స్‌గా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు కొనసాగుతాయి. మల్టీ స్పెషాలిటీ విభాగంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పాథాలజీ, ఈఎన్టీ (చెవి,ముక్కు,గొంతు), మైక్రో బయాలజీ, పాథాలజీ, బయోమెడికల్, శస్త్ర చికిత్స విభాగాలు కొనసాగుతాయి. సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, అంకాలజీ(క్యాన్సర్), గ్యాస్ట్రో (జీర్ణకోశ), ఎండ్రోకైనాలజీ, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్ లతో పాటు ఇంటెన్సివ్ కార్డియోథోరియాసిక్ యూనిట్, కార్డియో థోరియాసిక్ సర్జన్ విభాగాలు కొనసాగుతాయి. మాతాశిశు ఆస్పత్రిగా.. అధునాత ఎంజీఎం ఆస్పత్రి ట్విన్ టవర్స్‌లోకి మారితే, ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహె^Œ , మెటర్నల్ చైల్డ్ హెల్త్) గా మారుస్తారు. ఇందులో గైనకాలజీ ( స్త్రీల సంబంధిత ఆరోగ్య సమస్యల విభాగం) పీడియాట్రిక్ (పిల్లలు) విభాగాలు కొనసాగుతాయి. పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ (నవజాత శిశువు) యూనిట్లు ఉంటాయి. అంతేకాకుండా వేర్వేరుగా వంద పడకల సామర్థ్యం కలిగిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం (చందా కాంతాయ్య మెమోరియల్) ఆస్పత్రులను ఎంజీఎం భవనాల్లోకి మారుస్తారు. 500 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఎంజీఎం హాస్పిటల్లో ప్రాంతీయ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి పనిచేస్తుంది. అనంతరం హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రులు జనరల్ ఆస్పత్రులగా మారుతాయి. మామునూరుకు .. నగరం మధ్యలో ఉన్న సెంట్రల్ జైలును మామునూరుకు తరలిస్తారు. నాలుగో పోలీస్ బెటాలియన్ సమీపంలో సెంట్రల్ జైలును ఏర్పాటు చే సేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది జైలు తరలింపు అంశంపై క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. -
మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
శేరిలింగంపల్లి: నగరం నలుమూలలా నాలుగు ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.ల క్ష్మారెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రణామ్ వెల్నెస్ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. ప్రజలకు అవసరమైన విధంగా వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుకు వస్తున్నాయని, అందులో భాగంగానే వెల్నెస్ సెంటర్లు నూతన పంథాలో ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రణామ్ హాస్పిటల్ డాక్టర్ మనీష్ గౌర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాతయాదవ్, కార్పొరేటర్లు కె.సాయిబాబ, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.