breaking news
Gravel smuggling
-
కొండల్ని పిండి.. ఘరానా దోపిడీ
మండపేట : అధికార పార్టీ అండతో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. ఎన్నికల కసరత్తులో అధికారులు బిజీగా ఉండటంతో ఇదే అదునుగా కొండల్ని పిండి చేస్తున్నారు. రాజానగరం, మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుల్ల చేస్తూ, కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలించుకుపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి భారీ యంత్రాలను తెచ్చి మరీ తవ్వకాలు చేస్తుండటం ఇక్కడ జరుగుతున్న ఘరానా దోపిడీకి పరాకాష్ట. ఈ గ్రావెల్‌ను రియల్ ఎస్టేట్ స్థలాలకు తరలించేస్తున్నారు. అనధికార తవ్వకాలతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నా, ప్రభుత్వ భూములు నిరుపయోగంగా మారుతున్నా మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడెక్కడంటే.. : రాజానగరం మండల పరిధిలోని సంపత్‌నగరం, యర్రంపాలెం, తుంగపాడు; మండపేట నియోజకవర్గం ద్వారపూడి, కేశవరం; అనపర్తి నియోజకవర్గం అనపర్తి, రంగంపేట, బిక్కవోలు మండలాల్లో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కేశవరం, ద్వారపూడి గ్రామాల్లో రెవెన్యూకు సుమారు 400 ఎకరాల భూములున్నాయి. ఇరవై పైగా పంచాయతీ చెరువులున్నాయి. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు సుమారు 300 ఎకరాలున్నాయి. సాగు నిమిత్తం పంపిణీ చేసిన ఈ భూములు చాలావరకూ అన్యాక్రాంతమై, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు నిలయంగా మారాయి. సమీపంలోని రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో కూడా వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రోడ్డు పక్కన బెర్ములకు వినియోగించే విలువైన ఎర్రమట్టి, పూస గ్రావెల్ ఈ భూముల్లో లభిస్తోంది. దీంతో ఇక్కడి గ్రావెల్‌కు డిమాండ్ ఎక్కువ. ఐదు యూనిట్ల గ్రావెల్ ధర స్థానికంగానే రూ.4 వేల వరకూ ఉండగా, బయటి ప్రాంతాల్లో మరింత ఎక్కువ రేటు పలుకుతోంది. బరితెగించి.. : ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన రెవెన్యూ అధికారులకు స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం.. ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉండటంతో గ్రావెల్ మాఫియా తాము ఆడింది ఆట పాడింది పాటగా బరితెగించింది. నిర్ణీత స్థలంలో మెరక తొలగించి, సాగుకు అనువుగా చదును చేసేందుకు అనుమతులు తెచ్చుకుని, దాని మాటున కొందరు అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి వేళ అధికారిక స్థలాల్లో తవ్వకాలు చేస్తూ రాత్రి సమయంలో ప్రభుత్వ భూములు, అనుమతులు లేని భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. రాజమహేంద్రవరం, కడియం, రామచంద్రపురం, మండపేట, రాజానగరం, అనపర్తి పరిసర ప్రాంతాల్లో స్థలాలు మెరక చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని, రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలకు తెరలేపుతున్నారు. భారీ పొక్లెయిన్లతో.. : 200 హెచ్‌పీ పొక్లెయిన్ల బకెట్ పరిమాణం తక్కువగా ఉండి, లారీల్లో గ్రావెల్ లోడింగ్‌కు ఎక్కువ సమయం పడుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద బకెట్ పరిమాణం పెద్దగా ఉండే 300 హెచ్‌పీ పొక్లెయిన్లను మట్టి తవ్వకాల కోసం తీసుకువస్తుండటం గమనార్హం. పగటి వేళల్లో వీటిని గుట్టుచప్పుడు కాకుండా తోటల్లో దాచి, రాత్రి వేళల్లో బయటకు తీసి తవ్వకాలకు వినియోగిస్తున్నారు. మరోపక్క లారీలకు నంబర్ ప్లేట్లు తొలగించి మరీ పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు గ్రావెల్ తరలించేస్తున్నారు. తెల్లవార్లూ పెద్ద సంఖ్యలో లారీలు తిరుగుతూనే ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. పెద్ద ఎత్తున సాగుతున్న తవ్వకాలతో ప్రభుత్వ భూములు అగాధాలను తలపిస్తున్నాయి. పారిశ్రామిక జోన్‌కు అడ్డంకిగా.. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ తవ్వకాలు పారిశ్రామికాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి. గతంలో జిల్లాకు మంజూరైన పెట్రో యూనివర్సిటీని తొలుత ద్వారపూడిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు 87 ఎకరాలు అవసరమవుతాయని గుర్తించారు. పరిశీలనకు వచ్చిన కేంద్ర కమిటీ ఈ భూములు వర్సిటీకి అనువుగా లేవని తేల్చింది. చివరకు మన జిల్లాలో ఏర్పాటు కావాల్సిన పెట్రో వర్సిటీ విశాఖ జిల్లాకు తరలిపోయింది. రోడ్డు, జల, ఆకాశ మార్గాన సరుకుల రవాణాలో నైపుణ్యాన్ని పెంచే లాజిస్టిక్ వర్సిటీని 60 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా గతంలో ప్రయత్నాలు జరిగాయి. దీనిపై పరిశీలన కోసం వచ్చిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రతినిధులు మళ్లీ ఆ ఊసే ఎత్తక ఆ ప్రతిపాదన మరుగునపడిపోయింది. స్థానిక మెట్ట రైతుల కోసం కేశవరంలో జీడిపప్పు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మండపేట, రాజానగరం మండలాల్లోని ఆయా గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూముల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు గతంలో ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలు అక్రమ తవ్వకాలతో భూములు అనువుగా లేక కార్యరూపం దాల్చలేదు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పట్టించుకోవడం లేదు. దీంతో తెలుగు తమ్ముళ్లకు అక్రమ తవ్వకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
గ్రావెల్ రవాణాలో ఆర్డీఓ దొంగాట
వవ్వేరు నుంచిగ్రావెల్ రవాణాకు గ్రీన్‌సిగ్నల్ భగ్గుమంటున్న ప్రజలు, నేతలు బుచ్చిరెడ్డిపాళెం: గ్రావెల్ అక్రమ రవాణాలో నెల్లూరు ఆర్డీఓ దొంగాటాడుతున్నారు. మండలంలో గ్రావెల్ రవాణాను నిలిపేయాలని చెప్పిన ఆర్డీఓ గురువారం రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకున్న రెవెన్యూ అధికారులకు వదిలేయాల్సిందిగా సూచించారు. ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర నాయకురాలిని బీజేపీ నాయకులకే సమస్య వచ్చిందా అంటూ ఆర్డీఓ మాట్లాడటం గమనార్హం. మైనింగ్‌కు సంబంధం లేకుండా అనుమతి ఇవ్వడంలో ఆర్డీఓ ప్రత్యేక శ్ర ద్ధ ఏమిటని బీజేపీ నాయకురాలు ప్రశ్నిస్తున్న వైనంపై సాక్షి కథనం. మండలంలోని వవ్వేరు, పెనుబల్లి, రామచంద్రాపు రం నుంచి గ్రావెల్ అక్రమ రవాణా జరగడంపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి కలెక్టర్ స్థాయి వరకు అర్జీలు వెళ్లాయి. ఈ క్రమంలో గ్రావెల్ రవాణా ఆగింది. అయితే ఇటీవల పది రోజుల నుంచి జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాను బుధవారం నిలిపేశారు. ఆర్డీఓ ఆపేయమన్నారని, మండలంలో ఎక్కడా గ్రావెల్ రవాణా జరగదని తెలిపారు. వవ్వేరులో జరుగుతున్న గ్రావెల్ రవాణాను కూడా బుధవారం ఆర్ఐ ఆపారు. రాత్రికి రాత్రే మార్పు.. వవ్వేరులో గురువారం ఉదయం నుంచి గ్రావెల్ రవాణా జరుగుతోంది. దీనిపై సమాచారం అందుకున్న వీఆర్ఓ, తలారి వెళ్లి ఆపారు. అక్కడి నుంచి అక్రమార్కులు నేరుగా ఆర్డీఓకు ఫోన్ చేశారు. దీంతో పట్టుకున్న వాహనాలను వదిలేయాల్సిందిగా ఆర్డీఓ వీఆర్ఓకు సూచించారు. మండలంలో జరుగుతున్న ఎఫ్డీఆర్ పనులకు సంబంధించి గ్రావెల్‌కు అనుమతి ఇచ్చానని చెప్తున్న ఆర్డీఓ తనకు ఇచ్చే అధికారం లేదన్న విషయాన్ని మరిచారు. టీడీపీ నేతలకు దాసోహంగా మారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. వాస్తవానికి గ్రావెల్ రవాణాకు మైనింగ్ అనుమతివ్వాల్సి ఉంది. ఒకవేళ ఎఫ్డీఆర్ పనులకు సంబంధించి సంబంధిత అధికారి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే, అందుకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి. కలెక్టర్ అనుమతి లేకుండా గ్రావెల్ రవాణా చేయడం చట్ట విరుద్ధం. అయితే నిబంధనలను ఉల్లంఘించి ఆర్డీఓ అనుమతి ఇవ్వడం, ఆపేయడం, మళ్లీ రవాణా చేసుకోమని చెప్పడంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాదాయానికి గండి మైనింగ్ శాఖ అనుమతి లేకుం డా జరుగుతున్న గ్రావెల్ రవాణాతో ప్రభుత్వాదాయానికి గం డిపడింది. సీనరేజ్ కట్ చేస్తారని, ప్రభుత్వ పనులే కాబట్టి అనుమతిచ్చామని చెప్తున్న ఆర్డీ ఓ, ఆయా పనుల్లో గ్రావెల్‌ను తరలించినందుకు కాంట్రాక్టర్‌కు నిధులు చెల్లిస్తున్న విషయా న్ని మరిచ్చారు. ఈ విషయమై ఆర్డీఓ వివరణ కోరేందుకు సాక్షి యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.