breaking news
GM technology
-
జీఎం ఆవాలు.. జనానికి సవాలు
మనదేశంలో ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏకైక జన్యుమార్పిడి పంట బీటీ పత్తి. ఇప్పుడు ఆహార పంటల్లోకీ జన్యుమార్పిడి సాంకేతికత విస్తరిస్తోంది. జన్యుమార్పిడి ఆవాల సాగుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జేఈఏసీ) ఇటీవల అనుమతులు ఇవ్వటంతో చాలా ఏళ్ల తర్వాత జీఎం టెక్నాలజీ మళ్లీ చర్చనీయాంశమైంది. చీడపీడలను తట్టుకునే బీటీ జన్యువుతోపాటు కలుపుమందును తట్టుకునేలా కూడా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌టీబీటీ) హైబ్రిడ్ ఆవాల రకం డీఎంహెచ్–11కు జేఈఏసీ పచ్చజెండా ఊపింది. ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వమే.. రసాయన కలుపుమందులను తట్టుకునే జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు తెరవటం విమర్శలకు తావిస్తోంది. సేంద్రియ సాగులో రసాయనాలతోపాటు జన్యుమార్పిడి పంటలూ నిషిద్ధమే. దేశవాళీ విత్తన పరిరక్షణ కృషిలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థ ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ హెచ్‌టీబీటీ ఆవ పంటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘మంచ్’ కన్వీనర్ జాకబ్ నెల్లితానంతో ‘సాక్షి’తో చెప్పిన ముఖ్యాంశాలు.. కేంద్రం చెబుతున్నట్లు దేశంలో ఆవాల దిగుబడి పెంచటం కోసమే అయితే కలుపుమందును తట్టుకునే హైబ్రిడ్ బీటీ ఆవ వంగడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. జన్యుమార్పిడి ఆవ రకం హెక్టారుకు 30–32 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మన రైతుల దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు.. ‘గోబి సార్సమ్ మస్టర్డ్’ రకం. ఇది సేంద్రియ సేద్యంలో హెక్టారుకు 40 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ప్రభుత్వం దిగుబడులు పెంచాలనుకుంటే ఇటువంటి వంగడాలను పోత్సహించుకోవచ్చు కదా? ఆహార పంటల్లో కూడా జన్యుమార్పిడి సాంకేతికతను ప్రవేశపెట్టడమే ప్రభుత్వ ఉద్దేశం. జన్యుమార్పిడి ఆవ పంట కావాలని రైతులు అడగలేదు. ప్రజలు స్పందించి ఉద్యమించి అడ్డుకోకపోతే మరిన్ని ఆహార పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతులిచ్చే ముప్పు పొంచి ఉంది. రైతులకు ఉండే సంప్రదాయ విత్తనాల హక్కులను జన్యుమార్పిడి విత్తనాలు ధ్వంసం చేస్తాయి. వీటిని కార్పొరేట్ కంపెనీల లాభాపేక్ష కోసమే జన్యుమార్పిడి చేసి, విత్తనాలను కంపెనీల ఆస్తిగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుంటోంది. అదీగాక జన్యుమార్పిడి విత్తనాల వల్ల సంప్రదాయ పంటల స్వచ్ఛత దెబ్బతింటుంది. జన్యుకాలుష్యం జరిగితే తర్వాత మళ్లీ పాత స్థితికి తేవటం సాధ్యం కాదు. అందుకే జన్యుమార్పిడి పంటలను మేం వ్యతిరేకిస్తున్నాం. –సాక్షి, సాగుబడి -
మన అన్నదాతే దేశానికి ఆదర్శం
తెలుగునాట రైతులు అనుసరిస్తున్న సాగు విధానాన్ని ప్రధాని మన్మోహన్ దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? ఒక రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలలో రైతులు సాధించిన మహత్తర కార్యాన్ని దేశవ్యాప్తంగా రైతులు 3.5 కోట్ల ఎకరాలలో ఎందుకు సాధించలేరు? ప్రధాని మన్మోహన్ సింగ్ కందిరీగ తుట్టెను కది పారు. జన్యుమార్పిడి పం టలపై నెలకొన్న ‘అశాస్త్రీయ’ అభిప్రాయాలను పట్టించుకోవద్దంటూ ఆయన ఇటీవల సలహా ఇచ్చారు. వ్యవసాయోత్పత్తిని పెంచేందుకు బయోటెక్నాలజీ ఎంతగానో ఉపకరిస్తుందనీ, తమ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధిలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తుందని ప్రకటించారు. ఎంతో ప్రమాదకరమైన జీఎం టెక్నాలజీని ప్రధాని సమర్థించిన మర్నాడే మోన్శాంటో షేరు 5.45 శాతం పెరిగింది. కాబట్టి ఈ వ్యవహారంలో ఆయా కంపెనీలకు భారీ ప్రయోజనాలున్నాయి. జీఎం పంటలకు భారత్ అనుమతి నిరాకరిస్తే అది కోట్లాది డాలర్ల పరిశ్రమలకు చావుదెబ్బ అవుతుంది. జీఎం పంటల క్షేత్ర పరీక్షలకు ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించడం, వ్యవసాయంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా వ్యతిరేకించడంతో పరిశ్రమ తెరవెనుక మార్గాల ద్వారా ఒత్తిళ్లను మరింతగా పెంచింది. ఇప్పుడు జీఎం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దిగుబడులను ఇబ్బడిముబ్బడిగా పెంచవచ్చని ప్రధాని అంటున్నారు. పరిశ్రమ కూడా అదే మాట చెపుతోంది. అయితే అమెరికాలో 20 ఏళ్ల క్రితం తొలిసారిగా జీఎం పంటను ప్రవేశపెట్టినప్పటికీ దిగుబడిని పెం చిన దాఖలా లేదు. 2050 నాటికి పెరగనున్న ప్రపంచ జనాభా ఆహార అవసరాలకు సరిపడా ఆహారధాన్యాలు కావాలంటే ఉత్పత్తిని భారీగా పెంచాల్సి ఉంటుందని, కాబట్టి జీఎం పంటల ద్వారానే ఇది సాధ్యపడుతుందని చేసే వాదన వాస్తవం కాదు. దీంట్లో అసలు నిజం ఏమిటో చూద్దాం. ప్రపంచ దేశాలలోని జనాభాకు ఆహార కొరత ఉందా? ప్రపంచ దేశాలలో మొత్తం 1,400 కోట్ల మందికి సరిపోయే ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని 2013లో యూఎస్డీఏ అంచనా వేసింది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న జనాభాకు రెట్టింపు మందికి సరిపోయే స్థాయిలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. అసలు సమస్య ఆహార కొరత కాదు, ఆహార వృథా. ఉత్పత్తి అయిన ఆహారంలో దాదాపు 40 శాతం దాకా వృథా అవుతోంది. ఇండియాలో రోజూ 25 కోట్ల మంది అర్ధాకలితో పస్తులుంటున్నారు. వీరు ఈ దుర్భర పరిస్థితులు ఎదుర్కొనడానికి కారణం ఆహారధాన్యాల ఉత్పత్తిలో కొరత కానేకాదు! గత ఏడాది జూన్‌లో మన దేశంలోని గిడ్డంగులలో రికార్డుస్థాయిలో 82.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నాయి. దీనిలో మనదేశం 20 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది, మరో 20 మిలియన్ టన్నులు కూడా ఎగుమతి చేసే ఆలోచనలో ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి బదులు ఆహార ధాన్యాల సేకరణను తగ్గించేందుకు, ఎఫ్‌సీఐ గిడ్డంగులలో ఉన్న భారీ సరుకు నిల్వలను కమోడిటీ ట్రేడింగ్‌కు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. చైనాలో పంటలను ఆశించే చీడపీడలను నిర్మూలించేందుకు అక్కడి రైతులు 20 రెట్లు అధికంగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. మన దేశంలో కూడా ఇదే పరిస్థితి. ఇండియాలో కూడా క్రిమిసంహారక మందుల వాడకం బాగా పెరిగింది. జీఎం పంటల ద్వారా దిగుబడి పెరగనప్పుడు, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గనప్పుడు, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి భరోసా లేనప్పుడు ప్రధాని మన్మోహన్ జీఎం టెక్నాలజీని ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం కాదు. జీఎం పైర్లతో నేలలన్నీ విషతుల్యం కావడమే కాకుండా, భూగర్భజలాలను తోడేస్తున్నారు. రసాయన, క్రిమిసంహారక మందుల వాడకంతో ఆహారధాన్యాలు కల్తీ అవుతున్నాయి. దీని పర్యవసానంగానే ఇప్పుడు రైతులంతా పర్యావరణం దెబ్బతినని వ్యవసాయ పద్ధతులపై దృష్టిపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకుండా 35 లక్షల ఎకరాలలో రైతులు సాగుచేస్తున్నారు. దీనిలో 20 లక్షల ఎకరాలలో రైతులు ఎరువులను కూడా వాడడం లేదు. ఉత్పత్తితోపాటు భూసారం కూడా పెరుగుతోంది. కాలుష్యం తగ్గుతోంది. రైతుల ఆదాయాలు పెరుగుతున్నందున వారు బలవన్మరణాలకు పాల్పడాల్సిన పరిస్థితులు లేవు. ఆంధ్రప్రదేశ్ రైతులు అనుసరిస్తున్న సాగు విధానాన్ని ప్రధాని మన్మోహన్ దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? ఒక రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలలో రైతులు సాధించిన మహత్తర కార్యాన్ని దేశవ్యాప్తంగా రైతులు 3.5 కోట్ల ఎకరాలలో ఎందుకు సాధించలేరు? ఇతర రాష్ట్రాల రైతులు ఆంధ్రప్రదేశ్ రైతుల మార్గాన్ని అనుసరిస్తేనే వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుంది. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు) - దేవిందర్ శర్మ