breaking news
gangrape accused
-
‘అఖిలేశ్.. నీ కేబినెట్లో రేప్ మంత్రి ఎందుకు?’
లక్నో: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్లో ఎందుకని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ లేఖ రాశారు.ఇప్పటికీ ఆయనను ఎందుకు కేబినెట్లో కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తూ వివరణ కోరారు. దీనికి సంబంధించి వివరణ కోరుతూ ఆయన అఖిలేశ్ కు లేఖ పంపించినట్లు కూడా రాజ్‌భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. లైంగిక దాడి కేసులో గాయత్రి ప్రజాపతిపై అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన తప్పించుకు తిరుగుతుండటంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. ఆయన పాస్‌పోర్టును నాలుగువారాలపాటు సీజ్ చేయడంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా అంటించారు. ఈ నేపథ్యంలో ఇంకా కేబినెట్లో కొనసాగించడంపై గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ విషయంలో పలుమార్లు అఖిలేశ్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కేసు నమోదు చేయించినా ఆ వ్యక్తి కోసం అఖిలేశ్ ప్రచారానికి వెళుతున్నారని ఎద్దేవా చేశారు. మరోపక్క, యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా గవర్నర్ నోటీసుల నేపథ్యంలో స్పందించారు. తనకు ప్రియమైన గాయత్రిని అరెస్టు చేయలేకపోయినా కనీసం తన కేబినెట్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
బీపీఎల్ కార్డుహోల్డర్‌గా, మంత్రిగా.. నేడు రేపిస్టుగా
లక్నో: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత, మంత్రి గాయత్రి ప్రజాపతి గురించి పలు విస్మయకరమైన విషయాలు వెలుగుచూశాయి. అసలు ఎవరు ఈ గాయత్రి, గతంలో ఏం చేసేవాడు? మంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు? మంత్రిగా ఉండి కూడా అత్యాచారం చేసే దుస్సాహసం ఎలా చేయగలిగాడనే తదితర అంశాలపై పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఓ మహిళపై రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఆమె కూతురుని కూడా చెరిచే ప్రయత్నం చేసిన గాయత్రి, ఆయన సహచరులు ప్రస్తుతం కేసును ఎదుర్కొంటున్నాడు. పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఇతడి కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కావడంతో దానిపై స్టే తీసుకునేందుకు అతడి తరుపు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గాయత్రి ప్రసాద్ గురించి కొన్ని విషయాలు పరిశీలిస్తే.. 2012 వరకు బీపీఎల్ కార్డు హోల్డర్‌గా.. గత ఐదేళ్లలో గాయత్రి ప్రజాపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి దాదాపు తన చుట్టూ సునామీలాంటి వాతావరణం సృష్టించాడు. 2012 వరకు కూడా అతడు బీపీఎల్ కార్డు హోల్డర్. దాదాపు నాలుగుసార్లు విఫలమయ్యి 2012లో తొలిసారి విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అమితా సింగ్‌ను ఓడించాక అతడికి మరింత పేరొచ్చింది. దాంతో నేరుగా అతడికి సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం, శివపాల్ యాదవ్‌తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తొలుత అఖిలేశ్ మంత్రి వర్గంలోకి స్వతంత్ర శాఖ నిర్వహిస్తూ అనతి కాలంలోనే మైనింగ్ మంత్రిగా మారాడు. ఆ వెంటనే కేబినెట్ ర్యాంకు కూడా అతడి వచ్చింది. దాంతో మైనింగ్ శాఖ ఇంఛార్జ్ మంత్రిగా కొనసాగాడు. నేరాలు ఒక్కొక్కటిగా బయటకు.. గాయత్రి నేరాలకు పాల్పడుతున్నాడని, తన శాఖలో అక్రమాలకు దిగాడని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నూతన్ ఠాకుర్ 2015 జనవరిలో లోకాయుక్తను ఆశ్రయించారు. ఆ తర్వాత అతడికి వ్యతిరేకంగా డాక్యుమెంటరీ ప్రూప్స్ కూడా అతడు అక్రమంగా కోట్లు వెనుకేశాడని బయటపడ్డాయి. అమితాబ్ ఠాకూర్ అనే ఐపీఎస్ అధికారి కూడా గాయత్రి ప్రజాపతిపై ఫిర్యాదుల పరంపర సాగించారు. ఈ విషయంలో ములాయం జోక్యం చేసుకొని ఆ ఐపీఎస్‌ను నిలదీసి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఓ పక్క లోకాయుక్త అతడికి అక్రమాస్తుల కేసులో క్లీన్ చిట్ ఇవ్వగా అలహాబాద్ హైకోర్టు మాత్రం మైనింగ్ అక్రమాలపై విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో అఖిలేశ్ ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాడు. ఇప్పటికీ అతడిపై సీబీఐ విచారణ సాగుతునే ఉంది. ఇప్పుడు గ్యాంగ్ రేప్ కేసు.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండగా గాయత్రి ప్రజాపతిపై ఓ అత్యాచారం ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకుముందు బాధితులు పోలీస్ మెట్లెక్కినా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు జోక్యం చేసుకొని అతడిపై మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2014 అక్టోబర్ నెలలో తొలిసారి లైంగికదాడి చేయడం ప్రారంభించిన ప్రజాపతి జూలై 2016వరకు పలుమార్లు బెదిరిస్తూ అదే దుశ్చర్య చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆమె కూతురుపై కూడా అలాంటి దుర్మార్గం చేసే ప్రయత్నం చేశాడు. దీనిపైనే గత నెల(ఫిబ్రవరి) 18న కేసు నమోదు కాగా ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు.