breaking news
Future Goals
-
సంసారం.. ఆర్ధిక చదరంగం!
హైదరాబాద్‌కు చెందిన మనీషా (30) పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే భర్తతో ఆమెకు వాదోపవాదాలు నిత్య కృత్యంగా మారాయి. అది కూడా ఆర్ధిక అంశాలపైనే. పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే మనీషా దంపతులు ఒకరికొకరు పరిచయస్థులు. ఎన్నో అంశాలపై గంటల తరబడి మాట్లాడుకున్న వారే. ‘‘అతడి గురించి నాకు అంతా తెలుసనుకున్నా. కానీ, ఆర్థిక అంశాల నిర్వహణ గురించి ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు. అక్కడే మేము తప్పటడుగు వేశామని అనిపిస్తోంది’’ అన్నది మనీషా అంతరంగం. వైవాహిక బంధం చిరకాలం వర్ధిల్లాలంటే దంపతుల మధ్య చక్కని అవగాహన, పరస్పర గౌరవం, అభిమానం ఉంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ, ఆర్థిక అవగాహన కూడా ఉండాలన్నది నిపుణుల సూచన. తమకు ఏ ఆహారం అంటే ఇష్టం, తమకు నచ్చే సినిమాలు, మెచ్చే పర్యాటక ప్రాంతాలు.. ఇలా మూడు ముళ్లకు ముందే ముచ్చట్లు ఎన్నో చెప్పుకోవడం, పరస్పర ఇష్టాలు పంచుకోవడం చేస్తుంటారు. కానీ, ఆర్థిక అంశాలు, భవిష్యత్ ఆర్ధిక లక్ష్యాల గురించి చర్చించుకునే వారు బహుశా చాలా తక్కువగా ఉంటారు. ఇలా చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో మనీషా ఉదంతం చెబుతోంది. అందుకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే భవిష్యత్ ఆర్ధిక పథంపై మనసు విప్పి చర్చించుకోవడం ఎంతో అవసరం. దీని ప్రాధాన్యతను తెలియజెప్పే కథనమే ఇది... మారుతున్న పరిస్థితులు.. ఆర్ధిక విభేదాలు వైవాహిక బంధంలో చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికంగా అప్పుల పాలై, బయట పడే మార్గం తోచక సామూహిక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘జిమెనెజ్ లా ఫర్మ్’ చేసిన అధ్యయనంలో.. ఆ దేశంలో 29% విడాకులకు ఆర్ధిక విభేదాలే కారణం అవుతున్నట్టు తెలిసింది. అమెరికా స్థాయిలో ప్రస్తుతం మన దేశంలో బంధాల విచ్ఛిన్నానికి ఆర్ధిక అంశాలు కారణం కాకపోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలోనూ మహిళల ఆర్ధిక సాధికారత మెరుగుపడుతూ వస్తోంది. పెళ్లయిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగేందుకు యువతరం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో వారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదు. కనుక ఆర్ధిక అంశాలపైనా దంపతుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అంగీకారాలు ముఖ్యమే. చర్చించుకోవడమే మెరుగైన మార్గం వివాహం తర్వాత ఆర్ధిక విభేదాలు పొడచూపకూడదని అనుకుంటే, అందుకు ఎలాంటి జంకు లేకుండా ‘మనీ’ గురించి సౌకర్యంగా మాట్లాడుకోవడమే మంచి పరిష్కారం. ‘‘దంపతుల్లో చాలా మంది ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుకోవడానికి సంకోచిస్తుంటారు. డబ్బు మనిషనో లేదా ఆధిపత్యం చెలాయిస్తున్నారనో పొరపడతారన్నది వారి ఆందోళన. కానీ విడాకులకు ఆర్ధిక అంశాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. కనుక ఈ అంశాలపై చర్చించుకోవడం ఎంతో ముఖ్యం’’ అని ఫిన్‌సేఫ్ ఎండీ మృణ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆర్ధిక నిర్ణయాలను అప్పటి వరకు కలిగి ఉన్న ఆర్ధిక అవగాహనే నిర్ణయిస్తుంది. తమ నిర్ణయాలను గౌరవించే, ఏకీభవించే భాగస్వామిని గుర్తించడం వైవాహిక బంధం విజయవంతానికి కీలకమని నిపుణుల సూచన. విల్లా, కారు తదితర ఆకాంక్షలు ఏవైనా ఉన్నాయా? ఎప్పటిలోపు వాటిని సాధించాలని అనుకుంటున్నారు? వివాహం తర్వాత తొలి ప్రాధాన్యం ఏ లక్ష్యానికి? వినోదం, విహారానికి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్నారా? డబ్బు విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నారా? చక్కదిద్దుకోవాల్సిన ఆర్ధిక ప్రతికూలతలు ఏవైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నింటిపై స్పష్టత అవసరం. ‘‘ఆర్థిక అలవాట్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఒకరు ఎంతో పొదుపరి అయి ఉంటారు. మరొకరు ఖర్చు చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది వివాదానికి దారితీస్తుంది. కొన్ని విభేదాలను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. కానీ, కొన్ని ఓ పట్టాన పరిష్కారం కావు. అందుకని ఒకరినొకరు ఆర్థిక అంశాలపై చర్చించుకొని, నిర్ణయాలను ఉమ్మడిగా తీసుకోవాలి’’ అని ఆనంద్ రాఠి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ సూచించారు.ప్రణాళిక ప్రకారం దంపతుల మధ్య వచ్చే కలతలకు ఎవరో ఒకరు అధికంగా ఖర్చు చేయడం ప్రధాన కారణం. ఒకరు ఎంతో పొదుపుగా రూపాయి, రూపాయి కూడబెడుతుంటే, మరొకరు ఖర్చు చేయడాన్ని ఆనందిస్తుంటే వారి మధ్య ప్రశాంతత కష్టం. విభేదాలు రాక మానవు. ఖర్చు చేసే అలవాట్లు అన్నవి ఒకరి మానసిక తీరుపైనే ఆధారపడి ఉంటాయి. కొందరు షాపింగ్‌లో ఆనందాన్ని వెతుక్కుంటారు. సంపదతో గౌరవం వస్తుందని భావిస్తుంటారు. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోయినా గొప్ప కోసం ఖరీదైన ఉత్పత్తులు కొనుగోలుకు మొగ్గు చూపిస్తుంటారు. ఒక భాగస్వామి పొదుపు, మదుపు (పెట్టుబడి)కు ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. ఆర్ధిక వెసులుబాటు పరిమితంగా ఉండడం ఇందుకు నేపథ్యం కావొచ్చు. అందుకే ఆర్ధిక భద్రత దృష్ట్యా పొదుపు చేస్తుండొచ్చు. దీనికి విరుద్ధమైన ధోరణి కలిగిన భాగస్వామి తోడైనప్పుడు అది స్పర్థకు దారితీస్తుంది. ‘‘భాగస్వాములు ఇద్దరూ స్వేచ్ఛను గౌరవించుకోవాలి. అదే సమయంలో చర్చించుకుని, పరస్పర అంగీకారానికి వచ్చే పరిణతి కూడా అవసరం’’ అనేది జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా సూచన. ఏ తరహా ఆర్ధిక వ్యక్తిత్వాన్ని మీరు నచ్చుతారన్న స్పష్టత ఉండాలి. అప్పుడు కాబోయే జీవిత భాగస్వామితో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించుకోవాలి. ఆర్ధిక అంశాల నిర్వహణపై మాట్లాడుకోవాలి. బడ్జెట్ ఏర్పాటు, ఆర్ధిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటికి కట్టుబడి ఉండేలా అంగీకారానికి రావాలి. కేవలం పొదుపు అనే కాదు, జీవనశైలి అలవాట్లు, ఆనందాల కోసం భాగస్వాములు ఇద్దరూ ఆదాయంలో 10% బడ్జెట్ కేటాయించుకోవడంలో తప్పు లేదన్నది నిపుణుల సూచన. కేటాయింపులు అన్నీ పోను మిగులు ఉంటే, ఆ మొత్తాన్ని తమ అభిరుచుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఆధిపత్యం పనికిరాదు.. మనీ విషయాల్లో ఆధిపత్య ధోరణి పనికిరాదు. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్నింటినీ తానే తీసుకోవాలన్న ధోరణి సరికాదు. ఈ విషయాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ‘‘ఆర్ధిక అంశాల నిర్వహణ గురించి తనకు ఎంత మాత్రం తెలియదన్నది నా భర్త సమాధానం. కానీ, ఖర్చుల గురించి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా.. ఆయన కొట్టిపారేస్తుంటారు’’ అని ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ నిపుణురాలు అంజలి వర్మ వాపోయారు. కేవలం పురుషులే ఆర్జనా పరులుగా ఉన్న కుటుంబాల్లో ఈ తరహా ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భార్య విద్యావంతురాలై, గృహిణిగా కొనసాగుతున్నా, ఆమెకు ఆర్ధిక అంశాలపై అవగాహన ఉన్నా కానీ, కుటుంబ నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం కలి్పంచే తీరు అన్ని చోట్లా కనిపించదు. రాణించే మహిళలు ఉన్న చోట పురుషులు అభద్రతా భావానికి లోనవుతుంటారని, అది కలహాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆర్ధిక అంశాల్లో తమ భాగస్వామ్యం ఏ మేరకు అన్న దానిపై పెళ్లికి ముందే యువతీ, యువకులు తప్పకుండా ప్రశి్నంచుకోవాలని సూచిస్తున్నారు. ఆర్ధిక బాధ్యతలను ఎలా పంచుకుంటారని కూడా ప్రశ్నించుకోవాలి. ఇరువురి మధ్య సరైన అవగాహన కుదిరినప్పుడే ఏడడుగులు వేయడం సరైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడుల ఎంపికలు పెట్టుబడుల విషయంలోనూ దంపతుల మధ్య అవగాహన, పరస్పర అంగీకారం అవసరమే. ఒకరు అధికంగా రిస్క్ తీసుకుంటే, మరొకరు పరిమిత రిస్క్ ఉన్న పెట్టుబడులకే పరిమితం కావొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇద్దరూ భిన్న మార్గాలను అనుసరించడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. దీనివల్ల మెరుగైన రాబడులకు, రక్షణ తోడవుతుంది. ఒక విధంగా ఇది ఈక్విటీ, డెట్ కలయికగా భావించొచ్చు. అయితే ఆయా అంశాలపై కాబోయే దంపతులు ఇద్దరూ చర్చించుకోవాలి. ఏఏ సాధనాలు ఎలా పనిచేస్తాయి, అందులో ఉండే రిస్‌్కలు, వచ్చే రాబడుల గురించి పూ ర్తి అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలకు అవరోధాలు ఏర్పడొచ్చు. అవసరం అనుకుంటే ఈ విషయంలో ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవాలి.గోప్యత ప్రమాదకరం రుణాలు తీసుకోవడం, అప్పులతో కొనుగోళ్లు చేసే విషయాలను జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని సందర్భాల్లో దాచి పెడుతుంటారు. ఇది విశ్వాసలేమికి దారితీస్తుంది. ఇదే మాదిరి ఎన్నో విషయాలు తనకు తెలియకుండా చేస్తుండొచ్చని భాగస్వామి సందేహించడానికి అవకాశం కలి్పస్తుంది. అందుకే ఇలాంటివి భాగస్వామికి చెప్పి చేయాలి.ధన సాయం తమ బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల్లో ఎవరికైనా ఆర్ధిక సాయం చేసే ముందు, తమ ఆర్థిక అవసరాలకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతరులకు సాయం చేయడానికి ముందు తమ ఆర్ధిక భవిష్యత్‌కు భరోసా కలి్పంచుకోవడం అవసరమని జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా పేర్కొన్నారు. డబ్బు సాయం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే? పరిస్థితి ఏంటన్నది ప్రశి్నంచుకోవాలి. మరీ ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా ఇలాంటి ధన సాయాలు చేస్తే, అవి కాపురంలో కలహాలకు దారితీసే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. రుణ భారం తమకు కావాల్సిన ప్రతిదీ ఈఎంఐపై సమకూర్చుకోవడం కొందరికి అలవాటు. ఇందుకోసం క్రెడిట్‌కార్డు రుణాలనూ వాడేస్తుంటారు. అధిక వడ్డీలతో కూడిన రుణాలు ఊబిలోకి నెట్టేస్తాయి. ఆర్ధిక సమస్యలు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ తరహా అలవాట్ల గురించి పెళ్లికి ముందే కాబోయే భాగస్వామికి చెప్పడం ఎంతో అవసరం. ఆదాయం, వ్యయాలు, పెట్టుబడుల ప్రణాళికలు, ఖర్చు చేసే అలవాట్లు, రుణాలు తదితర అంశాల గురించి సమగ్రంగా చర్చించుకోవడం, ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవడం, పరస్పర అంగీకారం, గౌరవం, పారదర్శకత ఇవన్నీ.. వైవాహిక బంధంలో ఆర్ధిక సంక్షోభాలు రాకుండా నివారిస్తాయి. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
మంచి మాట: విజయం ఓటమి తర్వాత వేకువ
ఓటమి ద్వారా వచ్చే విజయం ఉంది! అది ఓటమి నేర్పే పాఠం!! ఓటమి నేర్పే పాఠం ఎంతో ముఖ్యమైంది ఆపై విలువైంది; అది మరేవిధంగానూ రాదు. ఓటమి దెబ్బ బలంగా తగిలినా మనిషి పడిపోకుండా నిలబడి ఆ పాఠాన్ని చదవాలి. ఓటమి నేర్పిన పాఠాన్ని సరిగ్గా చదవగలిగిన మనిషికి భవిష్యత్తులో విజయం అందుతుంది; విజయవంతమైన భవిష్యత్తు అందుతుంది. ఓడిపోయాక శోకిస్తూ ఉండడం సరికాకపోవడమే కాదు హానికరమైంది కూడా. ఓడిపోయాకైనా గెలవాలి అన్న పట్టుదల కలగాలి. ఆ పట్టుదల ఓటమి తరువాతి జీవనంపై పట్టును ఇవ్వాలి. ఓడిపోవడం నేరం కాదు. ఓడిపోయాక తలదించుకోవాల్సిన అగత్యంలేదు. ఓడిపోతే కుంగిపోకూడదు ఓటమికి లొంగిపోకూడదు. ఓడిపోతే వాడిపోకూడదు, వాడిమిని కోల్పోకూడదు. ఓడిపోయాక మనిషి ఎడారిలో ఒంటరివాణ్ణి అయిపోయానని కృశించిపోతూ ఉండిపోకూడదు; ఎందుకూ కొరగాని వాణ్ణి అయిపోయానని నిస్తేజంగా ఉండిపోకూడదు. ఓడిపోతే నిస్ప్పహా ప్రభావానికి మ్రాన్పడి చిల్తై పోకూడదు. ఓడిపోయాక, నిస్పృహ ఆవరించాక నిద్రలోంచి లేచినట్లుగా లేవాలి. ఆపై మెలకువను పొందినట్లుగా సత్స్పృహను పొందాలి. ఓడిపోతే కష్టాలొస్తాయి; ఆ కష్టాలలోనే సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యాలు ఎంతో ముఖ్యమైనవి. జీవితం అన్నాక, జీవనం ఉన్నాక ఆశాభంగం తప్పదు. భంగం అయినంత మాత్రాన భాగ్యం భగ్నమైపోదు. ఓడిపోయిన తరువాత నిలదొక్కుకోగలిగిన మనిషి ముందుకు సాగగలడు. కలిగిన ఓటమికి దెబ్బతిన్నాక గెలవడంపై మనిషికి చైతన్యం రావాలి. ఓటమి గురించి చింత, చింతనలను అధిగమించాలంటే మనిషికి గెలవాలి అన్న చైతన్యం కావాలి, రావాలి. ఆ చైతన్యంతో గెలుపును సుసాధ్యం చేసుకోవాలి. ఓటమి కలిగాక దాన్ని అర్థం చేసుకుని అంగీకరించాలి. కలిగిన ఓటమికి మనం సాక్ష్యం మాత్రమే అవ్వాలి. అంతకుమించి మనం ఓటమిలో కూరుకుపోకూడదు. భవిష్యత్తులో విజయంలో విలీనం అవ్వాలంటే కలిగిన ఓటమి నుంచి మనల్ని మనం విడిపించుకోవాలి. విజయం సాధించడం ఎలాంటిదో ఓటమి నుంచి విడివడడం కూడా అలాంటిదే. ప్రపంచంలో విజేతలైనవాళ్లలో ఎక్కువ శాతంమంది ఓటమి నుంచి తమను తాము విడిపించుకున్నవాళ్లే. సూర్యోదయాన్ని పొందుతూ ఉండడం భూమి రోజూ సాధిస్తున్న విజయం. పొంగుతూ, సాగుతూ పారడం నది సాధిస్తున్న విజయం. వీస్తూ ఉండడం గాలికి విజయం. విజయం అనేది ఒక లక్ష్యమా? కాదు. విజయం అనేది లక్షణం. అవును విజయం అనేది మనిషికి లక్ష్యంగా కాదు లక్షణం గా ఉండాలి. ఓటమి చీకటిలా మూగినప్పుడు కాస్తంత ఓపికపడితే విజయం వేకువై వచ్చేస్తుంది. ‘‘వేసవికాలం వెంబడించని చలికాలం లేదు’’ అన్నారు వివేకానంద. ఓటమి అనే చలికి పట్టుబడి గడ్డకట్టుకుపోకుండా ఉండగలగాలి. చలికాలం తరువాత వేసవి వచ్చేస్తుంది. ఓటమి శోకాన్ని కలిగించినా విజయాన్ని సాధించేందుకు కాలం ఉందని, ఉంటుందని తెలుసుకోవాలి. విజయం కోసం ఆశపడితే, ఆకాంక్షిస్తే తప్పకుండా మనిషికి అవకాశాలు ఆసన్నం అవుతాయి. వాటిని సఫలం చేసుకుంటే విజయం వస్తుంది. ఆ విజయానికి చిహ్నంగా మనిషి జీవితం వసంతం అవుతుంది. – రోచిష్మాన్ -
వెలుగు రేఖలు
రెక్కాడితేగానీ డొక్కాడని బతుకు భాజ్నుది. ‘ఈరోజు ఎలా పూటగడపాలి. ఏ కష్టం చేయాలి’ అనే ఆలోచన తప్ప మరే ఆలోచన ఆయనకు పెద్దగా ఉండేది కాదు. ఆడపిల్లలకు చదువు ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ఒక స్వచ్ఛందసంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో యాదృచ్ఛికంగా పాల్గొన్నాడు భాజ్ను. ‘విద్య అనేది దీపంలాంటిది. అది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. సమాజానికి దారి చూపే చుక్కాని అవుతుంది విద్య’ అనే మాటలు తనలో చాలారోజుల పాటు ప్రతిధ్వనించాయి. మధ్యప్రదేశ్‌లోని ఒక మారుమూల కుగ్రామానికి చెందిన భాజ్ను నిరక్షరాస్యుడు. అవగాహన లేకో, పరిస్థితుల ప్రభావం వల్లో తాను చదువుకు దూరమై ఉండొచ్చు. నష్టపోయి ఉండొచ్చు. అయితే తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా చూడాలనుకున్నాడు భాజ్ను. విద్య ప్రాముఖ్యత గురించి కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేయడం ప్రారంభించాడు. సోనం, కవితలను తల్లిదండ్రులు చదువు మాన్పించారు. అక్కడి గ్రామీణ సమాజంలో ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు... రకరకాల కారణాలతో ఆడపిల్లలను చదువు మాన్పించడం సాధారణంగా జరిగేదే. సోనం, కవితలు చదువులు మానేయడానికి కారణం వారి సోదరుడు. అతడి అభిప్రాయం ప్రకారం... ‘‘పరీక్షల్లో తప్పితే... వీరి కోసం చేసిన ఖర్చు మొత్తం వృథానే కదా’’ నిజానికి ఇది ఏ ఒక్కరి అభిప్రాయమో కాదు.... మధ్యప్రదేశ్‌లోని అనేక గ్రామాల్లో చాలామంది పేదతల్లిదండ్రుల అభిప్రాయం. సోనం, కవితలు స్కూలు మానేసిన విషయం తెలుసుకొని వాళ్ల ఇంటికి వెళ్లాడు భాజ్ను. తల్లిదండ్రులతో మాట్లాడి సోనం, కవితలు తిరిగి బడిలో చేరేలా చేశాడు. ఇప్పుడు సోనం, కవితలు చదువులో రాణించడమే కాదు... భవిష్యత్ లక్ష్యాలు కూడా నిర్ణయించుకున్నారు. పోలీస్ కావాలని సోనం, టీచర్ కావాలని కవిత కలలు కంటున్నారు. బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్నాడు భాజ్ను. రాజస్థాన్‌లోని మేవార్ జిల్లా మీర్జాపూర్లో ఆడపిల్లలు అయిదవతరగతికి మించి చదవడం అనేది కలలో మాట. ఒక వయసు దాటాక ఆడపిల్లలను స్కూల్‌కు పంపించడం మతవిరుద్ధం అనే అభిప్రాయం కూడా కొద్దిమందిలో ఉండేది. అయితే ‘రూమ్ టూ రీడ్’ స్వచ్ఛంద సంస్థ చొరవతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ‘ఆడపిల్లల చదువు అయిదు వరకే’ అనే పరిమితి చెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే... దీనికి కారణం షబ్నం అనే అమ్మాయి. అయిదవ తరగతితోనే చదువు సరిపెట్టాలని తల్లిదండ్రులు నిర్ణయించినప్పుడు ఆమె వ్యతిరేకించింది. బడికి వెళతానని పట్టుబట్ట ‘‘బడి సంగతి సరే... ఇంటి పని, పొలం పని ఎవరు చేస్తారు?’’ అని అడిగారు తల్లిదండ్రులు. ‘‘నేనే చేస్తాను’’ అంటూ తనను తిరిగి బడికి పంపించడానికి తల్లిదండ్రులను ఒప్పించింది షబ్నం. వాళ్లు సరే అనక తప్పలేదు. ఒకవైపు బండెడు ఇంటిచాకిరి చేస్తూనే, పొలం పనులు చేస్తూనే చదువు మీద శ్రద్ధ పెట్టింది షబ్నం. చదువు మీద షబ్నం ఆసక్తి ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా మారింది. తన చదువు వరకు మాత్రమే పరిమితం కాకుండా... చదువు ప్రాముఖ్యత గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. షబ్నం బడికి వెళుతుండడంతో మిగతా పిల్లలు కూడా తమ ఇళ్లలో గొడవ చేశారు. దీంతో వారికి కూడా పిల్లలను స్కూల్‌కు పంపించక తప్పలేదు. ఇలా ఒకరిని చూసి ఒకరు... అయిదవ తరగతి తరువాత కూడా పిల్లలు చదువు కొనసాగించడం మొదలైంది. గ్రామచరిత్రలో విశేషమైన సంఘటన ఏమిటంటే... పద్దెనిమిది మంది ఆడపిల్లలు పదవతరగతి పాస్ కావడం. ఇది తల్లిదండ్రులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. షబ్నం రాజ్‌కియా పాలిటెక్నిక్ మహావిద్యాలయ, అల్వార్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చేరింది. ‘‘రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో ఆడపిల్లల చదువు గురించి పట్టించుకోరు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. షబ్నంలాంటి అమ్మాయిలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తున్నారు’’ అంటున్నారు రాజ్‌కియా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ అశోక్ వర్మ. షబ్నం అంటే తెలివైన విద్యార్థి మాత్రమే కాదు... గెలుపు పాఠం కూడా! -
మీ పొదుపుపై ద్రవ్యోల్బణం ప్రభావం?
ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. ఉదాహరణకు ఇప్పుడు 6 శాతం ద్రవ్యోల్బణం రేటు వుందనుకోండి...అంటే గత ఏడాది రూ. 100కు లభించే సరుకులు, వస్తువుల ధర ఇప్పుడు రూ. 106 అయ్యిందన్నమాట. మీరు రూ. 100కు ఆరు రూపాయలు చొప్పున ఎక్కువ చెల్లించాల్సివుంటుంది. ద్రవ్యోల్బణం కారణంగా మీ కొనుగోలు శక్తి సన్నగిల్లడమే కాదు...మీ పెట్టుబడులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుచేత మీ పొదుపు, పెట్టుబడులు ద్రవ్యోల్బణం రేటుకంటే ఎక్కువ రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. అలా చేస్తేనే మీరు ధరల్ని తట్టుకొని భవిష్యత్ లక్ష్యాలను సాధించగలుగుతారు. మీ బ్యాంక్ డిపాజిట్ ద్వారా 8.5 శాతం వడ్డీ లభిస్తుందనుకుంటే...వాస్తవంగా ద్రవ్యోల్బణం పోను నికరంగా మీకు మిగిలేది 2.5 శాతమే. అందుకే ఎక్కువ వడ్డీ లభించే సాధనాల్ని ఎంచుకోవాలి. అధిక వడ్డీ సాధనాల్ని ఎంచుకునేముందు, వాటిలో రిస్క్ ఏమైనా వుందేమో చూసుకోవాలి. వివిధ రకాల బ్యాంకులు వివిధ డిపాజిట్ పథకాల్ని అందిస్తుంటాయి. పోస్టాఫీసు పథకాలు, ప్రావిడెంట్ పథకాలు కూడా పరిశీలించవచ్చు. కాస్త రిస్క్ తీసుకునేవారైతే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి డెట్ స్కీములు, మ్యూచువల్ ఫండ్ స్కీముల్ని ఎంచుకోవొచ్చు.