breaking news
free Basics service
-
బుద్ధొచ్చింది.. క్షమాపణ చెప్పాడు!
బ్లూమ్‌బెర్గ్: ఫేస్బుక్ ప్రీ బేసిక్స్ నిషేధించినందుకు భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మార్క్ అండ్రీసేన్ గురువారం క్షమాపణ చెప్పాడు. ఇంటర్నెట్ చార్జీల్లో వివక్షను వ్యతిరేకిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకోవడంతో భారత్‌పై మార్క్ అండ్రీసేన్ తీవ్ర అక్కస్సు వెళ్లగక్కాడు. భారత్ పెట్టుబడిదారి వ్యతిరేక దేశమని, ఆ దేశం ఇప్పటికీ బ్రిటిష్ పాలనలో ఉండి ఉంటే ఇంకా మెరుగ్గా ఉండేదని అతను నోరు పారేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫేస్బుక్ బోర్డు మెంబర్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన మార్క్ తీరుపై ఫేస్బుక్ భారత యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన మార్క్ అండ్రీసేన్ గురువారం క్షమాపణలు కోరాడు. 'భారత రాజకీయాలు, చరిత్ర గురించి నేను గతంలో చేసిన ట్వీట్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. నేను భారత్‌ను , భారత ప్రజలను ఎంతగానో మెచ్చుకుంటాను' అని అతను తాజాగా పేర్కొన్నాడు. కొన్ని పరిమిత వెబ్సైట్లను చూసేందుకు వీలుగా ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ పథకాన్ని భారత్‌లో ప్రవేశపెట్టాలని చూసిన సంగతి తెలిసిందే. అయితే ట్రాయ్ తాజా ఈ నిర్ణయంతో ఈ పథకానికి చెక్ పడింది. -
ఫ్రీ బేసిక్స్ సర్వీసును ఆపండి..
► రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ట్రాయ్ ఆదేశం న్యూఢిల్లీ: ఫ్రీ బేసిక్స్ సేవల చార్జీల అంశం తేలేంత వరకూ ఈ సర్వీసులను వాణిజ్యపరంగా ప్రవేశపెట్టడాన్ని నిలిపివేయాల్సిందిగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను (ఆర్‌కామ్) ట్రాయ్ ఆదేశించింది. ఈ సర్వీసులకు సంబంధించిన నియమ, నిబంధనల వివరాలు ఇవ్వాలంటూ కంపెనీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్ మాధ్యమానికి ప్రాచుర్యంలోకి తెచ్చేదిగా పేర్కొంటూ... సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్.. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా కొన్ని వెబ్సైట్లను ఉచితంగా అందించేందుకు ఫ్రీ బేసిక్స్ సర్వీసును తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకోసం భారత్‌లో ఆర్‌కామ్‌తో చేతులు కలిపింది. అయితే, ఫ్రీ బేసిక్స్ అనేది నెట్ న్యూట్రాలిటి (వెబ్సైట్ల విషయంలో వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించడం) నిబంధనకు విరుద్ధంగా ఉందని వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ సేవలకు సంబంధించి వివిధ కస్టమర్ల నుంచి వివిధ రకాలుగా వసూలు చేసే చార్జీలు, నియమ నిబంధనలు, షరతుల వివరాలు ఇచ్చే దాకా ఈ సేవలను ఆపేయాలంటూ డిసెంబర్ 1న ఆర్‌కామ్‌కు ట్రాయ్ సూచించింది. డిసెంబర్ 7న ట్రాయ్‌కి లేఖ రాసిన ఆర్‌కామ్.. డిసెంబర్ 9 దాకా గడువు కోరింది. కానీ ఆ తర్వాత స్పందించలేదు. దీంతో ట్రాయ్ మరోసారి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ట్రాయ్ ఆదేశాల మేరకు అనుమతులు వచ్చేదాకా ఫ్రీ బేసిక్స్ వాణిజ్యపరమైన సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ఆర్‌కామ్ వర్గాలు తెలిపాయి.


