breaking news
Family Movie
-
ఫ్యామిలీ మేన్
ఇటీవలి కాలంలో వెండితెరపై యాక్షన్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రక్తంతో వెండితెర ఎర్రబడింది. కానీ ఈ సంక్రాంతి పండక్కి స్క్రీన్‌పై వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్స్‌లో నవ్వులు నింపింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని, సరైన ఫ్యామిలీ కథా కథనాలతో వస్తే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని మరోసారి నిరూపితమైంది.‘సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్’ వంటి చిత్రాలు ఇందుకు తాజా ఉదాహరణలుగా నిలిచాయి. దీంతో ఇన్ని రోజులు యాక్షన్ మూవీస్ చేసిన స్టార్స్ ఇప్పుడు ‘ఫ్యామిలీ మేన్’గా మారిపోయారు. కుటుంబ అనుబంధాలు, కథలతో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఫ్యామిలీ సినిమాలతో ఫ్యామిలీ మేన్‌గా మారిపోయి, ఫ్యామిలీ స్టార్స్‌గా సిల్వర్ స్క్రీన్‌పైకి రానున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్ ‘రౌడీ అల్లుడు, బావగారూ.. బాగున్నారా!, శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి చిత్రాల్లో చిరంజీవి చేసిన ఫన్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించింది. ఆ తరహా వింటేజ్ చిరంజీవిని మళ్లీ వెండితెరపైకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తీసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలోనే ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోందని తెలిసింది. కాగా ఈ సినిమాలో శివశంకర వరప్రసాద్ అనే డ్రిల్ మాస్టర్పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, చిరంజీవి–నయనతార ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరిన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారని, ఇటీవల జరిగిన ముస్సోరి షూటింగ్ షెడ్యూల్లో క్యాథరిన్పాల్గొన్నారని, నెక్ట్స్ జరగబోయే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో వెంకటేశ్ సైతంపాల్గొంటారని తెలిసింది. ఇక ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని ఆడియన్స్ స్క్రీన్‌పై చూస్తారని, ఈ సినిమాలో 70 శాతం వినోదం, 30 శాతం ఎమోషన్ ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.ఆనంద నిలయం ఈ ఏడాది సంక్రాంతి పండక్కి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు హీరో వెంకటేశ్. ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని, చిత్రయూనిట్ పేర్కొంది. వెంకటేశ్ కెరీర్లో ప్రస్తుతానికి టాప్ కలెక్షన్ మూవీ ఇది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మళ్లీ ఇదే తరహా సినిమా చేయాలని వెంకటేశ్ భావిస్తున్నారట. ఈ తరుణంలో దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన ఓ కథకు వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి నిధీ అగర్వాల్, త్రిష, రుక్మిణీ వసంత్ వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్.అంతేకాదు... ఈ సినిమాకు ‘కేరాఫ్ ఆనందనిలయం’, ‘వెంకటరమణ’, ‘ఆనందరామయ్య’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక వెంకటేశ్ కెరీర్లో సూపర్‌హిట్ సినిమాలైన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’లకు త్రివిక్రమ్ ఓ రైటర్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా ఆయన డైరెక్షన్లో ఓ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. నిజానికి వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మరి... ఈసారి వీరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌కు వెళ్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.అనార్కలి ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర’ (రిలీజ్ కావాల్సి ఉంది)... ఇలా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు హీరో రవితేజ. ఈ యాక్షన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి, ప్రజెంట్ ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారాయన. ‘నేను... శైలజ, ఆడవాళ్ళు మీకు జోహార్లు, చిత్రలహరి’ వంటి సినిమాలను తీసిన కిశోర్ తిరుమల ఈ ‘అనార్కలి’ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను స్పెయిన్‌లో ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే ఈ సినిమాలోని హీరోయిన్పాత్రలను ఎవరు చేస్తున్నారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆషికా రంగనాథ్, కేతికా శర్మ, మమితా బైజు వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.తాత–మనవడి కథ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘ది రాజాసాబ్’ కూడా ఒకటి. ఈ సినిమాకు మారుతి దర్శకుడు. ఈ సినిమా హారర్ కామెడీ జానర్ నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమా ప్రధాన కథాంశం మాత్రం తాత–మనవడి నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మారుతి కన్ఫార్మ్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్యపాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవికా మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, సముద్రఖని, వీటీవీ గణేశ్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.కాస్త ఆలస్యంగా... ‘గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ: ది ఫైటర్’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు రామ్ చరణ్ కెరీర్లో ఉన్నాయి. కానీ ఈ మధ్య ఫ్యామిలీ సినిమాలకు రామ్ చరణ్ కాస్త దూరమైపోయారని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను ఓకే చేశారని, ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ ఓ నిర్మాతగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. అయితే వెంకటేశ్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది.ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కూడా త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తారని తెలిసింది. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత రామ్ చరణ్‌తో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్తారట త్రివిక్రమ్. ఈలోపు ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుతో చేస్తున్న ‘పెద్ది’ సినిమా చిత్రీకరణను రామ్‌చరణ్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత సుకుమార్‌తో సినిమా చేస్తారు రామ్ చరణ్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో రామ్ చరణ్ సినిమాపై ఓ క్లారిటీ రావడానికి మరింత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.విశ్వనాథన్ అండ్ సన్స్ ‘రంగ్ దే, లక్కీ భాస్కర్’ వంటి ఫ్యామిలీ ఫీల్ ఉన్న సినిమాలను తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా హీరో సూర్యతో సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా చేస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అని, ఇందులో ఉన్న కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను అలరిస్తాయని ఇటీవల దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.వెంకీ అట్లూరి మాటలకు తగ్గట్లే సూర్య కెరీర్‌లోని ఈ 46వ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.మూడు తరాల కథ ఓ కుటుంబంలోని మూడు తరాల కథను వెండితెరపై చూపించనున్నారు హీరో శర్వానంద్. అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా రానుంది. ఈ సినిమా ప్రధాన నేపథ్యం మూడు తరాల కథ అని మేకర్స్ ఆల్రెడీ తెలిపారు. 1990, 2020... ఇలా డిఫరెంట్ టైమ్‌లైన్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుందని తెలుస్తోంది. మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారు.యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ – ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘రేస్ రాజా’ టైటిల్‌ను అనుకుంటున్నారని, షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని, త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుందని సమాచారం. ఇంకా శర్వానంద్ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ప్రధానాంశాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రాజు కథ ‘అనగనగా ఒక రాజు’ కథను ఈ ఏడాది థియేటర్స్‌లో చూడమంటున్నారు యువ హీరో నవీన్ పొలిశెట్టి. మారి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓ పెళ్లి నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుందని, అలాగే హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయని తెలిసింది. శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.ఇంకా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా చేస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (మలయాళ హిట్ ‘జయ జయ జయ జయహే’ తెలుగు రీమేక్), సుహాస్ – మాళవిక మనోజ్‌లు నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం ఈ నెల 11న, ఏఆర్ సజీవ్ డైరెక్షన్‌లోని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఆగస్టు 1న రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఇంకా ప్రేక్షకుల ముందుకు రానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
సండే ఫ్లాష్..: బ్యాక్సినిమాకెళ్తాం నాన్నా!
షూటింగ్‌లు ఆగిపోతాయట.. సినిమా టికెట్లు తగ్గించాలట. కలెక్షన్లు లేవట.. థియేటర్లు ఖాళీ అట. ఇవీ ఇవాళ్టి వార్తలు. కాని థియేటర్లో రిలీజయ్యే సినిమాయే ఏకైక వినోదంగా ఉన్న 1980–90లలో సినిమాకు వెళ్లాలంటే ఎంత తతంగం. ఎంత ప్రిపరేషను. ఎన్ని పర్మిషన్లు. ఎంత హడావిడి. ఎంత సంబరం. జ్ఞాపకం ఉన్నాయా ఆ రోజులు. జ్ఞాపకం చేయమంటారా? నేల డెబ్బయి అయిదు పైసలు. బెంచి రూపాయి. కుర్చీ రూపాయిన్నర. బాల్కనీ రెండు రూపాయలు. ఆ డబ్బులు ఉండేవి కాదు. సినిమాకంటూ కొంత డబ్బు మిగలాలంటే ఇంటి బడ్జెట్లో చాలా కుదరాలి. ఎవరికో హటాత్తుగా జ్వరం రాకూడదు. ఏ ఇంటనో పెళ్లి జరక్కూడదు. ఏదో ఒక బంధువుల ఇంటికి ప్రయాణం పడకూడదు. చుట్టాలు ఊడి పడకూడదు. నోటు పుస్తకాలని, టెక్ట్స్ పుస్తకాలని పిల్లలు డబ్బులు అడక్కూడదు. అన్నీ కుదిరి ఇంట్లో ఐదు రూపాయల వరకూ ఉంటే ఫ్యామిలీ అంతా సినిమాకు పోవచ్చు. సినిమా మారితే గోడ మీద పోస్టర్ పడుతుంది. దానిమీద నీలి సిరాతో థియేటర్ పేరు... ఎన్ని ఆటలో రాసి ఉంటుంది. బండి వీధుల్లో తిరుగుతూ మైక్‌లో ‘మీ అభిమాన థియేటర్ శ్రీ వేంకటేశ్వరలో... రేపటి నుండి’... అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అది ఫ్యామిలీ సినిమా అయితే అమ్మ మనసు లాగుతుంది. ఫైటింగ్ సినిమా అయితే పిల్లలకు తబ్బిబ్బవుతుంది. నాన్నకు ఏ సినిమా అయినా ఒకటే. ఆయన ఉదయం వెళ్లి రాత్రివరకూ పని చేస్తూనో ఉద్యోగం చేస్తూనో షాపు నడుపుతూనో బిజీ. సినిమా మారినట్టే తెలియదు. చూద్దామనే ఆసక్తీ ఉండదు. కాని పర్మిషన్ ఇవ్వాల్సిందీ డబ్బు చేతిలో పెట్టాల్సిందీ ఆయనే. కొందరు నాన్నలు ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఉంటారు. వారిని సినిమాకు పర్మిషన్ అడగాలంటే భయం. కాని ఆ నాన్నలే పిల్లల మాట వింటారు. ‘రేయ్... సినిమాకెళ్తామని మీ నాన్నని అడగండిరా’ అని తల్లులు పిల్లల్ని రాయబారానికి పంపుతారు. కొందరు నాన్నలు చుట్టాలు ఇంటికి రాగానే పొంగిపోతారు. ‘అందరు కలిసి సినిమాకు పోండి’ అని డబ్బులిచ్చి పంపుతారు. కొందరు నాన్నలు చాలా వింత. వాళ్లకై వాళ్లు ఏ మ్యాట్నీయో చూసేసి ఏమెరగనట్టు ఉంటారుగాని ఇంట్లోవాళ్లు సినిమాకు వెళతామంటే మాత్రం ఒప్పుకోరు. కొందరు నాన్నలు అందరూ కలిసి వెళ్లేలా టికెట్లు ముందే తెచ్చి తీసుకువెళతారు. వీళ్లు మాత్రం చాలా మంచి నాన్నలు. ఈ రోజు ఫస్ట్ షోకు వెళ్లాలంటే పొద్దున్నుంచే హడావిడి. ఇరుగమ్మకు పొరుగమ్మకు అవసరం ఉన్నా లేకపోయినా ‘ఇవాళ మేము సినిమాకు వెళుతున్నాం’ అని చెప్తుంది అమ్మ. మంచి చీరా జాకెట్టు వెతుక్కోవడం, వంట తొందరగా ముగించడం, నాన్నకోసం తాళం పక్కింట్లో ఇవ్వడం.... పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు పోతారు– సినిమాకు వెళుతున్నామని. ఇంట్లో నానమ్మ ఉంటే ఆమె మెల్లగా నడుస్తుంది కనుక చాలా ముందే బయలుదేరాలి. ఆమె వేలు పట్టుకుని నడిపించడానికి మనవడు తెగ తొందర పడుతుంటాడు. ట్రైల్పార్ట్ ఉంటుందని కొందరు ఆరాంగా బయలుదేరుతారు. మరికొందరు ‘డింగ్డింగ్ డింగ్డింగ్’ అని మ్యూజిక్ వచ్చి కుచ్చుల తెర పైకి లేచేప్పటి నుంచి చూడాలని ముందే వచ్చేస్తారు. చివరి నిమిషంలో టికెట్లు అయిపోయాయని వెనక్కు వెళ్లేవాళ్లు కొందరైతే... సినిమాకు గంట ముందే వచ్చి ముందు జాగ్రత్తగా ఖాళీ క్యూలో నిల్చునేవారు కొందరు. ఇంటర్వెల్లో ఏం తినాలి? దాని బడ్జెట్ ఎంత? అనేదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. పిల్లలకు పావలా ఇవ్వడం పెద్ద విషయం. కొందరు తల్లులు ఏ జామకాయనో, బొరుగులనో జేబుల్లో పోసి ఇవి తిను అంటారు. ఉప్పుజల్లిన రేక్కాయలు పది పైసలకు కూడా దొరుకుతాయి హాలు బయట. లోపలకు తీసుకెళ్లి తినడమే. వడలు, బజ్జీలు తింటే అదో తృప్తి. పెద్ద కుటుంబాల వారు ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ కొనుక్కుని మెల్లమెల్లగా తాగుతూ చూస్తారు. అన్నింటికంటే ముఖ్యం స్టిల్స్ డబ్బా ముందు నిలబడి ఎన్ని స్టిల్స్ ఫస్ట్ హాఫ్‌లో ఉన్నాయో ఎన్ని స్టిల్స్ సెకండ్ హాఫ్‌లో రానున్నాయో చూసుకోవడం. రాబోయే సినిమాల పోస్టర్లను నోరు వెళ్లబెట్టి చూడటం. తెలిసిన ఏ ఒక్కరు కనిపించినా ‘ఏవోయ్... సినిమాకు వచ్చావా?’ అని అడగడం. సినిమాహాల్లో కనిపించినవాడు సినిమాకు రాక టిఫిన్ తినడానికి వస్తాడా? సినిమాలో మనం కట్టుకోలేని బట్టలు హీరో హీరోయిన్లు కట్టుకుంటారు. మనం చేయలేని సాహసాలు హీరోలు చేస్తారు. మనం చూడని ప్రదేశాలు అందంగా చూపిస్తారు. మనం నవ్వే ఏడ్చే సందర్భాలను రక్తి కట్టిస్తారు. అద్దె ఇళ్లు, రేషన్ సరుకు, చాలీ చాలని ఆదాయం, స్లిప్పర్లు కూడా లేని జీవితం, బయట టీ తాగడానికి కూడా ఆలోచించే బతుకు... వీటిమధ్య మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. ఇవాళ? చేతిలో కంప్యూటర్లో టీవీలో ఎన్ని కావాలంటే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి సినిమాలు కావాలంటే అటువంటివి ఉంటే... అంతా అతి అయిపోతే కొద్దిపాటి రుచిలోని మాధుర్యం పోయింది. ఎంతో గొప్ప వంటకం తెర కోసం తయారైందని తెలిస్తే తప్ప హాలు వైపు నడవడం లేదు ఎవరూ. కొత్తొక రోత. పాతొక వింత. మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. -
కోనసీమ నేపథ్యంతో కుటుంబ కథాచిత్రం: సుకుమార్
త్వరలో కోనసీమ నేపథ్యంలో ఓ కుటుంబ కథాచిత్రాన్ని నిర్మిస్తానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత.. తన కుటుంబసభ్యులతో కలిసి అమలాపురం సావరంలోని తన ఆప్తమిత్రుడు, పంచాయతీరాజ్ ఇంజనీర్ అన్యం రాంబాబు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తనను విలేకరులతో మాట్లాడారు. తాను, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కోనసీమ ప్రాంతానికి చెందినవారమేనని చెబుతూ, కోనసీమ నేపథ్యంలో చిత్రాన్ని తమ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిస్తామని చెప్పారు. రాంబాబు, తాను చిన్నతనం నుంచి స్నేహితులమని, 1993-97 మధ్య కాకినాడ ఆదిత్య కళాశాలలో అధ్యాపకులుగా పని చేశామని చెప్పారు. కోనసీమకు వస్తే రాంబాబును కలవకుండా వెళ్లలేనని చెప్పారు. భార్య హంసిని, కుమారుడు నాయుడు, కుమార్తె సుకృతిలతో కలిసి రాంబాబు కుటుంబసభ్యులతో కొంతసేపు సరదాగా గడిపిన సుకుమార్ అనంతరం అమలాపురం సమీపంలోని ఈదరపల్లిలోని సోదరి ఇంటికి వెళ్లారు. -
ఆ ‘ప్రేమ లీల’ రిపీట్ అవుతుందా?
కొన్ని కాంబినేషన్స్‌కి యమ క్రేజ్. దర్శకుడు సూరజ్ ఆర్. బర్జాత్యా, హీరో సల్మాన్ ఖాన్‌లది అలాంటి కాంబినేషనే. ‘మైనే ప్యార్ కియా’ వంటి సూపర్ హిట్ లవ్‌స్టోరీతో ఈ కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత రూపొందిన ‘హమ్ ఆపే కే హై కౌన్’ ఎవర్గ్రీన్ ఫ్యామిలీ మూవీ. సల్మాన్‌తో మళ్లీ సూరజ్ తీసిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ కూడా మంచి ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రం విడుదలై దాదాపు పదిహేనేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ సూరజ్, సల్మాన్ చేసిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’పై అంచనాలు నెలకొన్నాయి. ఈ 12న చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘ప్రేమలీల’గా తెర మీదకు రానుంది. మరి వీళ్ళ మేజిక్ రిపీట్ అవుతుందా?