చిదంబరాన్ని ప్రశ్నించిన సీబీఐ
అత్యంత వివాదాస్పదమైన ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ ప్రశ్నించింది. 2006లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) రూ. 3500 కోట్ల విలువైన ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. వాస్తవానికి ఆర్థికమంత్రికి కేవలం రూ. 600 కోట్లలోపు ఒప్పందాలనే ఆమోదించడానికి అధికారం ఉంటుంది.
కానీ చిదంబరం తన అధికార పరిధిని దాటి ఈ ఒప్పందాన్ని ఆమోదించారన్నది సీబీఐ అభియోగం. ఇలాంటి భారీ ఒప్పందాలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి పంపాల్సి ఉంటుంది. ఆ కమిటీకి ప్రధాని నేతృత్వం వహిస్తారు. ఇదంతా చేయకుండా అనుమతులు ఎలా ఇచ్చారన్న విషయంపైనే సీబీఐ ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. ఎఫ్ఐపీబీ అనుమతి విషయంలో సీబీఐ వర్గాలు తన నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారని చిదంబరం చెప్పారు. ఇంతకుముందు పత్రికా ప్రకటనల్లో ఏం చెప్పానో వాళ్లకూ అదే చెప్పానన్నారు.