breaking news
elctions-2017
-
రాహుల్‌గాంధీ సభలో విచిత్రం!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల రాయ్‌బరేలీలోని ఛాటో గ్రామంలో నిర్వహించిన ఎన్నికల సభ ఒక అరుదైన అంశానికి వేదికగా నిలిచింది. ఈ సభకు అధిక సంఖ్యలో మహిళలే తరలివచ్చారు. దీంతో ఇది పూర్తిగా మహిళా మద్దతుదారుల సభగా కనిపించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోగానీ, బహిరంగ సభలలో గానీ ఇలా ఎక్కువగా మహిళలే కనిపించడం చాలా అరుదు. దీంతో ఈ విషయాన్ని రాహుల్ సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'తొలిసారి ఒక ఎన్నికల ర్యాలీకి మహిళలు అత్యధికంగా తరలిరావడం చూస్తున్నాను. మీరు అత్యధికంగా వచ్చి పురుషులను పక్కకు తప్పుకొనేలా చేశారు' అని ఆయన పేర్కొన్నారు. సభకు వచ్చిన వారి కెరింతల మధ్య.. ప్రధాని మోదీ చెప్పినట్టు మీ బ్యాంకు ఖాతాలోకి రూ. 15 లక్షల చొప్పున వచ్చాయా? అని ప్రశ్నించారు. కేవలం సంపన్నుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. తన తల్లి నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాహుల్‌గాంధీ ప్రయత్నించారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వారి కుటుంబభద్రత కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. -
అఖిలేశ్‌కు భయం పట్టుకుంది!
ఫతెపూర్: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో గూండారాజ్ నడుస్తున్నదని, సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకొని ఒక మంత్రిని రేప్ కేసులో బుక్ చేయించిందని ఆయన పేర్కొన్నారు. మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతిపై ఎఫ్ఆర్ఐ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేపూర్ సభలో ఆయన మాట్లాడుతూ యూపీ సీఎం అఖిలేశ్‌పై విరుచుకుపడ్డారు. ’అఖిలేశ్ ముఖం కళ తప్పింది. ఆయన స్వరం బలహీనపడింది. ఆయన భయపడుతున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు సరైన పదాల కోసం తడబడుతున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. అఖిలేశ్ ఇప్పటికే ఓటమిని అంగీకరించారని చెప్పారు. ప్రజల మానప్రాణాలకు భద్రత కల్పించే ప్రభుత్వానికి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను కోరారు.