మా భూములు లాక్కోవద్దు
దూబచర్ల జంక్షన్లో దళిత రైతుల రాస్తారోకో
దూబచర్ల (నల్లజర్ల రూరల్) :
తాము చెమటోడ్చి అభివృద్ధి చేసిన పచ్చని పొలాలను పరిశ్రమల స్థాపన సాకుతో లాక్కోవద్దంటూ దూబచర్లలో దళిత రైతులు గురువారం ఆందోళనకు దిగారు.దూబచర్ల - జి.కొత్తపల్లి రహదారి పక్క ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం 450 ఎకరాల అసైన్డ్, 70 ఎకరాల జిరాయితీ భూములను సేకరించాలని నిర్ణయించడంతో నెల రోజులుగా రైతులు సర్వేను అడ్డుకుంటూ ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు రాజమండ్రి - ఏలూరు జిల్లా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్లకార్డులు చేతబూని గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. పురుగు మందు డబ్బాలతో ఆత్మాహుతి చేసుకుంటామంటూ హెచ్చరించారు. ఏఎస్సై సోమరాజు తమ సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సర్పంచ్ గంటా సుందర్రావు, వైస్ ఎంపీపీ ఈడే శ్రీను, కూచిపూడి ఉదయభాస్కరరావు, చావా సుధాకర్, మాజీ ఎంపీపీ చేబ్రోలు కొండ, తొమ్మండ్రు రవి, పంది సత్యనారాయణ, గంటాదాసు, బోడిగడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
రైతుల భార్యలు రిలే దీక్షలు
రాస్తారోకో అనంతరం రైతుల భార్యలు అంబేడ్కర్, రాజీవ్‌గాంధీ విగ్రహాల వద్ద రిలే నిరాహార దీక్షలకు ఉపక్రమించారు. మీకు తెలియకుండా ఎటువంటి భూసేకరణ జరగదని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావులు హమీ ఇచ్చారని మళ్లీ ఇపుడు సర్వే బృందాలు వస్తున్నాయంటే వారి హామీ ఏమైనట్టని వీరు ప్రశ్నిస్తున్నారు. తమకు స్పష్టమైన హమీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కొవ్వూరి నాగలక్ష్మి, కె.నాగమ్మ, కారెం శోభారాణి, మల్లి సరోజిని, బోడిగడ్ల సూర్యాకాంతం, చిన నాగమణి, కారెం గంగారత్నం, మల్లి లిల్లీ కుమారి, కారెం వెంకాయమ్మ పాల్గొన్నారు.