breaking news
dtc vinodkumar
-
నేటి నుంచి ఆన్లైన్లో రవాణా సేవలు
తిమ్మాపూర్: రవాణాశాఖ సేవలన్నీ మంగళవారం నుంచి ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు కరీంనగర్ డీటీసీ వినోద్‌కుమార్ తెలిపారు. రవాణాశాఖలోని 57 సేవలకు సంబంధించి దరఖాస్తుదారులు మొదట ఆన్లైన్లో, మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకుని అక్కడే ఫీజులు చెల్లించాలని చెప్పారు. ఆ తరువాత పత్రాలను ఆర్టీఏ ఆఫీసుల్లో సమర్పించాలని సూచించారు. మంగళవారం నుంచి ఆర్టీఏ ఆఫీసులో సేవలకు సంబంధించి నేరుగా డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదని, అంతా ఆన్లైన్లోనే చెల్లించాలని పేర్కొన్నారు. దీనిని దరఖాస్తుదారులు గమనించి సహకరించాలని కోరారు. సేవలు అందించినందుకు మీ సేవా, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులకు రూ.35 ఫీజు చెల్లించాలని చెప్పారు. -
ముగిసిన ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవాలు
ప్రమాదాల నివారణకు డ్రైవర్లు కృషిచేయాలి ఇన్చార్జి డీటీసీ వినోద్‌కుమార్ మంకమ్మతోట: ప్రమాదాల నివారణకు ఆర్టీసీ డ్రైవర్లు కృషిచేయాలని ఆర్టీవో, ఇన్చార్జి డీటీసీ వినోద్‌కుమార్ అన్నారు. ఆర్టీసీ రీజినల్‌స్థాయి ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు సమావేశం కరీంనగర్–2 డిపోలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన 36 మంది డ్రైవర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి డ్రైవర్ల సహకారం గొప్పదన్నారు. ఆర్టీసీలో ప్రమాదాలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తుంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరగడానికి గల కారణాలు తెలిపే వీడియో విజువల్స్‌ను చూపించి వాటిగురించి వివరించారు. రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 2014–15లో రాష్ట్రంలో ప్రమాద బాధిత కుటుంబాలకురూ.46కోట్లు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించామని, రీజియన్‌లో 2.6కోట్లు చెల్లించామన్నారు. డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రవి, డెప్యూటీ చీఫ్‌ట్రాఫిక్ మేనేజర్ పి.శివకుమార్, వన్‌డిపో మేనేజర్ మల్లేశం, టూ డిపో మేనేజర్ లక్షీధర్మ పాల్గొన్నారు. ఉత్తమ డ్రైవర్లకు సన్మానం కరీంనగర్ రీజియన్‌లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా బస్సులు నడిపించిన ఉత్తమ డ్రైవర్లను సన్మానించారు. 27 సంవత్సరాలపాటు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో కోరుట్లకు డిపోకుచెందిన కేజీ రాజం, జి.నరేందర్, హుస్నాబాద్ డిపోకు చెందిన పి.మల్లేశంను శాలువాతో సన్మానించారు. డిపోలవారీగా పలువురి డ్రైవర్లను సత్కరించారు. బి.శంకర్, బి.చందు, ఎస్‌డీఎ.అలీ(గోదావరిఖని డిపో), ఎం.రాములు, ఎన్ఎస్.రెడ్డి, కేఎస్.నారాయణ(హుస్నాబాద్), కె.కొమురయ్య, ఎం.లింగయ్య, ఎం.రాములు(హుజూరాబాద్), ఎస్.శంకర్, ఎల్.నారాయణ, ఎం.వెంకటయ్య(జగిత్యాల), డి.రాజయ్య, టీఆర్ రెడ్డి, ఎం.దశరథం(కరీంనగర్–1), ఎంఎక్యు పాషా, ఆర్.కనుకయ్య, ఎస్డీ ఐ.అహ్మద్(కరీంనగర్–2), ఎండీ సలీం, బి.పోచయ్య, సీఎం రావు(కోరుట్ల), ఎ.డాడు, జెడీ.నాయక్, బి.దర్గయ్య(మంథని), వి.నర్సయ్య, ఎం.లక్ష్మయ్య, పీఎస్ రెడ్డి(మెట్పల్లి), సీహెచ్ ఎ.రావు, జి.జనార్దన్, ఎ.లక్ష్మణ్(సిరిసిల్ల), ఎస్. భగవంతరావు, బి.చంద్రయ్య, జి.రవీందర్(వేములవాడ)ను సన్మానించారు. డ్రైవింగ్‌ను బాధ్యతగా చేయాలి –కూకట్ల గంగారాజం, డ్రైవర్, కోరుట్ల డిపో ఆర్టీసీ డ్రైవర్ అంటే శిక్షణ తీసుకున్న సంస్థ డ్రైవర్ అని ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం డ్రైవర్ బాధ్యత. యాక్సిడెంట్ అనేది లేకుండా రిటైర్మెంట్ కావాలని పనిచేస్తున్నా. బాధలన్నీ ఇంటికే పరిమితం –టీఆర్ రెడ్డి, కరీంనగర్–1డిపో డ్రైవర్ బాధలు ఎన్ని ఉన్నా వాటిని ఇంటికే పరిమితం చేయాలి. డ్యూటీలో ఉన్నామని బస్సు దిగేంత వరకు గుర్తుంచుకోవాలి. మానసిక ఉల్లాసంగా ఉండి బస్సును నడిపితే ప్రమాదాలు జరగవు. డ్రైవర్ అన్ని రూట్లను గుర్తుంచుకుని డ్రైవింగ్ చేయాలి. శిక్షణ విషయాలను గుర్తుంచుకోవాలి –ఎస్డీ ఐ. అహ్మద్, కరీంనగర్–2 డిపో డ్రైవర్ ఆర్టీసీలో ఉద్యోగంలో చేరేప్పుడు సంస్థ శిక్షణలో చెప్పిన విషయాలను డ్రైవర్ రిటైర్డ్ అయ్యే వరకు గుర్తుంచుకోవాలి. నిబంధనలు పాటిస్తే 99 శాతం ప్రమాదాలు జరగవు. డ్రైవింగ్ సమయంలో ప్రతీనిమిషం అప్రమత్తంగా ఉండాలి.