breaking news
Distribution of goats
-
చెంచులకు వంద శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని చెంచులకు వందశాతం సబ్సిడీతో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మినీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. చెంచులకు 250 యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్ కాస్ట్ రూ.30వేలు ఉండగా రూ.22,500 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన రూ.7,500 ఐటీడీఏ భరిస్తుందని తెలిపారు. ఆళ్లగడ్డ మండలానికి 16 యూనిట్లు, రుద్రవరం ఏడు యూనిట్లు, జూపాడుబంగ్లా 3, నందికొట్కూరు 4, ఆత్మకూరు 109, బండి ఆత్మకూరు 26, కొత్తపల్లి 18, మహానంది 1, పాణ్యం 10, శ్రీశైలానికి 26, వెలుగోడుకు 30 ప్రకారం మొత్తం 250 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని పారదర్శకంగా పంపిణీ చేయాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీడీలు పి.రమణయ్య, జీవీ రమణ, సీవీ రమణయ్య, పలువురు పశువైద్యులు పాల్గొన్నారు. -
గోవర్ధనుడు
∙ ఆవును సాదుకుంటామన్న షరతుపై... 261 మంది రైతులకు ఆవుల పంపిణీ ∙ 650 కి చేరిన వాటి సంతతి... ∙ గో సేవలో తరిస్తున్న రాజమౌళి–బాలమణి దంపతులు ‘రైతులకు ఆవులను ఇచ్చి వాటి సంతతి వృద్ధి చెందితే రైతు, రైతుపై ఆధారపడ్డ సమాజం... తద్వారా దేశానికి మేలు జరుగుతుందని నమ్మే వారిలో నేనొకడిని. అందుకే రైతులకు గోవులను పంపిణీ చేస్తున్నా’ అని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి చౌరస్తాకు చెందిన వ్యాపారవేత్త శెనిశెట్టి రాజమౌళిగుప్తా అంటున్నారు. 2011 అక్టోబర్ 24న శెనిశెట్టి రాజమౌళి, బాలమణి దంపతులు ‘గోమాత సేవా సంస్థ’ను ప్రారంభించారు. అప్పటినుంచి రైతులకు గోవులను దానం చేయడం మొదలుపెట్టారు. కబేళాకు తరలించే గోవులను కొనుగోలు చేయడం, వాటిని తన ఇంటి వద్ద ఉన్న గోశాలలో సంరక్షించి పేద రైతులకు అందించడం ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నారు. రాజమౌళి గుప్తా రైస్‌మిల్ వ్యాపారి. ఆయన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు అధిక సమయం కేటాయిస్తూ రైతుల ఇంట ఆవులు ఉండాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు గోమాత సేవా సంస్థను ప్రారంభించి గడచిన ఆరేళ్లుగా రైతులకు గోవులను అందజేస్తున్నారు. ఆవును సాదుకుంటామన్న అగ్రిమెంట్‌పైనే... తాము ఆవును సాదుకుంటామని ముందుకు వచ్చి, అగ్రిమెంటు (ప్రమాణపత్రం)పై సంతకం చేస్తేనే ఆ రైతుకు ఆవును అందిస్తున్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఆవును అమ్మకూడదు. ఆవును సాదలేని పరిస్థితుల్లో బంధువులకో, స్నేహితులకో ఇచ్చి దాన్ని కాపాడాలన్న కచ్చితమైన నిబంధనను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 261 మంది రైతులకు ఆవులను దానం చేయగా, దాదాపు అందరూ వాటిని పెంచి పెద్ద చేసుకుంటున్నారు. వాటిద్వారా గో సంపద 650కి పెరిగింది. ఒక్కో రైతు వద్ద ఒక్క దానితో నాలుగైదు తయారయ్యాయి. రైతుల వద్ద వెయ్యి ఆవులు తయారైతే తన లక్ష్యం నెరవేరినట్టేనని చెబుతున్న రాజమౌళి, త్వరలోనే తన లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇరుగు పొరుగు జిల్లాల రైతులకు కూడా... మాచారెడ్డి ప్రాంతానికి చెందిన రైతులకే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన వారికీ ఆవులను అందించారు. ఎక్కువగా సిద్దిపేట, సిరిసిల్లా, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఆవులను దానం చేశారు. ఒక్క మాచారెడ్డి మండలంలోనే 16 గ్రామాలకు చెందిన 88 మంది రైతులకు గోవులను అందించాడు. కామారెడ్డి, భిక్కనూరు, సదాశివనగర్, లింగంపేట, తాడ్వాయి, దోమకొండ, గాంధారి మండలాల రైతులతోపాటు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలానికి చెందిన కొందరు రైతులకు ఆవులను అందించారు. సిరిసిల్లా జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లా, ముస్తాబాద్, వేములవాడ మండలాలతోపాటు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్ మండలాలకు చెందిన రైతులకు గోవులను ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడీ గో దాన కర్ణుడు. ఇలాంటి వారుంటే సమాజం కొంతయినా అభివృద్ధి చెందుతుందేమో! – సేపూరి వేణుగోపాలచారి సాక్షి, కామారెడ్డి – ఫోటోలు: జి.అరుణ్ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి... గోజాతి అంతరిస్తున్న కొద్దీ అనర్థాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గో ఆధారిత వ్యవసాయం దెబ్బతిన్న తరువాత రసాయనాలతో పండించిన ఆహార ఉత్పత్తులు తిని ప్రజలందరూ అనారోగ్యం పాలవుతున్నారు. తద్వారా ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నాం. రైస్‌మిల్‌కు వచ్చే రైతులు ఎన్నో రకాల కష్టాలు చెప్పుకుంటుంటే, వారికోసం నేను ఏదైనా చేయాలని ఆలోచించాను. నా సంపాదనలో కొంత భాగాన్ని రైతులకు గోవులను అందించడానికి వెచ్చించాలని నిర్ణయించుకుని గోమాత సేవాసంస్థను స్థాపించాను. అనుకున్నట్లు చేస్తున్నాను. ఇప్పటి వరకు ఆవును తీసుకున్న రైతులు గో సంతతిని వృద్ధి చేసుకుంటుండడం ఆనందంగా ఉంది. వెయ్యి ఆవులు తయారైతే నా సంకల్పం పూర్తిగా నెరవేరినట్టే. – శెనిశెట్టి రాజమౌళిగుప్తా, గోమాత సేవా సంస్థ వ్యవస్థాపకులు గోమాతను కాపాడుకోవాలె... ప్రతీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. మా దగ్గర ఆవులు ఉన్నాయని చాలా మంది పండుగలు, పూజా కార్యక్రమాలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ల సందర్భంలో గోమూత్రం, గోపేడ కోసం వచ్చేవారు. రైతుల దగ్గర గోవులు లేకపోవడం వల్లే చాలామంది మా దగ్గరకు వస్తున్నారని, అందుకే రైతులకు గోవులు ఇవ్వాలనుకుని ఐదారేళ్లుగా అందిస్తున్నాం. రైతుల దగ్గర గో సంతతి పెరుగుతోందని తెలిసి ఎంతో సంతోషపడుతున్నాం. – బాలమణి, గోమాత సేవా సంస్థ ప్రతినిధి ఒక్కదానితోని నాలుగు అయినయి... నాలుగేండ్ల కిందట రాజమౌళి సేటు ఆవును ఇచ్చిండు. అప్పటిసంది ఆవును పానం లెక్క సాదుకున్న. ఆవు మూడు ఈతలు ఈనింది. ఇప్పటికి నాలుగు అయినయి. ఎవలకి ఇయ్య. అమ్ముకోను గూడ. ఇంకా పెంచుకుంట. ఏ కష్టం వచ్చినా ఆవును అమ్ముకోను. – సూర్య, రైతు, గజ్యానాయక్ తండా