breaking news
Carpentry
-
అది నా గుర్రం
‘ఛల్ ఛల్ గుర్రం, చలాకీ గుర్రం. రాజు గారి గుర్రం. నేనెక్కితే గుర్రం. మబ్బుల్లో పరుగులెట్టు గుర్రం’ అంటూ కొయ్య గుర్రం మీద ఊగుతూ పాట పాడే బాల్యం ఏమైపోయింది?పిల్లలు తమను తాము జానపద హీరోల్లా కీలుగుర్రం మీద ఆకాశంలో ఎగురుతున్నట్లు ఊహించుకుంటూ ఊగే గుర్రం బొమ్మ ఎక్కడికి పోయింది?ఇంటికి అతిథులుగా వచ్చిన పిల్లల కళ్లు ఆ గుర్రం మీద పడ్డాయంటేచాలు... రయ్యిన వెళ్లి గుర్రమెక్కేస్తారు. ఆ వెంటనే ఆ గుర్రం యజమాని (ఇంటి పిల్లాడు) ‘‘ఇది నా గుర్రం, దిగు’’ అంటూ తోసేసేవాడు. వాళ్లిద్దరికీ నచ్చచెప్పేటప్పటికి పెద్దవాళ్లకు ఒక యుద్ధాన్ని విరమింపచేసి సంధి కుదిర్చినంత పని. ఇప్పుడా ముచ్చట్లు ఎక్కడికి పోయాయి?ఒక తరం మారి కొత్త తరం వచ్చేసరికి గుర్రం బొమ్మ పాత వాసనతో అటకెక్కింది. కొత్త తరం బాల్యం మల్టీ నేషనల్ కంపెనీలు తయారు చేసే ఇంపోర్టెడ్ టాయ్స్ బాట పట్టింది. మన వడ్రంగి చేసే గుర్రంలో ఉండే నేటివిటీని మిస్సయింది. ‘ మా రోజుల్లో కొయ్య గుర్రం బొమ్మలుండేవి. మీ నాన్న కూడా రోజంతా గుర్రం మీదనే ఉండేవాడు’ అని నానమ్మలు చెప్తే అవి ఎలా ఉంటాయో ఈ తరం పిల్లలకు ఊహకందదు. గుర్రం కోసం కామిక్ షోలో లేదా యానిమల్ ప్లానెట్‌లో వెతుక్కోవాల్సిన యానిమేటెడ్ బాల్యం ఈ తరానిది. రాబోయే తరానికి అదీ ఉండదు. ఇంతటి అగత్యం రాకూడదంటాడు నవాబ్ షేక్ మస్తాన్ వలి. ప్రకాశం జిల్లా, చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ, పాతగేటు సెంటర్లో ఉండే ఈ వడ్రంగి ఇప్పటికీ గుర్రం బొమ్మలు చేస్తూనే ఉన్నాడు. ‘ఇంకా వీటిని చేయడం ఎందుకు? ఇప్పుడు ఈ బొమ్మలకు మార్కెట్ ఉందా?’ అని ఎవరైనా అడిగితే ‘‘కొనేవాళ్లు తక్కువే. కానీ ఇష్టమైన వాళ్లు కొనుక్కుంటారు. కొనేవాళ్లు తగ్గారని చేయడం మానేస్తే... రాను రాను ఇలాంటి బొమ్మలుండేవన్న సంగతి కూడా తెలియకుండా పోతుంది కదా!’’ అని తిరిగి ప్రశ్నించాడు వంచిన తల ఎత్తకుండానే. అతడిని మాటల్లో పెడితే మెల్లగా వివరాలు చెప్పసాగాడు.‘‘మా తాత చెక్కతో ఏనుగులు, గుర్రాలు చేసేవాడు. ఆయనకు చేతికింద సహాయం చేస్తూ పని నేర్చుకున్నాను. మేము చేసేది చెక్క బొమ్మే అయినా, ప్రాణం పోసినంత అపేక్షగా చేస్తాం. అలా చేస్తేనే రూపం చక్కగా కుదురుతుంది. చెక్క మీద డిజైన్ గీసుకుని, కట్ చేసుకున్న తర్వాత అంచులు పిల్లలకు గుచ్చుకోకుండా ఉండడానికి నునుపుగా వచ్చే వరకు తోపుడు పట్టాలి. ఆ తర్వాత ఇనుప బోల్టులు, హ్యాండిల్ అమరుస్తాం. చివరగా రంగులు వేయాలి. ఆ రంగులు బాగాలేకపోతే పిల్లలకు బొమ్మ నచ్చదు. ఒక్క గుర్రం బొమ్మ చేయాలంటే రెండు రోజులు పడుతుంది. రెండేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకు మా తాత రోజుల్లో మా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్లకు చేసిచ్చేవాళ్లం. ఇప్పుడు ఎక్కువ బొమ్మలు చేసి పట్టణాలకు తీసుకెళ్లి ఎగ్జిబిషన్లలో అమ్ముకుంటున్నాం. ఎగ్జిబిషన్ నిర్వహకులు కూడా మాకు ఆర్డర్లు ఇస్తుంటారు. విజయవాడ, హైదరాబాద్‌కు కూడా పంపిస్తున్నాం. గుర్రం బొమ్మ 15 వందలనగానే ముఖం చిట్లిస్తారు. చెక్క ఖరీదు, ఇనుప వస్తువులు, చెక్కను కట్ చేయడానికి మెషీన్, రంగులు కొనాల్సిందే కదా. మేము చేసే పనికి కూలి గిట్టాలి. గుర్రం బొమ్మను గట్టిగా చేస్తాం. రెండేళ్ల నుంచి ఈ బొమ్మల మీద ఆడుకుంటారు పిల్లలు. పన్నెండేళ్ల పిల్లలు కూర్చున్నా విరగనంత దృఢంగా చేస్తాం బొమ్మని. కొత్తవాళ్లు రావడం లేదు కొత్తవాళ్లు ఈ పని నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించడానికి నేను సిద్ధమే. కానీ ప్లాస్టిక్ బొమ్మలు ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుండటంతో వీటిని కొనే వాళ్లు తగ్గిపోయారు. నేను మాత్రం ఈ కొయ్యగుర్రం, ఏనుగు బొమ్మలను చేస్తూనే ఉన్నాను. ఎక్కువ మంది లేకపోవడంతో కావచ్చు, నాకు మాత్రం పని దొరుకుతూనే ఉంది’’ – గుర్నాథ్, సాక్షి, చీరాల -
ఖాకీచులాట
వరంగల్ క్రైం : వరంగల్ రూరల్, అర్బన్ పోలీసుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. జిల్లా పోలీసు శాఖ అర్బన్, రూరల్‌గా విభజన చెంది మూడేళ్లకు పైగా కాగా... హెడ్క్వార్టర్స్లోకి కొన్ని విభాగాలు ఇప్పటికీ ఉమ్మడిగానే పనిచేస్తున్నాయి. ఇటీవల కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలతో ఇరువురి మధ్య భేదాభిప్రాయూలు ఏర్పడ్డాయి. చిన్ని చిన్న విషయాల్లో ఇప్పటికే అనేక మార్లు మనస్పర్థలు వచ్చినప్పటికీ సర్దుకుపోతూ వచ్చారు. కానీ... శుక్రవారం హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సంఘటనతో అర్బన్, రూరల్ పోలీస్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఉమ్మడి వృత్తి సిబ్బందిపై ఆంక్షలు చిలికిచిలికి గాలివానగా మారి దుమారం చెలరేగింది. అసలు ఏం జరిగిందంటే... ప్లంబర్, కార్పెంటరీ ఇలాంటి వృత్తి ఉద్యోగులు అటు అర్బన్‌కు, ఇటు రూరల్ కార్యాలయాలకు అవసరం వచ్చిన సమయంలో ఉమ్మడిగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరిపై అధికారిగా ఉన్న రూరల్‌కు చెందిన వ్యక్తి ఒకరు అర్బన్‌కు పనులు చేయొద్దని హుకుం జారీచేశారు. అనేక పర్యాయాలు అర్బన్‌కు పని ఉన్నప్పుడు సదరు సిబ్బంది వెళ్లకుండా అడ్డుపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలా పలుమార్లు సిబ్బంది అర్బన్‌కు చెందిన పనులు చేయకపోవడంతో పనులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో సదరు అధికారి ఇలా చేయడం నచ్చని ఒక అర్బన్ అధికారి రూరల్ పోలీస్ పరేడ్‌కు వెళ్లొద్దని తన ఆధీనంలోని బ్యాండ్ కళాకారులను ఆదేశించారు. దీంతో రూరల్ పరేడ్ బ్యాండ్ ప్రదర్శన లేకుండానే ముగిసింది. ఈ విషయంపై ఆగ్రహించిన రూరల్ ఉన్నతాధికారి ఒకరు ‘మాకు బ్యాండ్ ఇవ్వరా’ అంటూ అర్బన్ అధికారులపై చిందులేశారు. అర్బన్ అధికారి కుర్చీ బయటపడేసి... బ్యాండ్‌ను అడ్డుకున్న అర్బన్ అధికారికి, ఇదే కేడర్‌లో ఉన్న రూరల్ అధికారి ఒకే గదిలో నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గతంలో అర్బన్‌కు ఈ పోస్టు ఉండేది కాదు. నాలుగు నెలల క్రితమే ఈ పోస్టు మంజూరైంది. మరో బిల్డింగ్ లేకపోవడంతో ఇద్దరు అధికారులకు ఒకే గదిని కేటాయించారు. అయితే శుక్రవారం జరిగిన ఘటన నేపథ్యంలో అర్బన్ అధికారి కుర్చీని రూరల్ అధికారి బయటకు విసిరేయించాడు. సదరు అర్బన్ అధికారికి సంబంధించిన సామగ్రి మొత్తాన్ని బయట పడేయడంతో హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అర్బన్, రూరల్ సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి చేయిదాటుతోందన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను పిలిపించి విషయం తెలుసుకున్నారు. అర్బన్ అధికారి తనకు జరిగిన అవమానాన్ని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావును కలిసి వివరించారు. దీంతో రూరల్ అధికారులను అర్బన్ ఎస్పీ మందలించినట్లు తెలిసింది. మరో మారు ఇలాంటి వివాదం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించినట్లు సమాచారం. దయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన గొడవ పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.