breaking news
bike trash
-
యువతిని వేధించిన యువకులపై నిర్భయ కేసు
తిరుపతి : ప్రేమ పేరుతో వేధించి, యువతిని తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు యువకులపై చిత్తూరు జిల్లా తిరుపతిలోని అలిపిరి పోలీసులు మంగళవారం నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. (చదవండి... తిరుపతిలో మృగాళ్ల అకృత్యం) అలిపిరి సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. నగరంలోని కేపీ లేఅవుట్లో నివాసముంటున్న విద్యార్థినిని గతంలో ఆమెతో పాటు చదువుకున్న నవీన్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. అతని ప్రేమను విద్యార్థిని అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న నవీన్ తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి జూన్ 1న మద్యం తాగి..ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని, ఆమె స్నేహితురాలిని బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ ముందస్తు ప్రణాళికతోనే వాహనాన్ని ఢీకొట్టాడని దర్యాప్తులో తేలడంతో కేసును అలిపిరి పోలీసు స్టేషనుకు బదిలీ చేశారు. వెన్నెముకకు తీవ్ర గాయమవడంతో బాధితురాలు మంచానికే పరిమితమైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
తిరుపతిలో మృగాళ్ల అకృత్యం
ప్రేమించలేదని ద్విచక్రవాహనంతో ఢీకొట్టిన వైనం వెన్నుముక గాయాలతో మంచం పట్టిన యువతి ప్రేమోన్మాదులపై నిర్భయ కేసు తిరుపతి క్రైం: తిరుపతిలో మృగాళ్ల రాక్షసకృత్యాలు మితిమీరుతున్నాయి. తనను ప్రేమించలేదని ఓయువకుడు కక్షగట్టి కిరాతకంగా వాహనంతో యువతిని ఢీకొన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ శ్రీవానివాసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు నగరంలో ఓ లేఔట్‌కు చెందిన యువతిని ఇంటర్ చదువుతున్న సమయంలో నవీన్ అనే తోటి విద్యార్థి ప్రేమపేరుతో వేధించేవాడు. నవీన్ ఇంటర్ ఫెయిలయ్యాడు. ఈనెల 1న సాయంత్రం బాధితురాలు తన స్నేహితురాలి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నవీన్, స్నేహితుడు యశ్వంత్‌తో కలసి మద్యం సేవించి తమ వాహనంతో వెనుకనుండి ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువతులు కిందపడిపోయారు. తన మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. వీరు తప్పించుకుని పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధిత యువతిని రుయా ఆస్పత్రికి తరలించారు. తర్వాత తప్పతాగి నవీన్, యశ్వంత్ రుయా ఆస్పత్రికి వచ్చారు. వీరిని గమనించిన అమ్మాయి తండ్రి ఆస్పత్రి సిబ్బందికి, అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. దీంతో బాధితురాలి తండ్రి ఈనెల 2వ తేదీన అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో సంఘటనపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో బాధితురాలి తండ్రి సోమవారం రాత్రి 9గంటలకు మీడియాకు విషయాన్ని తెలిపారు. దీనిపై పోలీసులను సంప్రదించగా నిందితులపైముందు రోడ్డు ప్రమాదం కేసు పెట్టి ఈనెల 6నే అరెస్ట్ చేశామని, అనంతరం నిర్భయకేసు నమోదు చేశామని చెబుతున్నారు. బాధితురాలికి వెన్నుముక తీవ్రంగా గాయపడంతో మంచానికే పరిమితమైంది.