breaking news
Auto Expo 2014
-
రివర్స్ గేర్‌లో కార్ల అమ్మకాలు
గ్రేటర్ నోయిడా: కార్ల అమ్మకాలు రివర్స్ గేర్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కార్ల విక్రయాలు 8% తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) వెల్లడించింది. గతేడాది జనవరిలో 1,73,449 కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది జనవరిలో 1,60,289 కార్లు విక్రయమయ్యాయని సియాం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ తెలిపారు. కార్ల అమ్మకాలు తగ్గడం ఇది వరుసగా నాలుగోనెల అని, ప్యాకేజీ ఇవ్వక తప్పదని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోయాయని సేన్ చెప్పారు. భారీ, మధ్యతరహా వాణిజ్య వాహనాల విక్రయాలు వరుసగా 23 నెలల పాటు క్షీణిస్తూనే ఉన్నాయంటూ... ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓట్-ఆన్ అకౌంట్లో వాహన పరిశ్రమకు తోడ్పాటునందించే చర్యలుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2008-09 నాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయని, అప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, ఇప్పడు కూడా అదే తోడ్పాటును ఆశిస్తున్నామని చెప్పారు. వాణిజ్య వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతమున్న 12% నుంచి 8 శాతానికి తగ్గించాలని ఇప్పటికే భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఆటో ఎక్స్పో ఆశలు: మారుతీ అమ్మకాలు 7%, హ్యుందాయ్ 3%, టాటా మోటార్స్ 24% చొప్పున పడిపోయాయని సేన్ చెప్పారు. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4%, స్కూటర్ల అమ్మకాలు 28% చొప్పున పెరిగాయన్నారు. ఈ ఆటో ఎక్స్‌పోలో కంపెనీలు కొత్తగా 70 వాహనాలను ఆవిష్కరించాయని, దీంతోనైనా అమ్మకాలు పుంజుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ముగిసిన ఆటో ఎక్స్పో
గ్రేటర్ నోయిడా: నగరంలో వారం క్రితం ప్రారంభమైన 12వ ఆటోఎక్స్‌పో మంగళవారం ముగిసింది. ఈ షో కార్ల పరిశ్రమకు మళ్లీ మంచిరోజులు వస్తాయని, విక్రయాలు బాగా పెరుగుతాయని ఆశలు క్రమేపీ చిగురిస్తున్నాయి. కాగా ఈ షోలో మొత్తం ఆవిష్కరణలు చోటుచేసుకోగా, అందులో 26 అంతర్జాతీయ మోడల్ కార్లు ఉన్నాయి. మొత్తం 5.6 లక్షలమంది సందర్శకులు ఈ షోను తిలకించారు. చివరిరోజైన మంగళవారం దాదాపు 90 వేలమంది సందర్శకులు తరలివచ్చారు. కాగా 11వ ఆటో ఎక్స్పో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన సంగతి విదితమే. ఈ విషయమై మారుతి సుజికీ ఇండియా సంస్థ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మనోహర్ భట్ మాట్లాడుతూ గత 11వ ఆటో ఎక్స్పో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన షోని మొత్తం ఏడు లక్షలమంది సందర్శించారన్నారు. విక్రయాలు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే ఈ షో జరిగిందన్నారు. ఇదొక సానుకూల సంకేతమన్నారు. సందర్శకు నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇదే విషయమై సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) డిప్యూటీ జనరల్ మాట్లాడుతూ సందర్శకులనుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇదిలాఉంచితే జర్మనీకి చెందిన విలాసవంతమైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ కార్ల వద్ద సోమవారం సందర్శకులు అత్యధిక సంఖ్యలో కనిపించిన సంగతి విదితమే. దాదాపు 50 మీటర్ల మేర క్యూలలో సందర్శకులు నిల్చుని వాహనాలను సందర్శించారు. -
ఏటా రెండు కొత్త వాహనాలు
గ్రేటర్ నోయిడా: ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు టాటామోటార్స్ కసరత్తు ప్రారంభిచింది. ఇకపై ఏడాదికి రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రయాణికుల వాహనాల మార్కెట్లో కోల్పోయిన వాటా సాధించడం లక్ష్యమని కంపెనీ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ చెప్పారు. కొత్త మోడళ్లను అందించలేకపోవడం వల్లే అమ్మకాల్లో వెనకబడ్డామని ఆయన అంగీకరించారు. అందుకే ఏడాదికి రెండు మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగానే కొత్త హ్యాచ్‌బాక్ బోల్ట్‌ను, కాంపాక్ట్ సెడాన్ జెస్ట్‌ను ఇటీవలనే ఆవిష్కరించామని చెప్పారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇవి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటీవలే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన కాన్సెప్ట్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ నెక్సన్‌ను రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ ఎస్యూవీ విడుదలకు ముందే మరికొన్ని కొత్త మోడళ్లను కస్టమర్లకు అందిస్తామని తెలిపారు. -
సూపర్ బైక్స్ హల్చల్
పన్నెండవ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరణల జోరు కొనసాగుతోంది. ఈ ఎక్స్పో రెండో రోజైన గురువారం సూపర్ బైక్‌లు సందడి చేశాయి. పలు కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రణాళికలను కూడా ప్రకటించాయి. డీఎస్కే హ్యోసంగ్, ట్రయంఫ్, టెర్రా మోటార్స్‌లు సూపర్ బైక్‌లను ఆవిష్కరించాయి. వివరాలు మారుతీ సుజుకి: ఈ కంపెనీ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో కొత్త కారు, సెలెరియోను ఆవిష్కరించింది. ధర రూ.3.9 -రూ.4.96 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ మోడల్లో ఆటోమాటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్లు రెండింటిని అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లకు సాధారణంగా మూడు సమస్యలుంటాయని వివరించింది. ధర అధికంగా ఉండడం, మైలేజీ తక్కువగా వస్తుండడం, నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండడం వంటి ఈ మూడు సమస్యలను తీర్చేలా ఈ సెలెరియో కారును రూపొందించామని పేర్కొంది. టయోటా: తొలి క్రాసోవర్, న్యూ ఇటియోస్ క్రాస్‌ను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారును ఈ ఏడాది మేలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. కారు ప్లాట్‌ఫామ్‌పై ఎస్యూవీ ఫీచర్లతో రూపొందించే వాహనాలను క్రాసోవర్‌గా పరిగణిస్తారు. ధర ఇటియోస్ లివా కార్ల ధర (రూ.4.23లక్షలు-7.12 లక్షలు)ల కన్నా అధికంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా: ఈ కంపెనీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు హలోను ఆవిష్కరించింది. మూడేళ్లలో ఈ కారును మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 200 కిమీ దూరం ప్రయాణిస్తుందని, 0-100 కి.మీ.లను 8 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. అని పేర్కొంది. గంటలోనే పూర్తిగా రీచార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ వాహనం ఈ20ను కంపెనీ డిస్ప్లే చేసింది. ఇక టూవీలర్ల విషయానికొస్తే 300 సీసీ బైక్ మోజోను ఆవిష్కరించింది. ఈ ఏడాదే ఈ బైక్‌ను మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. టాటా మోటార్స్: కార్లలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ అందించడానికి టాటా మోటార్స్, శామ్సంగ్ కంపెనీలు చేతులు కలిపాయి. శామ్సంగ్ అందించే మిర్రర్లింక్ టెక్నాలజీతోకూడిన డ్రైవ్ లింక్ యాప్‌తో ప్రయాణికుల వాహనాలను టాటా మోటార్స్ వచ్చే ఏడాది అందించనున్నది. ఈ టెక్నాలజీ వల్ల కారును నడిపే డ్రైవర్ కాల్స్‌కు ఆన్సర్ చేయవచ్చు. ఇంటర్నెట్ను యాక్సెస్, మ్యూజిక్‌ను కూడా వినవచ్చు. జేబీఎం: వాహన విడిభాగాలు తయారు చేసే జేబీఎం గ్రూప్ సిటీలైఫ్ పేరుతో ఫ్లోర్ ఎత్తు తక్కువగా ఉండే సిటీ బస్‌ను ఆవిష్కరించింది. సీఎన్జీ, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ బస్సుల తయారీ ప్రాజెక్ట్ కోసం గత రెండేళ్లలో రూ. 500 కోట్లు పెట్టుబడులు పెట్టామని పేర్కొంది. ట్రయంఫ్: ఈ బ్రిటిష్ బైక్ కంపెనీ కొత్తగా డేటోన 675 బైక్‌ను ఆవిష్కరించింది. ధర రూ.10.15 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ తాజా బైక్‌తో కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న బైక్‌ల సంఖ్య 11కు చేరింది. డీఎస్కే హ్యోసంగ్: 250సీసీ బైక్ అక్విలా 250ను ఆవిష్కరించింది. ధర రూ. 2.69 లక్షలు. ఈ బైక్‌తో పాటు మరో మూడు బైక్‌లు-ఆర్టీ 125డీ, జీడీ 250ఎన్, కామెట్ 250లను కూడా డిస్ప్లే చేసింది. ఈ మూడు బైక్‌లను ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల కల్లా అందుబాటులోకి తెస్తామని వివరించింది. 125 సీసీ బైక్‌ను 2016లో మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. హీరో: మూడు కొత్త స్కూటర్ మోడళ్లు- 110 సీసీ డాష్, 110 సీసీ డేర్, 100 సీసీ జిర్లను ఆవిష్కరించింది. ఈ మూడు స్కూటర్లను ప్రముఖ హిందీ సినిమా నటుడు రణబీర్ కపూర్ ఆవిష్కరించారు. డాష్, డేర్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా అందిస్తామని పేర్కొంది. పెట్టుబడులు.. వచ్చే మూడేళ్లలో రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ పేర్కొంది. ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, భారత్‌లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, రూ.6,200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హిందూజా గ్రూప్ పేర్కొంది. రియల్టీ, మీడియా, విద్యుత్తు వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని పేర్కొంది. వాహన ప్యాకేజీ కావాలి: ప్రఫుల్ గ్రేటర్ నోయిడా: అమ్మకాలు తగ్గి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వాహన రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ అందించడం అవసరమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ కోరారు. ఈ ప్యాకేజీలో భాగంగా వాణిజ్య వాహనాలపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడం, ఇతరత్రా చర్యలను తీసుకోవాలని సూచించారు. అన్ని సెగ్మెంట్ల వాహనాల అమ్మకాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్థిక మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నామని, వాహన రంగానికి వీలైనంత మేలు చేసే చర్యలు తీసుకుంటామని ఆయన అభయం ఇచ్చారు. ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆయన మాట్లాడారు.