breaking news
Australian captain
-
ఒక్కటైనా గెలుస్తారా..!
ఎప్పుడో 27 ఏళ్ల క్రితం భారత్ చివరిసారిగా 0-5తో వెస్టిండీస్ చేతిలో వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది. ఈ మధ్యలో ఎన్ని సిరీస్‌లు ఓడినా అంతటి పరాభవం మళ్లీ చవిచూడలేదు. కానీ ఇప్పుడు ధోని సేన ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఆసీస్‌తో సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత పరువు నిలబెట్టుకోవడం అనే మాట కూడా చిన్నగానే కనిపిస్తున్న చోట... కనీసం క్లీన్‌స్వీప్ కాకుండా తప్పించుకోగలదా? స్పిన్‌కు అనుకూలమైన సిడ్నీ మైదానంలో టీమిండియా ఏమైనా ప్రభావం చూపించగలదా? * నేడు ఐదో వన్డే * దోని సేనకు అగ్ని పరీక్ష * క్లీన్‌స్వీప్‌పై ఆసీస్ గురి * మ్యాచ్‌కు వర్ష సూచన సిడ్నీ: తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు ఇప్పటికే 0-4తో సిరీస్ ఓడిపోయింది. కొన్ని సందర్భాల్లో విజయావకాశాలు వచ్చినా వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. ముఖ్యంగా కచ్చితంగా గెలుస్తారనుకున్న గత మ్యాచ్‌ను కూడా అప్పగించింది. భారీ స్కోర్లు నమోదు చేయగలిగినా... గెలుపు మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో సిరీస్‌లో చివరి వన్డేలో నెగ్గాలంటే టీమిండియా రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడ నేడు (శనివారం) జరిగే ఐదో వన్డేలో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో జోరు మీదున్న కంగారూలు క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు. అశ్విన్‌కు అవకాశం... పరుగుల వరద పారిన గత మ్యాచ్‌లతో పోలిస్తే సిడ్నీ సాంప్రదాయకంగా స్పిన్ పిచ్ కావడం భారత్‌కు కాస్త అనుకూలాంశం. ఈ నేపథ్యంలో ఒక పేసర్ స్థానంలో అశ్విన్ బరిలోకి దిగడం దాదాపు ఖాయం. భువనేశ్వర్ లేదా రిషి ధావన్‌లలో ఒకరిపై వేటు పడవచ్చు. నాలుగు మ్యాచ్‌లలోనూ నిరాశపర్చిన బౌలింగ్ ఈసారైనా మెరుగ్గా ఉంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయవచ్చు. ఇక బ్యాటింగ్‌లో టాప్-3 మొత్తం భారాన్ని మోస్తున్నారు. రోహిత్, కోహ్లి రెండేసి సెంచరీలు చేయగా, శిఖర్ ధావన్ మరో శతకం బాదాడు. లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్లు తమ పాత్రకు న్యాయం చేస్తే మళ్లీ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తన వైఫల్యంతో కాన్బెర్రా మ్యాచ్‌ను అప్పగించిన ధోనిపై చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సిన బాధ్యత ఉంది. రహానే పూర్తిగా కోలుకోకపోతే రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా మనీశ్ పాండే బరిలోకి దిగుతాడు. అంతా ఫామ్‌లో... మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రతీ ఒక్కరు తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. ఫించ్, వార్నర్, స్మిత్, బెయిలీ, మ్యాక్స్‌వెల్... అంతా సిరీస్‌లో ప్రభావం చూపించారు. దాంతో ప్రతీసారి జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. దాంతో ఆ జట్టుకు బ్యాటింగ్ బెంగ లేదు. మిషెల్ మార్ష్ ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఒక రకంగా భారత్‌తో పోలిస్తే ఆసీస్ బౌలింగ్‌లోనే అనుభవలేమి కనిపిస్తోంది. హేస్టింగ్స్, రిచర్డ్సన్ ఆ జట్టుకు సంబంధించి ద్వితీయ శ్రేణి బౌలర్లు మాత్రమే. దాంతో వారు పెద్దగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేదు కానీ భారత్ స్వయంకృతం కారణంగానే మ్యాచ్‌లు ఓడింది. మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా ఆడలేకపోతే అతని స్థానంలో షాన్ మార్ష్ లేదా బోలండ్కు అవకాశం దక్కవచ్చు. ఈ మ్యాచ్ ఓడితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోతుంది. ఉదయం గం. 8. 50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం టర్నింగ్ వికెట్. స్పిన్నర్లకు అనుకూలం. మ్యాచ్ రోజున భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా కాకపోయినా కొంత వరకు మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. వాతావరణం బాగా లేకపోవడంతో శుక్రవారం భారత్ ప్రాక్టీస్ రద్దయింది. ‘పరాజయాలు ఎదురైనా జట్టులో ఆత్మవిశ్వాసానికి లోటు లేదు. ఈ మ్యాచ్‌తో పాటు వరుసగా మూడు టి20లూ గెలవగలమనే నమ్మకముంది. సొంతగడ్డపై ఆసీస్‌ను ఓడించాలంటే అంత సులువు కాదు. మాలో చాలా మందికి అనుభవం లేకపోవడం కూడా సమస్య.’ - విరాట్ కోహ్లి ‘5-0తో గెలవడమే మా లక్ష్యం. విజయంతో ముగించాలని కోరుకుంటున్నా. కాబట్టి ఉదాసీనతకు చోటు లేదు. గత మ్యాచ్‌లో మేం కోలుకొని గెలిచిన తీరు పట్ల సంతోషంగా ఉన్నా. వ్యక్తిగత మైలురాయిని చేరువగా ఉన్నప్పుడు ఆటగాళ్లు నెమ్మదించడం చాలా సహజం. ప్రపంచ వ్యాప్తంగా అందరు క్రికెటర్లు ఇలాగే చేస్తారు. కోహ్లి, రోహిత్ అత్యుత్తమ ఆటగాళ్లు. వారు అలా ఆడటం తప్పేమీ కాదు. దానిని స్వార్థం అనలేం. ఆస్ట్రేలియాలో గతంలోలాగే పేస్, బౌన్స్ పిచ్‌లు రావాలని కోరుకుంటున్నా.’ -స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ -
'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు'
సిడ్నీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను తక్కు వ అంచనా వేయొద్దని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ హెచ్చరించాడు. ఈ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆసీస్ 2-0 తేడాతో గెలిచినా.. టీమిండియా ఆటను తక్కువగా చూడొద్దని ఆసీస్ కు స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ లో టీమిండియా రాణించే అవకాశం ఉందన్నాడు.టీమిండియా రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతిని హస్సీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ లోని పిచ్ లను భారత్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్ట్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆటపై ఒక అభిప్రాయానికి రావొద్దని ఆసీస్ కు సూచించాడు. డిఫెండింగ్ చాంఫియన్ షిప్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా అంచనాలు మించి రాణించే అవకాశం లేకపోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
'క్లార్క్ కు కోలుకోవడానికి ఎక్కువ సమయం కావాలి'
సిడ్నీ: ఆసీస్ ఆటగాడు మైకేల్ క్లార్క్ గాయం నుంచి తిరిగి కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం కావాలిని మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. క్లార్క్ కు మరో రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని హస్సీ ఈ సందర్భంగా తెలిపాడు. ప్రపంచకప్ ఆరంభంలో పెద్దగా అద్బుతాలు ఏమీ ఉండవని.. అసలైన పోటీ క్వార్టర్ ఫైనల్ మరియు సెమీ ఫైనల్లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ఆసీస్ క్రికెటర్లు మరింత మంచి క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు హస్సీ తెలిపాడు.' క్లార్క్ కచ్చితంగా కీలక ఆటగాడు. కెప్టెన్ కూడా. ఆసీస్ కు అతని అవసరం చాలా ఉంది. అందువల్ల క్లార్క్ ఎక్కువ సమయం విశ్రాంతి కల్పిస్తే ప్రధాన మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడు' అని హస్సీ తెలిపాడు. తొలి నాలుగు మ్యాచ్ లకు అందుబాటులోకి రాకపోయినా పెద్దగా ఇబ్బందేమీ లేదన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్ కు ఎంపికైన క్లార్క్ ఫిబ్రవరి 21 లోపు తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాలి. 15 మందితో కూడిన జట్టు సభ్యుల జాబితాను ఆదివారం ప్రకటించారు. అదే నెల 14న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అదే రోజు తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా ఆడుతుంది. ప్రస్తుతం క్లార్క్ ఫిట్ నెస్ ఆసీస్ డైలామాలో పడింది. ఒకవేళ క్లార్క్ ఫిట్ నెస్ ను నిరూపించుకోకపోతే ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి వస్తుంది. టీమిండియాతో డిసెంబర్ 9 వ తేదీన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో క్లార్క్ గాయం తిరగబెట్టడంతో టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిన సంగతి తెలిసిందే.