breaking news
auction fail
-
అంగ్ సాన్ సూకీ ఇంటి కథ
యాంగూన్: తమ దేశంలో ప్రజాస్వామ్యం, పౌర ప్రభుత్వం సాధన కోసం పోరాడి ఏళ్లకు ఏళ్లు గృహనిర్బంధంలో గడిపిన మయన్మార్ నాయకురాలు అంగ్ సాన్ సూకీకి చెందిన నివాసం మూడోసారి వేలంలో వెళ్లింది. అయినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గత వేలంపాటతో పోలిస్తే ఆసారి కాస్తంత తక్కువగా రూ.1,231 కోట్లకు ఎవరైనా దీనిని కొనుగోలు చేయొచ్చని కామాయుత్ జిల్లా కోర్టు అధికారిణి వేలంపాటను మొదలెట్టినా ఎవ్వరూ ముందుకు రాలేదు. మూడేళ్లుగా సైనిక ప్రభుత్వం దిగ్భందంలో దేశం కల్లోలితంగా మారిన కారణంగా అనిశ్చితిలో ఇంతటి డబ్బు కుమ్మరించేందుకు ఎవరూ సాహసించట్లేరని మీడియాలో వార్తలొచ్చాయి.ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం యాంగూన్ సిటీలోని బహాన్ టౌన్షిప్లో ఇన్యా సరస్సు ఒడ్డున చుట్టూ పచ్చికతో తెలుపు వర్ణంలో హుందాగా కనిపించే ఈ ‘54 యూనివర్సిటీ అవెన్యూ’భవనానికి ఘన చరిత్రే ఉంది. 1953లో ఆంగ్ సాంగ్ సూకీ తన సోదరులు, తల్లితో కలిసి ఈ విల్లాలోకి మకాం మార్చారు. అప్పట్నుంచీ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ఇంట్లో ఎవరూ లేరు. సైనిక పాలన అంతానికి పోరాటం ఇక్కడే మొదలెట్టారు. అహింసా ఉద్యమానికి ఇక్కడి నుంచే ఎన్నో వ్యూహరచనలు చేశారు. తదనంతర కాలంలో సైనిక ప్రభుత్వం సూకీని ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచింది. ఏకంగా 15 సంవత్సరాలకుపైగా ఆమె ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉండిపోయారు. తర్వాత సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి సాధారణ ఎన్నికలు నిర్వహించాక అంగ్ సాన్ ఘన విజయం సాధించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. సూకీ ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగినప్పుడూ ఈ ఇంట్లోనే ఉన్నారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్సహా ఎందరో ప్రపంచ నేతలు అంగ్‌సాన్‌ను ఈ ఇంట్లోనే భేటీ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడూ ఆమె ఈ ఇంట్లోనే ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిౖకైన అంగ్ ప్రభుత్వాన్ని జుంటా సైన్యం 2021 ఫిబ్రవరిలో కూలదోసింది. ఆంగ్ ప్రభుత్వ పాలనలో పలు రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఈమెపై ఎన్నో రకాల కేసులు నమోదుచేసి ఏకంగా 27 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం తెల్సిందే.కోర్టులో వారసత్వ పోరురెండెకరాల స్థలంలో నిర్మించిన ఈ విల్లాపై వారసత్వంగా తనకూ హక్కు ఉంటుందని అంగ్‌సాన్ సూకీ అన్నయ్య అంగ్ సాన్ హో 2000 సంవత్సరంలో కోర్టుకెక్కారు. తన వాటా దక్కేలా చేయాలని యాంగూన్ హైకోర్టులో దావా వేశారు. అయితే ఈ దావా వెనుక జుంటా సైనికపాలకుల కుట్ర దాగుందని మీడియాలో వార్తలొచ్చాయి. హో ద్వారా సగం వాటా కొనేసి తర్వాత పూర్తి హక్కును దక్కించుకుని చిట్టచివరకు సూకీ జ్ఞాపకాలు జనం మదిలో లేకుండా దీనిని కూల్చేయాలని సైన్యం కుట్ర పన్నిందని అమెరికా మీడియాలో అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఈ భవనాన్ని జాతీయ స్మారకంగా మార్చాలని విపక్ష ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఆఫ్ మయన్మార్’ డిమాండ్ చేసింది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. చట్టప్రకారం అన్నా చెల్లెళ్లకు సమాన వాటా ఉంటుందని ఇంటిని వేలంవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో గత ఏడాది మార్చి 20న తొలిసారి, ఆగస్ట్ 15న రెండోసారి వేలంవేసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. -
మాల్యా విల్లాను కొనేవారే కరువయ్యారు
ముంబై: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన విల్లాను కొనేందుకు ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. గురువారం మూడోసారి వేలం నిర్వహించగా ఎవరూ పాల్గొనలేదు. గతంలో నిర్వహించిన వేలానికి స్పందన రాకపోవడంతో 5 శాతం డిస్కౌంట్‌తో రూ.81 కోట్ల రిజర్వ్ ధరగా విల్లాను మళ్లీ వేలానికి పెట్టారు. ఈ సారి బయ్యర్లు వస్తారని ఆశించామని, అయితే ఎవరూ బిడ్లను దాఖలు చేయకపోవడంతో వేలం ప్రక్రియ మళ్లీ ఆగిపోయిదని అధికారులు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో విల్లాకు ఇంత భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి బయ్యర్లు విముఖత చూపారని నిపుణులు చెబుతున్నారు. అక్టోబరులో ఈ విల్లాకు నిర్వహించిన వేలంలో రిజర్వ్ ధరను 85.29 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. తాజాగా నిర్వహించిన వేలంలో ఈ ధరను మరింత తగ్గించినా ఫలితం లేకపోయింది. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్ద ఈ విల్లా ఉంది. బ్యాంకులకు చెల్లించాల్సిన 9 వేల కోట్ల రూపాయలను మాల్యా ఎగవేసిన కేసులో బకాయిల వసూళ్ల కోసం ఈ విల్లాను వేలానికి పెట్టారు.